KTR | వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడ బిగిసింది పిడికిళ్లు కాదు.. పిడుగులు అని వ్యాఖ్యానించారు. అవి స్వరాలు కాదు.. భాస్వరాలు అని పేర్కొన్నారు.
నాడు చెరలబడ్డ తెలంగాణ విముక్తి కోసం.. నేడు చెరబట్టిన తెలంగాణ విముక్తి కోసం జనాలు కదిలివచ్చారని కేటీఆర్ అన్నారు. లాఠీలు, తూటాలు, కేసులు, జైళ్లు .. ఈ నేలకు కొత్త కాదని తెలిపారు. నాడు స్వాతంత్ర్య సమరం నుంచి, సాయుధ రైతాంగ పోరాటం వరకు, నాన్ ముల్కీ ఉద్యమం నుంచి 2014 తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఈ పిడికిళ్లే పిడుగులై గర్జించాయని అన్నారు. ఈ అరాచక, అసమర్థ కాంగ్రెస్ పాలనను పారద్రోలే వరకు.. గర్జిస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు.
కాగా, సోమవారం నాడు కేటీఆర్ ప్రమాదానికి గురయ్యారు. జిమ్లో వర్కవుట్ చేస్తుండగా ఆయన గాయపడ్డారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వెన్నుపూసకు గాయం కావడంతో కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.