హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులు జరిగిన పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరాబర్ ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పునరుద్ఘాటించారు. ఆయా నియోజకవర్గాల్లో ఫిరాయింపుదారులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీని మోసం చేసినవారికి బుద్ధిచెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని, మళ్లీ నాలుగేండ్లలో కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణభవన్‌లో బుధవారం హనుమకొం డ నియోజకవర్గ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో పెద్దపదవులు అనుభవించిన కొందరు సిగ్గులేకుండా పార్టీని వీడిపోయారని, హైకోర్టు ఆర్డర్‌తో వారి లో భయం మొదలైందని పేర్కొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉపఎన్నిక వస్తదని, అక్కడ బీఆర్ఎస్ గెలుస్తదని, అక్కడి నుంచి రాజయ్యను ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీ నేతలు రక్షణకవచంగా, అండగా నిలుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో అవినీతి జరిగితే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నోరు మెదపడంలేదని, మరో మంత్రి బండి సంజయ్ గబ్బుగబ్బు మాట్లాడుతున్నారని, ఆ పార్టీ ఎంపీలు, నేతలు రేవంత్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని నడుపుడంటే పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదనే విషయం రేవంత్‌కు ఇప్పుడు అర్థమవుతున్నట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రేవంత్ పరిపాలన చూసిన తరువాత కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ వివరించారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఆయన సోదరుడే రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడని, ఆ వెయ్యికోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
చిట్టినాయుడు, ఆయన అన్నదమ్ములు రాష్ర్టాని దోచుకుంటున్నారని, మంత్రులు ఎకడికకడ దోపీడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వరంగల్‌కు చేసింది చెప్పుకోలేకపోయాం. బీఆర్ఎస్ హయాంలో వరంగల్ నగరానికి రూ.వేల కోట్ల కేటాయించగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా అభివృద్ధి పనులను రద్దు చేస్తున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. వరంగల్‌కు తెలంగాణలోనే అతి పెద్ద దవాఖాన, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్, ఐటీ కంపెనీలను తీసుకొచ్చినా గత ఎన్నికల్లో సరిగ్గా చెప్పుకోలేకపోయామని పేర్కొన్నారు. ఎంజీఎం దవాఖాన పనులు ఎకడికకడ నిలిచిపోయాయని, దీనిపై ఆందోళన చేయాలని పార్టీ నాయకులకు సూచించారు.
వరంగల్‌ను ఐటీ హబ్ చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలు దానిని గబ్బు చేయకుంటే చాలని ఎద్దేవా చేశారు. హైడ్రా డ్రామా వరంగల్‌లో కూడా మొదలవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హామీల అమలు కోసం కమిటీలు వేసుకుందామని, ఆ బృందం షాడో గవర్నమెంట్ మాదిరిగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పనిచేస్తుందని కేటీఆర్ వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, డిప్యూటీ మేయర్ మసూద్, సుంచు కృష్ణ, వీరేందర్, నయీం, రాంబాబు, సారంగపాణి తదితరులుపాల్గొన్నారు.
దాస్యం వినయ్‌భాస్కర్ నిబద్ధత కలిగిన, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడని కేటీఆర్ కొనియాడారు. వినయ్‌భాస్కర్ భవిష్యత్‌లో తప్పకుండా మంత్రి అయితడని చెప్పారు. రాష్ట్రంలో చాలామంది బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, ఇంకో వందేండ్లు ఉండేవిధంగా పార్టీని బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన మాకొద్దు అంటూ ప్రజలు గగ్గొలు పెడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పతనం హనుమకొండ నుంచే ప్రారంభంకావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ అన్ని వర్గాలను అతి తక్కువ సమయంలోనే మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కుతుందని పేర్కొన్నారు.