KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో బీసీల సమావేశం అనంతరం జమిలి ఎన్నికలపై మీడియా అడిగిన ఒక ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ, జమిలి ఎన్నికలను ఏ విధంగా నిర్వహించబోతుందో మరిన్ని వివరాలు ఇవ్వాలని, కేంద్రం తన వైఖరిని విడమర్చి స్పష్టత ఇవ్వాలని కోరారు.
మూడు నెలల క్రితమే పార్లమెంట్‌కు ఎన్నికలు జరిగాయని, జమిలి ఎన్నికల అంటే అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు రద్దు చేసి ఎన్నికలు తీసుకువస్తారా? దశల వారిగా తీసుకువస్తారా? వచ్చే జనవరి, ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయని, వీటన్నింటిపై ఏ విధంగా చేస్తారో చెప్పాల్సి ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు మరో ఐదేండ్ల సమయముందని, వీటి టర్మ్లపై ఏం చేయబోతున్నారనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలన్నారు. జనాభా లెకలతో పాటు సీట్ల పునర్విభజన జరగాల్సి ఉందని, మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాల్సి ఉందన్నారు. వీటిపై కేంద్రం స్పష్టత ఇస్తే .. బీఆర్ఎస్ కూడా జమిలి ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్ తెలిపారు.