హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ ) : ‘కేసీఆర్ పాలనే కావాలి.. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి’ అంటూ ఆటోడ్రైవర్లు సోమవారం తెలంగాణ భవన్ వద్ద నినాదాలతో హోరెత్తించారు. ఓరుగల్లులో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ అభిమానం చాటుకుంటామని రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లంతా కలిసి బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్ల కోసం తమవంతుగా రూ.26 వేల విరాళం చెక్కును ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అందించారు. దానిని సున్నితంగా తిరస్కరించిన కేటీఆర్.. ‘మీరే కష్టాల్లో ఉన్నరు.. విరాళం వద్దు’ అని తిరిగి వారికే ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో వేలమంది ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ విరాళాన్ని వారి కుటుంబాలకు వినియోగించాలని సూచించారు. మీ మద్దతే మాకు గొప్ప విరాళమని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ ఆటోడ్రైవర్లతో కలిసి రజతోత్సవ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లమంతా బయలుదేరుతామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఆటోడ్రైవర్లకు బూడిదే మిగిలిందని ఆవేదన వ్యక్తంచేశారు. అటు ఆర్టీసీ కార్మికులకు కూడా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నదని వాపోయారు. కేసీఆర్ పాలనలోనే ఆటో డ్రైవర్లంతా సంతోషంగా ఉన్నట్టు ఆటో జేఏసీ నాయకుడు నిరంజన్ గుర్తుచేశారు. కరోనా సమయంలోనూ మోటారు వాహన పన్నును రద్దు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు.