KTR | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో చోటుచేసుకొన్న వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ను కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రశ్నించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న ఈ కుంభకోణం వ్యవహారంలో తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు రహస్య లింక్ ఉన్నదనే వార్తలు వస్తున్నాయని, అయినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
కోట్లాది రూపాయల ఈ కుంభకోణం, తెలంగాణ నాయకులకు దానితో ఉన్న లింకులకు సంబంధించి తగిన ఆధారాలు ఉన్నా రాష్ట్రంలో చర్యలు తీసుకోవడంలో ఈడీ ఎందుకు మౌనం దాల్చిందని నిలదీశారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ను కాపాడుతున్నది ఎవరు? ఏమైనా సమాధానం ఉందా?’ అని కేటీఆర్ ఈడీని ప్రశ్నించారు. వాల్మీకి సామ్ వ్యవహారంలో తలెత్తుతున్న పలు ప్రశ్నలను ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేశారు.