KTR | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): అమెరికా, బ్రిటన్ పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం లండన్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు అక్కడి ఎన్నారైలు ఘనస్వాగతం పలికారు. లండన్‌లో జరిగే ఇండియా వీక్- 2025తో పాటు అమెరికాలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరినకేటీఆర్.. సాయంత్రం లండన్ చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలకడానికి తెలంగాణ ప్రవాసులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు. ‘వెల్ కం కేటీఆర్’ అంటూ భారీ బ్యానర్‌ను విమానాశ్రయంలో ప్రదర్శించారు.
ప్రాగ్మ్యాటిక్ డిజైన్ సొల్యూషన్ లిమిటెడ్ (పీడీఎస్ఎల్) కంపెనీ డైరెక్టర్ల బృందం, వారి కుటుంబసభ్యులు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి కేటీఆర్‌కు స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని పేరుపేరునా కేటీఆర్ పలకరిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నారైలు కేటీఆర్‌తో సెల్ఫీలు దిగి ఆనందం వ్యక్తంచేశారు. ఈ నెల 30న బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో లండన్‌లో జరిగే ఇండియా వీక్- 2025లో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు. వివిధ దేశాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు పాల్గొనే ఈ సమావేశంలో తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కేంద్రంగా సాగిన పాలన, ఆలోచనలు అద్భుత ఆవిషరణలుగా మారిన విధానంతోపాటు తెలంగాణ విజయ ప్రస్థానాన్ని కేటీఆర్ వివరించనున్నారు. అనంతరం మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు ఆర్ అండ్ డీ సేవలను అందించే పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్‌ను కూడా ప్రారంభించనున్నారు. యూకే పర్యటనలో భాగంగా వివిధ దేశాలకు చెందిన మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులను కలువనున్నారు.
యూఎస్ఏలో కేటీఆర్ షెడ్యూల్
అమెరికాలో తెలంగాణ ఎన్నారైలు నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. జూన్ 1న టెక్సాస్ లోని ఫ్రిసోలోని కొమెరికా సెంటర్లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ 25 ఏండ్ల రజతోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వేలాది మంది ఎన్నారైలు హాజరుకానున్నారు. జూన్ 2న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డాలస్ (యూటీ డాలస్)లోని భారతీయ విద్యార్థులను కేటీఆర్ కలుస్తారు. నూతన ఆవిషరణలు, ఆంత్రప్రెన్యూర్షిప్తోపాటు భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి కేటీఆర్ ప్రసంగించనున్నారు. కేటీఆర్ యూకే, యూఎస్ఏ పర్యటనపై అకడి ఎన్నారైలు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు దేశాల్లోని తెలంగాణ ప్రవాసులు, ప్రవాస భారతీయులు, విద్యార్థులను కేటీఆర్ కలవబోతున్నారు. కేటీఆర్‌తోపాటు లండన్‌కు బయలుదేరి వెళ్లిన వారిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే చందర్, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ దామోదర్, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్ ఉన్నారు.
సందడి చేస్తున్న తెలంగాణ నేతలు
మంగళవారం ఆస్టిన్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎన్నారై సెల్ నేతలు అభిలాష్ రంగినేని, వంశీ కంచర్లకుంట్ల, శ్రీధర్‌రెడ్డి, వ్యాళ్ల హరీశ్‌రెడ్డి, వెంకట్ మంతెన, శ్రీనివాస్ పొన్నాల, శీతల్ గంపవరం, అరుణ్, వెంకట్‌గౌడ్ దుడాల, రాజ్ పడిగల, మల్లిక్, నవీన్ కనుగంటి, సుధీర్ జలగం, స్ఫూర్తి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. న్యూజెర్సీలో జరిగిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బాల్క సుమన్, క్రాంతికిరణ్ చంటి, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, పార్టీ నాయకురాలు రోజా మాధవరం, బీఆర్ఎస్ వింగ్ నేతలు యుగంధర్, జకిరెడ్డి శ్రీనివాస్, రవి ధన్నపునేని, మహేశ్ పొగాకు తదితరులు పాల్గొన్నారు. నార్త్ కరోలినాలోని హోలీస్ప్రింగ్, రాలీ యూనిట్లో జరిగిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, టీటీజీఏ అధ్యక్షురాలు భారతి వెంకన్నగారి, ఎన్నారై నాయకులు చంద్ర ఎల్లపంతుల, కృష్ణ పెందోటి, మహిపాల్ బేరెడ్డి, హరీశ్ కుందూర్, పున్నం కొల్లూరు, వీరేందర్ బొకా, శంకర్ రేపాల, అరుణజ్యోతి కట, శ్రీధర్ అంచూరి, రఘుయాదవ్, రాజు కటకం, శ్రీనాథ్ అంబటి, క్రాంతికుమార్ కటకం, ఉమేశ్ పరేపల్లి, హరి అప్పని, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో హ్యూస్టన్, కాలిఫోర్నియా, డెలావేర్ తదితర పట్టణాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహించనున్నారు. సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు హాజరుకానున్నారు.
యూఎస్‌లో బీఆర్ఎస్ సందడి
బీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో జూన్ 1న డాలస్‌లో రజతోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో తెలంగాణ బిడ్డలతోపాటు తెలుగువారు నివసిస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సందడి నెలకొన్నది. డాక్టర్ పెప్పర్ ఎరినాలో రాష్ట్ర అవతరణ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవాలను ఏకాలంలో నిర్వహించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యూఎస్ఏలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ నుంచి వెళ్లిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ఆయా సమావేశాల్లో పాల్గొంటూ, అమెరికాలోని వివిధ నగరాల్లో ఉంటున్న తెలంగాణ బిడ్డలను కలుస్తున్నారు. డాలస్ సభ కార్యక్రమాలను బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల, బీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ మహేశ్ తన్నీరు సమన్వయం చేస్తున్నారు.