హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌కు అధికారమిచ్చిన పాపానికి తెలంగాణను అదానీకి అప్పగించాలని చూస్తే సహించబోమని, రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు. హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ-సెబీ వ్యవహారంపై దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన సందర్భంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి కేటీఆర్ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో అదే అదానీ కంపెనీకి స్వాగతం పలకడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? అదానీపై జాతీయ కాంగ్రెస్‌కు ఒక నీతి.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మరో నీతా?’ అని ప్రశ్నించారు.
‘ఒకవైపు మీరేమో అదానీ-సెబీ ఆరోపణలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తున్నారు. కానీ, ఇకడ (తెలంగాణలో) మీ కాం గ్రెస్ సీఎం మాత్రం అదానీకి రెడ్‌కార్పెట్ పరుస్తున్నారు. అదానీ కంపెనీకి ద్వారాలు తెరుస్తున్నారు. విద్యుత్తు పంపిణీ వ్యవస్థను ఏకంగా అదానీకే అప్పగిస్తున్నారు’ అని కేటిఆర్ ధ్వజమెత్తారు. అదానీ-కాంగ్రెస్ మిలాఖతై లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారనే అనుమానాలకు బలం చేకూరేలా తెలంగాణలో పరిణామాలు ఉన్నాయని విమర్శించారు. అదానీ వల్ల దేశానికి నష్టం అన్నప్పుడు.. తెలంగాణకు లాభమెలా అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం?
‘తెలంగాణలో అదానీ కంపెనీల ఆగమనాన్ని రాహుల్‌గాంధీ ఆపగలరా? తమ పార్టీ ముఖ్యమంత్రి నిర్వాకాన్ని నిలదీసే ధైర్యం చేయగలరా? అదానీ పెట్టుబడులకు ఫుల్స్టాప్ పెట్టగలరా? రేవంత్‌రెడ్డికి మొట్టికాయలు వేయగలరా? అంత శక్తి రాహుల్‌గాంధీకి ఉన్నదా?’ అంటూ రాహుల్‌పై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. అదానీపై ఢిల్లీ కాంగ్రెస్‌ది ఒకమాట, గల్లీ కాంగ్రెస్‌ది మరో మాటనా? అని మండిపడ్డారు. అదానీపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌లో ఈ ద్వంద్వ వైఖరి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం కాదా? అని నిలదీశారు.