‘ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ప్రభుత్వానికి రుణం ఇప్పిస్తానని ఓ బీజేపీ ఎంపీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పారు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీని రేవంత్ సర్కారుకు పరిచయం చేసింది ఆ ఎంపీనే. ఆ కంపెనీ కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను తాకట్టు పెట్టించి పదివేల కోట్ల రుణం ఇప్పించింది. దీనికి గాను టీఐఏ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ.169 కోట్లను బ్రోకరేజీ కింద చెల్లించింది. ఈ వ్యవహారంలో బీజేపీకి చెందిన ఓ ఎంపీ కీలక పాత్రపోషించారు. ఆయనకు క్విడ్ ప్రో కో తరహాలో అనుచిత లబ్ధి చేకూర్చేందుకు రేవంత్ సిద్ధమయ్యారు.
– గత ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్
కంచ గచ్చిబౌలి భూములు తాకట్టు పెట్టించి, రుణం ఇప్పించడంలో సీఎం రేవంత్‌కు సహకరించింది ఓ బీజేపీ ఎంపీ అని నేను ఆనాడే చెప్పిన. ఇప్పుడు ఆ దొంగ బయటపడ్డాడు. ఆయన ఎవరో కాదు.. ఎంపీ సీఎం రమేశ్! రూ.1,665 కోట్ల ఫ్యూచర్ సిటీ రోడ్డు పనులను కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ బీజేపీ ఎంపీకి అప్పగించారు. అప్పటి ‘రుణం’ రేవంత్ ఇప్పుడిలా తీర్చుకున్నారు.
– శుక్రవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్
హైదరాబాద్, జూలై 25 (నమస్తేతెలంగాణ): ‘కంచ గచ్చిబౌలి అటవీ భూములను తాకట్టుపెట్టేందుకు సహకరించిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 1665 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిండు..ఆ ఎంపీ చేసిన తప్పుడు పనికి ఫ్యూచర్‌సిటీకి రోడ్డు వేసే పనులు అప్పగించిండు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన విమర్శలు చేశారు. ‘నేను మూడు నెలల కింద మీడియా సాక్షిగా చెప్పిన విషయం ఈ రోజు బట్టబయలైంది..ఈ రోజు ఈ వార్త పేపర్లలో కూడా వచ్చింది’ అని కుండబద్దలు కొట్టారు. ఈ కాంట్రా క్ట్ అప్పగింతల వ్యవహారమే కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందానికి సజీవ నిదర్శనమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అక్రమ కాంట్రాక్ట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని నిలదీశారు. గతంలోనూ అనేక సందర్భాల్లో రెండు జాతీయ పార్టీలు కలిసిపోయాయని గుర్తుచేశారు. ‘తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతున్నదని పార్లమెంట్ ఎన్నికల ముందు మన రాష్ర్టానికి వచ్చిన ప్రధాని మోదీ, రాష్ట్రం ఢిల్లీ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మారిందని హోమంత్రి అమిత్‌షా ఆరోపణలు గుప్పించారు. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడుల విషయంలోనూ ఇవే నాటకాలు ఆడారు.. దాడులపై ఈడీవోడు చెప్పడు.. పొంగులేటి నోరు తెరవడు..ఒకడు తేలుకుట్టిన దొంగ అయితే ఇంకోడు అంతకంటే పెద్ద.. ఇద్దరూ కలిసి సక్కగా సంసారం చేసుకుంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నరు’ అని నిప్పులు చెరిగారు.
‘కంచ గచ్చిబౌలి భూముల తాకట్టులో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని సుప్రీంకోర్టు నియమించిన ఎంపవర్ కమిటీ చెప్పినా బీజేపీ సర్కారు ఎందుకు పట్టించుకోవడంలేదు? కాంగ్రెస్‌ను ఎందుకు కాపాడుతున్నరు? రెండు పార్టీలు కలసి కేసీఆర్‌ను ఎందుకు బద్నాం చేస్తున్నయి?’ అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. యువత జట్టు కట్టి కదిలి పట్టుబట్టి ఈ రెండు పార్టీల కుట్రలను బద్దలుకొట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో బుద్ధిచెప్పి దగుల్బాజీల నుంచి రాష్ట్రాన్ని విడిపించుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఏనాటికైనా గులాబీ జెండానే, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని మరోమారు స్పష్టంచేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ నేతృత్వంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్వీలో టీఆర్‌వీఎస్‌పీ (తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేనా పరిషత్)ని విలీనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలకు గులాబీ కండువాలు కప్పి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ పోరాటంలో విద్యార్థులు కదంతొక్కితేనే తెలంగాణ కల సాకారమైందని వివరించారు. వచ్చిన తెలంగాణ భద్రంగా ఉండాలని కేసీఆర్ చేతుల్లో పెట్టారని పేర్కొన్నారు.
ఆయన పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని స్పష్టంచేశారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. నాడు ధాన్యం ఉత్పత్తిలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణను పంజాబ్, హర్యానాను తలదన్నెలా నంబర్‌వన్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. ఇందులో నల్లగొండ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. మిషన్‌కాకతీయ, రైతుబంధు, 24 గంటల ఫ్రీ కరెంట్, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సాగు ను సుసంపన్నం చేశారని చెప్పారు. ‘ఇది సీటీలు కొడితే కాలేదు..కష్టపడితేనే సాధ్యమైంది’ అని చెప్పారు. నల్లగొండ ప్రజలు కాళేశ్వరానికి హారతులు పట్టారని గుర్తుచేశారు. రాష్ట్రం రాకముందు నల్లగొండ ఫ్లోరైడ్ కోరల్లో చిక్కి విలవిలలాడిందని, ఈ ప్రాంతానికి చెందిన దుశ్చర్ల సత్యనారాయణ ఫ్లోరైడ్‌తో బా ధపడుతున్న తన బిడ్డను ప్రధానికి టేబుల్‌పై పడుకోబెట్టి చూపెట్టినా ఫలితం లేకుండా పో యిందని వాపోయారు. కానీ కేసీఆర్ మాత్రం చౌటుప్పల్‌లో మిషన్ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరించి, బృహత్తర ప్రాజెక్టుకు ఇక్కడి నుంచే అంకురార్పణ చేసి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టారని ఉద్ఘాటించారు. మిర్యాలగూడ నియోజకవర్గం దామెరచర్లలో 4000 మెగావాట్ల ఆ ల్ట్రా పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేశారని, యాదాద్రిని పునర్నిర్మించారని చెప్పారు. ఇవేమీ తెలియనట్టు కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ఏం చేశారని అడగడం విడ్డూరంగా ఉన్నదని మం డిపడ్డారు.
ట్యాపింగ్‌పైనా రేవంత్‌రెడ్డి నిస్సిగ్గుగా మాటమార్చిండు. నిన్నటిదాకా ట్యాపింగ్ కుంభకోణం, కుట్రకోణం అంటూ బీరాలు పలికి ఇప్పుడు ట్యాపింగ్ సహజమని, తానుకూడా చేస్తున్నానని సిగ్గు లేకుండా చెప్తున్నడు. ఫార్ములా ఈ వ్యవహారంలోనూ ఇదే పద్ధతిలో డైవర్షన్ గేమ్ నడుపుతున్నడు. విద్యార్థులు, అవ్వాతాతలు రేవంత్‌ను నిలదీయకుండా బిజీగా ఉండాలని యూట్యూబుల్లో బీఆర్ఎస్ నేతలపై తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టిస్తూ తప్పుదోవపట్టిస్తున్నడు.
-కేటీఆర్
కొన్నిసార్లు అబద్ధాల ముందు నిజాలు కూడా ఒడిపోతాయని కేటీఆర్ చెప్పారు. ‘ఓట్ల కోసం రేవంత్‌రెడ్డి విద్యార్థులకు విద్యాభరోసా కార్డు ఇస్తామని, మహిళలకు ప్రతినెలా రూ. 2500 జమచేస్తామని, స్కూటీలు అందజేస్తామని, ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా ఇస్తామని, 24 గంటలు కాదు 48 గంటలు ఫ్రీ కరెంట్ సరఫరా చేస్తామని, ఇలా అందమైన అబద్ధాలను కూర్చి మ్యానిఫెస్టోను తయారు చేశారు..అది కాంగ్రెస్ అభయాస్తం కాదు.. తెలంగాణ ప్రజలకు చేసిన అతిపెద్ద మోసం’ అని ఎండగట్టారు. ఉద్యోగాల భర్తీ విషయంలోనూ పచ్చిఅబద్ధాలు చెప్తున్నారని దుయ్యబట్టారు. ‘అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ అశోక్‌నగర్ చౌరస్తాకు వచ్చి కాఫీ తాగుతూ కేసీఆర్ రెండు ఉద్యోగాలు ఊడగొడితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టారు..కానీ ఏడాదిన్నర దాటినా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో రాహుల్ సమాధానం చెప్పాలి’ అని ప్రశ్నించారు. విద్యార్థులకు క్రెడిట్ కార్డు ఇస్తామని హామీ ఇచ్చి వెన్నుచూపి పారిపోయారని నిప్పులు చెరిగారు. మందికి పుట్టిన బిడ్డలు మాబిడ్డలన్న చందంగా కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెడితే రేవంత్‌రెడ్డి వచ్చి 60 వేల మందికి కాయిదాలు ఇచ్చి తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు.
ఇక్కడ తప్పుల తడకగా కులగణన చేసిన రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పోయి కొత్త నాటకానికి తెరలేపారని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘ఆయన మొన్న పెట్టిన మీటింగ్‌కు హాజరుకానని సోనియాగాంధీ రాసిన లేఖను చూపి ఇదే తనకు ఆస్కార్ అవార్డు అని, లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అని చెప్పుకోవడం సిగ్గుచేటు.. అసలు ఆ లెటర్లో ఉన్నదేంటి? ఆయనకు అర్థమైందేంటి? దేనికి పరవశించిపోవడం?’ అని ప్రశ్నించారు. ఆయన చేసే మోసాలకు, చెప్పే అబద్ధాలకు ఇవ్వాల్సింది ఆస్కార్ కాదని, భాస్కర్ అవార్డు అని ఎద్దేవా చేశారు. మన ముఖ్యమంత్రికి చదువురాదని, మీరైనా చదువు నేర్పించి కండ్లు తెరిపించాలని చురకలంటించారు.
ఏడాదిన్నర పాలనలో రేవంత్‌రెడ్డి ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. టైంపాస్ పనులు తప్ప చేసిందేమీలేదని ఫైర్ అయ్యారు. ట్యాపింగ్‌పై కూడా నిస్సిగ్గుగా మాటమార్చడం ఆయనకే చెల్లిందని దెప్పిపొడిచారు. నిన్నటిదాకా ట్యాపింగ్ కుంభకోణం, కుట్రకోణం అంటూ బీరాలు పలికి ఇప్పుడు ట్యాపింగ్ చేయడం సహజమని, తానుకూడా చేస్తున్నానని చెప్పడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. ఫార్ములా ఈ వ్యవహారంలోనూ ఇదే పద్ధతిలో డైవర్షన్ గేమ్ నడుపుతున్నారని విమర్శించారు. విద్యార్థులు, అవ్వాతాతలు రేవంత్‌ను నిలదీయకుండా బిజీగా ఉండాలని యూట్యూబ్‌ల్లో బీఆర్ఎస్ నేతలపై తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టిస్తూ తప్పుదోవపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘అయినా రేవంత్‌రెడ్డి రో జూ ఓర్లుతనే ఉంటడు..విద్యుత్తు కుంభకోణమని, కాళేశ్వరం లంభకోణమని, ఫార్ము లా ఈ మోసమని చెప్పిన అబద్ధాలనే చెప్తాఉంట డు..మీరు ఫోన్లు ఒత్తుతనే ఉంటరు..ఇప్పటికై నా అప్రమత్తం కండి. యూట్యూబ్ పిచ్చిల ప డితే మోసపోయేది మనమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని హితబోధ చేశారు.
తాను మొన్న పెట్టిన మీటింగ్‌కు హాజరుకానని సోనియాగాంధీ రాసిన లేఖను చూపి ఇదే తనకు ఆస్కార్ అవార్డు, లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు.. అసలు ఆ లెటర్లో ఉన్నదేమిటి? ఆయనకు అర్థమైందేమిటి? దేనికి పరవశించిపోవడం? ఆయన చేసే మోసాలకు, చెప్పే అబద్ధాలకు ఇవ్వాల్సింది ఆస్కార్ కాదని, భాస్కర్ అవార్డు.
-కేటీఆర్
కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించిన వారి గొంతులు నొక్కుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడు థంబ్‌నెయిల్స్‌తో విషప్రచారం చేస్తున్న ఓ చానల్ నిర్వాకాన్ని సహించలేక బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ 10 మందిని వెంటబెట్టుకొని నిరసన తెలిపితే అరెస్ట్‌లు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వారిపై అటెంప్ట్ మర్డర్ కేసులు బుక్ చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. నలుగురిని 17 రోజులు జైల్లో పెట్టి నరకయాతనకు గురిచేయడం బాధాకరమని వాపోయారు. ‘అందులోని మా తమ్ముడు శ్రీనివాస్ భార్య శ్వేత ఫోన్ ఇవ్వనని చెప్పినందుకు ఆమెపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణం. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పెట్టిన పోస్టును రీపోస్టు చేసిన నల్లబాలు అలియాస్ శశిధర్ విషయంలోనూ ఇలానే దుర్మార్గంగా వ్యవహరించారు. కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన యువకుడు సాయిలును బట్టలు విప్పి కొట్టి అవమానించారు.
ఆయనను అవమానించిన చోటే సాయిలుకు ఈరోజు సన్మానం చేసి వచ్చాం. అయినా ఇద్దరు పిల్లలున్న మహిళపై కనికరం చూపకుండా కేసు పెడతారా? పథకాలు ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే అరెస్ట్ చేస్తారా? ఇదేనా ఇందిరమ్మ పాలనా? ఇదేనా కాంగ్రెస్ గ్రామ స్వరాజ్యం?’ అని నిప్పులు చెరిగారు. ‘అధికారాన్ని అడ్డంపెట్టుకొని విర్రవీగుతున్న కాంగ్రెస్ నాయకులు, వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు, పోలీసుల తోలు తీస్తాం’ అని హెచ్చరించారు. మూడేండ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అతిగా వ్యహరిస్తున్న ఎంత పెద్ద అధికారులైనా చివరికి కలెక్టర్లయినా వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. యువత కూడా ఆలోచించాలని, కేసీఆర్ నాయకత్వం, గులాబీ జెండాయే రాష్ర్టానికి శ్రీరామరక్ష అనే విషయాన్ని గ్రహించాలని కోరారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు.