KTR | హైదరాబాద్, అక్టోబరు 9 (నమస్తే తెలంగాణ) : మూసీ సుందరీకరణ పేరుతో 1.50 లక్షల కోట్లలో లక్ష కోట్ల సొమ్మును రాహుల్, రేవంత్‌రెడ్డి పంచుకునేందుకు సిద్ధమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సంక్షేమ పథకాల్లో కమీషన్లు రావనే ఉద్దేశంతోనే వాటిని అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బతుకమ్మ, దసరా పండుగ వాతావరణమే లేదని, కేసీఆర్ సీఎంగా ఉండి ఉంటే చీరలు, రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అరాచకాలను చూసి ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ హామీల పేరుతో చేసిన మోసాలను చూసి హర్యానా ప్రజలను ఆ పార్టీకి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ సహా ఆయన అనుచరులు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ యూపీలో సీఎం బుల్డోజర్రాజ్ను నడిపిస్తున్నాడని గతంలో అనుకున్నామని, ఇప్పుడు తెలంగాణలో కూడా బుల్డోజర్ సంసృతి తీసుకొచ్చారని చెప్పారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పది నెలల పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని విమర్శించారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం రోజునే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని రేవంత్, రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారని, మరో డిసెంబర్ 9 రాబోతున్నా ఇప్పటికీ రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పారు. రాహుల్‌గాంధీకి, రేవంత్‌రెడ్డికి తప్ప తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాలేదని మండిపడ్డారు.
మహిళలకు రూ.2500 ఇస్తామన్నారని, 1.67 కోట్ల మంది మహిళలు రూ.2500 కోసం వేచి చూస్తున్నారని కేటీఆర్ తెలిపారు. వృద్ధులకు రూ.4వేలు అన్నారని, ఇంట్లో ఇద్దరికీ పింఛన్ అన్నారని, ఒకరికైనా వచ్చిందా? అని ప్రశ్నించారు. ఉన్న రైతుబంధు, ఉన్న పింఛన్ కూడా వస్తలేదని, కల్యాణలక్ష్మి పేరుతో తులం బంగారమిస్తా అన్నాడని, తులం ఇనుము కూడా ఇవ్వడంటూ ఎద్దేవా చేశారు.
420 హామీల గురించి అడిగితే సమాధానం చెప్పడం లేదని, మూసీ కోసం లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానంటున్నాడని దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణ పేరిట లక్షకోట్లకు ఎసరు పెట్టారని, అందులో సగం రాహుల్ గాంధీ, వాళ్ల బావ, మిగిలిన సగం రేవంత్‌రెడ్డి పంచుకోవాలని ప్లాన్ వేశారని ఆరోపించారు. హామీలు, పథకాలపై ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణలో గ్యారెంటీల పేరుతో మోసం చేశారని, హర్యానాలో ఏడు గ్యారెంటీలంటూ మోసం చేయబోయారని, కాంగ్రెస్ మోసాలను గుర్తించి అక్కడి ప్రజలు సరైన బుద్ధి చెప్పారని, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. హామీలు నెరవేర్చకుంటే ఇక్కడి ప్రజలు కూడా గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
కేసీఆర్ సీఎంగా లేరన్న బాధ..
రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఇప్పుడు కేసీఆర్ సీఎంగా లేరన్న బాధలో ఉన్నారని, పేదల కోసం కేసీఆర్ అన్నీ చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ ఉన్నంత వరకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సెక్యులర్ వైఖరినే కొనసాగిస్తామని, మనిషిని మనిషిగా చూస్తూ భవిష్యత్తులోనూ ఇదే తరహా రాజకీయం చేస్తామని స్పష్టంచేశారు. మోదీ తమను బెదిరించేందుకు తన చెల్లిని జైల్లో పెట్టించినా తాము తలవంచలేదని, ఆయనతో పోరాటం చేశామని, అదే స్ఫూర్తితో కాంగ్రెస్‌తోనూ పోరాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
కేసీఆర్ ఉద్యోగం పోగొట్టండి.. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలిస్తమని రాహుల్‌గాంధీ అశోక్‌నగర్ వచ్చి యువతకు హామీ ఇచ్చిండు. ఇప్పుడు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఇద్దరికే తప్ప తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాలేదు.
– కేటీఆర్
రాష్ట్ర ప్రజలందరికీ కేటీఆర్ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల ఖాతాల్లోకి టింగ్‌టింగ్‌మని డబ్బులు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందేవి అని గుర్తుచేశారు. ఈ సారి బతుకమ్మ బతుకమ్మలా దసరా దసరాలా లేదని, రాష్ట్రంలో పండుగ జరుపుకొనే పరిస్థితి లేకుండా భయానక వాతావారణం సృష్టించారని వాపోయారు. ఆడబిడ్డలు బతుకమ్మ అడుకుంటామంటే డీజేలను కూడా బంద్పెట్టారని మండిపడ్డారు. మంగళవారం వరంగల్‌లో ఓ ఎమ్మార్వో బతుకమ్మ ఘాట్‌ను చూసేందుకు వెళ్తే ఇండ్లు కూలగొట్టేందుకు వచ్చారనుకొని అక్కడివాళ్లు తరమికొట్టారని, రేవంత్‌రెడ్డి వచ్చాక రాష్ట్రంలో పరిస్థితి ఇలా తయారైందంటూ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సెక్యులరిజాన్ని కొనసాగిస్తం.. మనిషిని మనిషిగా చూస్తూ భవిష్యత్తులోనూ ఇదే రాజకీయం చేస్తం. మోదీ మమ్మల్ని బెదిరించేందుకు ప్రయత్నించిండు. నా చెల్లిని తీహార్ జైల్లో పెట్టిండు. అయినా మేము తలవంచలే. మోదీతోనే పోరాడినం. అదే స్ఫూర్తిని కొనసాగిస్తం. పేదలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతం.
– కేటీఆర్
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతులు, మహిళలు, పేదలు తమ భూములను ప్రభుత్వం అక్రమంగా గుంజుకుంటున్నదని ఆవేదనతో అండగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి కోరారని, ఆయన పాదయాత్ర చేస్తే రేవంత్‌రెడ్డి సూచన మేరకు దుర్మార్గంగా, అరాచకంగా, అక్రమంగా అరెస్ట్ చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
అకడ రైతుల మీద లాఠీచార్జీ చేశారని చెప్పారు. ‘నీ సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనే ప్రజలను ఒప్పించ చేతకాని నీవు రాష్ర్టాన్ని ఎట్ల నడిపిస్తవ్?, నిన్ను ప్రజలు ఎట్లా నమ్ముతరు?’ అంటూ కేటీఆర్ నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యేవైతే రైతులను ఒప్పించి మెప్పించి, వారి భయాలు, అనుమానాలను నివృత్తి చేసి భూములను తీసుకోవాలని సూచించారు.
తమ పార్టీ నేత పట్నం నరేందర్‌రెడ్డి సహా బీఆర్ఎస్ కార్యకర్తలను, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలుష్య కారక పరిశ్రమ ఏది పెట్టినా ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే పెట్టాలని చెప్పారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, టీ రాజయ్య, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, గువ్వల బాలరాజు, పీ విష్ణువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పీ కార్తీక్‌రెడ్డి, గజ్జెల నగేశ్, దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, తుంగ బాలు పాల్గొన్నారు.