ఏ కంపెనీని ఆంధ్రా కంపెనీ అన్నారో, ఏ కంపెనీని కమీషన్ల కంపెనీ అన్నారో, ఏ కంపెనీని అరాచక కంపెనీ అన్నారో ఆ మేఘా కంపెనీకే మూసీ ప్రాజెక్టు పనులను కూడా అప్పగించి భారీ దోపిడీకి స్కెచ్ వేస్తున్నారు. అధికారం చేపట్టి 11 నెలలైనా నాడు ఈస్టిండియా కంపెనీ అంటూ దూషించిన మేఘాపై రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
-కేటీఆర్
కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? బీజేపోళ్లు నిద్రపోతున్నారా? నిజాయతీ ఉంటే ఎందుకు విచారణ జరపడం లేదు.
సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టు ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లు నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు పెడితే, మేము అధికారంలోకి వచ్చాక విచారణ తప్పదు. అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి.
రేవంత్‌కు ఇరుపక్కలా…
అటు ప్రధాని, ఇటు అదానీ మధ్యలో మూసీ మేఘా కహానీ
ఇస్తి వాయనం
దామగుండం.. ప్రధానికిరామన్నపేట.. అదానీకి మధ్యలో మూసీ.. మేఘాకు
పుచ్చుకుంటి వాయనం
1100 కోట్ల అమృత్ ప్రాజెక్టు రేవంత్ బావమరిది సృజన్‌రెడ్డికి
4,350 కోట్ల కొడంగల్ ఎత్తిపోతల పథకం
సరిగ్గా సగం మేఘా కంపెనీకి మరో సగం రాఘవ కంపెనీకి వాటికోసం ప్రఖ్యాత ఎల్అండ్ టీ, ఎన్సీసీలపై అనర్హత
నాడు ఈస్ట్.. నేడు బెస్ట్
ఒకప్పుడు మేఘాను ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ అంటూ పిలిచిన రేవంత్‌కు సీఎం కాగానే అదే కంపెనీ ‘బెస్ట్ ఇండియా కంపెనీ’గా మారింది.
KTR | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ 11 నెలల పాలన కుంభకోణాల పాలనగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్కువ ఖర్చుతో అయ్యే ప్రాజెక్టుల ప్రతిపాదనలను మార్చి, బడ్జెట్‌ను అమాంతం పెంచి ప్రజాధనం దోచుకొనేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ప్రఖ్యాత కంపెనీలను టెక్నికల్ బిడ్లలోనే తప్పించి తన బావమరిది కంపెనీకి అమృత్ టెండర్లు, మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కంపెనీకి, ఈస్టిండియా కంపెనీ అని తాను దూషించిన మేఘా సంస్థకు రేవంత్‌రెడ్డి దోచిపెడుతున్నారని ఆరోపించారు.
ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి దోపిడీకి పాల్పడుతున్నా కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రూ.4,350 కోట్ల కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మేఘా, రాఘవ కంపెనీలు చెరిసగం పంచుకోవడం భారీ కుంభకోణమని ఆరోపించారు. గోదావరి నీళ్ల ను హైదరాబాద్‌కు తెచ్చేందుకు రూ.11వందల కోట్లతో అయిపోయే దానికి రూ.5,500 కోట్లు వెచ్చిస్తూ భారీ సాం చేయబోతున్నారని దుయ్యబట్టారు. ఇక్కడ రూ.4,000 కోట్ల స్కాం జరుగబోతున్నదని పేర్కొన్నారు.
తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, పార్టీ నేత లక్ష్మారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈస్టిండియా కంపెనీ అని విమర్శించిన మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఇప్పుడు భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టులకు ఎందుకు అప్పగిస్తున్నావని రేవంత్‌రెడ్డిని కేటీఆర్ విమర్శించారు.
ఆ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. పైగా రూ.4,350 కోట్ల కొండగల్ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పనులనూ మెఘాకు ఎందుకు అప్పగించారు? అని నిలదీశారు. సుంకిశాలలో మేఘా సంస్థ నెగ్లిజన్స్తో రిటైనింగ్‌వాల్ కూలి రూ.70-80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని, ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ప్రభుత్వం కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ధ్వజమెత్తారు.
గోదావరి జలాలను హైదరాబాద్‌కు తెచ్చేందుకు రూ.1,100 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను పక్కన బెట్టి అదే పని చేపట్టే ప్రాజెక్టును రూ.5,500 కోట్లకు పెంచడం మరో కుంభకోణం కాదా? అని నిలదీశారు. ప్రఖ్యాత ఎల్అండ్డీ, ఎస్సీసీ కంపెనీలను కాదని, బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు.
ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధన ఉల్లంఘించడం కాదా? అని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టు ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లు నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు పెడితే, తాము అధికారంలోకి వచ్చాక విచారణ తప్పదని హెచ్చరించారు. అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు. సాగునీటి రంగంలో కేసీఆర్ ఎంతో గొప్పగా పనిచేశారని, దేశంలో ఎవరూ చేయని విధంగా కాళేశ్వరం కట్టారని చెప్పారు. వాయువేగంతో తెలంగాణలో సాగు, తాగు నీటి ప్రాజెక్టులను కేసీఆర్ నిర్మించారని పేరొన్నారు. నీళ్లలో హక్కు కల్పించారని, తాగు, సాగునీటిలో దేశంలోనే అన్ని రాష్ర్టాలు ఆశ్చర్యపోయే విధంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు.
బీఆర్ఎస్ నాడు సాగు, తాగునీటి ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్న క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్‌రెడ్డి మేఘా కృష్ణారెడ్డి రెండు రాష్ర్టాల సీఈవోగా వ్యవహరిస్తున్నారని, ఈస్టిండియా కంపెనీ వలే మేఘా కంపెనీ తెలంగాణలో తయారైందంటూ ఆరోపించారని కేటీఆర్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా రేవంత్‌రెడ్డి కమీషన్ల కోసమే మేఘా కంపెనీ రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టిందని అన్నారని పేర్కొన్నారు. పీసీసీ వరింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా మేఘా కృష్ణారెడ్డిని పొలిటికల్ మాఫియా అంటూ కామెంట్ చేశారని చెప్పారు. ఇందుకు సంబంధించిన మూడు వీడియోలను కేటీఆర్‌కు మీడియాకు ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా మేఘా కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేశారనిపేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ రాష్ట్రాన్ని కుంభకోణాలు చేసి దోచుకుంటున్నారు. నేను చెప్పేది తప్పయితే దేనికైనా సిద్ధమే.
– కేటీఆర్
హైదరాబాద్‌కు 50 ఏండ్లపాటు తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండటానికి సుంకిశాల ప్రాజెక్ట్ చేపట్టామని కేటీఆర్ తెలిపారు. కానీ, రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని అన్నారు. సుంకిశాలలో మేఘా కంపెనీ నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా రిటైనింగ్‌వాల్ కూలిపోయిందని, రూ.70-80 కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరు అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటన అసలు బయటకు తెలియకుండా ముఖ్యమంత్రి సహా ప్రభుత్వం దాచి పెట్టిందని మండిపడ్డారు. ప్రమాదంపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ కోరామని, కంపెనీని బ్లాక్‌లిస్ట్ చేయాలని డిమాండ్ చేశామని గుర్తుచేశారు. మేడిగడ్డ ఘటనను సాకుగా చూపి కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు నీళ్లలో పోశారంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు సుంకిశాల ప్రమాదాన్ని మాత్రం దాచి పెట్టారని అన్నారు. డిపార్ట్మెంటల్ విచారణ చేసి నలుగురు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని, కంపెనీని బ్లాక్‌లిస్ట్ చేయలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ నడుపుతున్న పత్రికలోనే మేఘా సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని అధికారుల కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ చర్యలు లేవని రాశారని కేటీఆర్ గుర్తుచేశారు. ‘సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్ఫై చర్యలేవి? ఆగస్టు 2న రిటైనింగ్‌వాల్ కూలి నీటమునిగిన సర్జ్‌పూల్.. కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని విచారణ కమిటీ నివేదిక.. నేటికీ ఏజెన్సీపై చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు.. నామమాత్రంగా నలుగురు అధికారుల సస్పెన్షన్.. సాగర్ నీటిమట్టం తగ్గితేనే రిపేర్లకు చాన్స్.. అయోమయంలో సుంకిశాల ప్రాజెక్టు భవిష్యత్తు..’ అని పతాక శీర్షికలో రాసినట్టు కేటీఆర్ వివరించారు. నాడు తాము చెప్పిందే నేడు ‘వెలుగు’లో వచ్చిందని వివరించారు. వాల్ కూలి మూడు నెలలు గడిచినా నేటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. సుంకిశాల ప్రమాదానికి సంబంధించిన కమిటీ రిపోర్ట్‌ను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే రేవంత్‌రెడ్డి ఆ రిపోర్టును తారుమారు చేసినా చేస్తారని అనుమానం వ్యక్తంచేశారు.
కాళేశ్వరం నీళ్లను గండిపేటలో కలిపి మూసీలోకి పంపిస్తారంట. దీనికోసం రూ. 5,500 కోట్లు ఖర్చు చేస్తారంట.. ఇది మరొక కుంభకోణం. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లను హైదరాబాద్ తెచ్చేందుకు 2023 మే 18న రూ.11 వందల కోట్ల ఖర్చుతో అన్నీ సిద్ధం చేశాం. కానీ, పెద్ద ఎత్తున కుంభకోణం చేసేందుకే దీనిని రూ.5,500 కోట్లకు పెంచారు.
-కేటీఆర్
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు మేఘా కంపెనీకి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నారాయణపేట-కొడంగల్ కలిపి రెండు లక్షల ఎకరాలకు శ్రీశైలం నుంచి నీళ్లు ఇచ్చే ప్రాజెక్టును కేసీఆర్ తలపెట్టారని గుర్తుచేశారు. దానిని కొడంగల్-నారాయణపేట లిఫ్టు ఇరిగేషన్ అని పేరు మార్చి రెండు లక్షల ఎకరాల ఆయకట్టును లక్ష ఎకరాలకు కుదించి రూ.4,350 కోట్లతో మేఘా కంపెనీకి ఒక ప్యాకేజీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కంపెనీకి మరో ప్యాకేజీ ఇచ్చారని మండిపడ్డారు. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని మున్సిపల్ శాఖ అధికారులు సూచించిన మేఘాకు టెండరు అప్పగించడం వెనుక ఉద్దేశం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మేఘా కంపెనీకి ఇచ్చిన కొడంగల్ ప్రాజెక్టు పనులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్అండ్టీ, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్సీసీ) టెక్నికల్ బిడ్లలోనే తిరస్కరించారని విమర్శించారు. ఈ రెండు కంపెనీలు మేఘా, రాఘవ కంపెనీలు పుట్టకముందే అంతర్జాతీయ పనులు చేశాయని, వాటిని టెక్నికల్‌గా తప్పించి కేక్‌ను రెండు ముక్కలుగా కోసుకుతిన్నట్టు కొడంగల్ లిప్టు పనులను మేఘా, రాఘవ కంపెనీలు పంచుకున్నాయని మండిపడ్డారు. ‘రూ.4,350 కోట్లలో నీకు ముట్టిన కమీషన్ ఎంత? రాహుల్‌గాంధీకి ముట్టిన కమీషన్ ఎంత? మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఇటీవల స్కిల్ వర్సిటీకి రూ.200 కోట్లు ఇచ్చిన చందా ఈ దందా కోసమేనా? బ్లాక్‌లిస్ట్ చేయకుండా ఉండటానికేనా? కొడంగల్ వర్క్ కోసమేనా?’ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆడించినట్టల్లా ఆడితే అధికారుల ఉద్యోగాలు ఊడుతాయని కేటీఆర్ హెచ్చరించారు. రూ.1,100 కోట్లతో అయ్యే పనిని రూ.5,500 కోట్లతో అధికారులతో ప్రతిపాదనలు రూపొందిస్తున్నారని చెప్పారు. వాటాలు కూడా మాట్లాడుకున్నారని, లూటీకి స్కెచ్ జరుగుతున్నదని, ఈ పనులను కూడా మేఘాకే ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం ఉన్నదని విమర్శించారు. ‘కాళేశ్వరం నీళ్లను గండిపేటలో కలిపి మూసీలోకి పంపిస్తారంట. దీనికోసం రూ. 5,500 కోట్లు ఖర్చు చేస్తారంట.. ఇది మరొక కుంభకోణం’ అని కేటీఆర్ ఆరోపించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లను హైదరాబాద్ తెచ్చేందుకు 2023 మే 18న రూ.11 వందల కోట్లతో ఖర్చుతో అన్ని సిద్ధం చేశామని తెలిపారు. కానీ, పెద్దఎత్తున కుంభకోణం చేసేందుకే దీనిని రూ.5,500 కోట్లకు పెంచారని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్‌ను కూడా మేఘా సంస్థకే ఇవ్వడానికి అన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పారు. ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లు రేవంత్‌రెడ్డి చెప్పినట్టు సంతకం పెడితే తాము అధికారంలోకి వచ్చాక విచారణ తప్పదని, వాళ్ల ఉద్యోగాలు ఊడటం ఖాయమని హెచ్చరించారు. ఏ ఆఫీస్‌లో కూర్చొని పెరిగిన అంచనాలకు బిడ్లు సిద్ధం చేస్తున్నారో ఆ సంస్థ పేరు కూడా తమకు తెలుసని పేర్కొన్నారు.
మేడిగడ్డ ఘటనను సాకుగా చూపి కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు నీళ్లలో పోశారంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు సుంకిశాల ప్రమాదాన్ని మాత్రం దాచి పెట్టారు. డిపార్ట్మెంటల్ విచారణ చేసి నలుగురు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. కానీ, మేఘా కంపెనీని బ్లాక్‌లిస్ట్ చేయలేదు.
సుంకిశాల ప్రమాదానికి సంబంధించిన కమిటీ రిపోర్ట్‌ను వెంటనే బయటపెట్టాలి. లేదంటే రేవంత్‌రెడ్డి ఆ రిపోర్టును తారుమారు చేసినా చేస్తారు.
-కేటీఆర్
ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులకు ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ అనే నిబంధన ఉన్నట్టు తెలుసా? అని కేటీఆర్ ప్రశ్నించారు. క్యాబినెట్లో కూర్చున్న మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కంపెనీకి ప్రాజెక్టు పనులు ఎలా ఇస్తారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. కొడంగల్ ప్రాజెక్టు పనుల్లో ఒక అర్రలో కూర్చొని కాపీ కొట్టినట్టుగా మేఘా, రాఘవ కంపెనీలు 3.9%, 3.9% పంచుకున్నాయని, ఎల్-1గా ఒకసారి ఒకరు, ఎల్-2గా మరోసారి మరొకరు ఉన్నారని ఆరోపించారు. మరీ ఇంత ఓపెన్ లూటీయా? అని నిలదీశారు. ‘నకల్ మార్నేకేలియేభీ అకల్ చాహియే!’ అని ఎద్దేవాచేశారు.
ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన ఉన్నదని బీజేపీ నేతలకు తెలుసా? అని కేటీఆర్ నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డికి సహాయ మంత్రి అయిన బండి సంజయ్ ఎందుకు దీని మీద మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మోదీ ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ గురించి మాట్లాడతారు కానీ, ఇకడ ఎలాంటి చర్యలు ఉండవని విమర్శించారు. రేవంత్‌రెడ్డి తన బామ్మర్దికి అమృత్ టెండర్లు, తన క్యాబినెట్ మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ సంస్థలకు ప్రాజెక్టులను పంచుతున్నారని, ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాదా? అని నిలదీశారు. ఇంత ఓపెన్‌గా దోపిడీ జరుగుతున్నా కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఈ దేశంలో చట్టాలు ఉన్నాయా? ఇంత బహిరంగంగా దోపిడీ చేస్తుంటే ఈడీలు, సీబీఐలు, విజిలెన్స్‌లు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మీదికి మాత్రమే ఈడీ, విజిలెన్స్ అంటూ వస్తారా? అని నిలదీశారు.
‘పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు జరిగి నాలుగు వారాలు గడిచాయి. దానిపై తేలు కుట్టిన దొంగల్లా వాళ్లు మాట్లాడరు.. వీళ్లు మాట్లాడరు ఎందుకు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. దాడులపై ఇప్పటివరకు స్పందించకపోవడం అంటే బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయినట్టు స్పష్టంగా తెలిసిపోతున్నదని అన్నారు. కోహినూర్ హోటల్లో అదానీ కాళ్లు మొక్కారో, కడుపులో తలపెట్టుకున్నారో తనకేమి కాకుండా పొంగులేటి బతిమిలాడుకున్నారని ఎద్దేవా చేశారు. అమృత్ టెండర్లను సీఎం తన బావమరిదికి ఇచ్చిన విషయంలో కేంద్ర సంస్థలు ఎందుకు విచారణ జరపడం లేదని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. సుంకిశాలలో మేఘా చేసిన పనికి దేశమంతా ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. మేఘా సంస్థపై చర్యలు తీసుకోకపోతే చీల్చి చెండాడుతామని హెచ్చరించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ రాష్ట్రాన్ని కుంభకోణాలు చేసి దోచుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. తాను చెప్పేది తప్పయితే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. అస్మదీయలకు మేలు చేయకుండా, ఆశ్రితపక్షపాతం లేకుండా పనిచేస్తామని ప్రమాణం చేసి, ఆఫీస్ ఆఫ్ బెన్ఫిట్ చట్టాన్ని పట్టించుకోకుండా ఏ విధంగా కుటుంబసభ్యుల కంపెనీలకు పనులు కట్టబెడతారని ప్రశ్నించారు. అమృత్ టెండర్లను కూడా పొంగులేటి కంపెనీకి ఇచ్చారని అన్నారు. రాఘవ కంపెనీని కూడా గతంలో రేవంత్‌రెడ్డి తిట్టాడని, ఇప్పుడు మాత్రం ఆ కంపెనీకి పనులు ఇస్తున్నారని విమర్శించారు. మూసీని కూడా టెండర్లు కాకముందే మేఘాకు ఇవ్వాలని అన్ని ఏర్పాట్లు చేసేశారని అన్నారు. గోదావరి నీళ్లను హైదరాబాద్‌కు తెచ్చేందుకు రూ.11 వందల కోట్లతో అయిపోయే దానికి రూ. 5,500 కోట్ల భారీ సాం చేయబోతున్నారని ఆరోపించారు. ఇక్కడ 4,000 కోట్ల స్కాం జరుగబోతున్నదని అన్నారు.
రూ.4,350 కోట్లలో నీకు ముట్టిన కమీషన్ ఎంత? రాహుల్‌గాంధీకి ముట్టిన కమీషన్ ఎంత? మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఇటీవల స్కిల్ వర్సిటీకి రూ.200 కోట్లు ఇచ్చిన చందా ఈ దందా కోసమేనా? బ్లాక్‌లిస్టు చేయకుండా ఉండటానికేనా?కొడంగల్ వర్క్ కోసమేనా?
-కేటీఆర్
ఎన్నికల్లో ప్రయోజనం కోసం మేడిగడ్డలో ఒక పర్రెను పట్టుకొని లక్ష కోట్ల కుంభకోణం అన్నారని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు మేడిగడ్డ పర్రె విషయంలో ఈ అరాచక శక్తులే ఏదో కుట్ర చేశాయని అనుమానం వ్యక్తంచేశారు. మేడిగడ్డ వద్ద ఇప్పటికీ రిపేర్లు చేయకుండా అది కొట్టుకుపోవాలనే చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమృత్ టెండర్లను ముఖ్యమంత్రి బావమరిదికి రూ.11 వందల కోట్ల పనులను ఎలా ఇస్తారంటూ కేంద్రమంత్రికి తాను ఉత్తరం రాస్తే ఇప్పటివరకు స్పందన లేదని విమర్శించారు. గౌతమ్ అదానీ కొడుకుతో నాలుగు గంటలపాటు రేవంత్‌రెడ్డి ఇంట్లోనే చర్చలు జరిపారని ఆరోపించారు. మోదీ కోసం దామగుండం, అదానీకి సిమెంట్ ఫ్యాక్టరీ, మేఘా కృష్ణారెడ్డికి అన్ని ప్రాజెక్ట్‌లు ఇస్తున్నారని అన్నారు. రాయదుర్గంలో 84 ఎకరాలను కూడా అదానీకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఆరు గ్యారెంటీలకు, హామీల అమలుకు, ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు కూడా పైసలు లేవని రేవంత్‌రెడ్డి అంటున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. ఉద్యోగులు వెళ్లి డీఏ అడిగితే మార్చి దాకా ఆగాలని అంటున్నారని, కానీ మూసీ ప్రాజెక్ట్ కోసం మాత్రం ఆగమేఘాల మీద పనులు చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దానిని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అయిన మేఘాకు ఇవ్వడానికి అన్ని సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే మన వద్ద నుంచి మహారాష్ట్రకు మూటలు పోయాయని, ఢిల్లీకి కూడా ఈ కంపెనీ ద్వారా మూటలు పంపిస్తారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వెంటనే ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం కుంభకోణాలను ముందే ప్రజలకు వివరిస్తున్నానని తెలిపారు. ఎందుకు ఈ దోపిడీలు చేస్తున్నారో తమకు తెలుసని అన్నారు. రేవంత్‌రెడ్డి ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’తో కలిసి మూడు స్కామ్‌లకు తెరలేపుతున్నారని, ఈ మూడింటిని అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికలప్పుడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు కదా.. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రధాని మోదీని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఇకడ నిరాటకంగా రాహుల్, రేవంత్ (ఆర్ఆర్) ట్యాక్స్‌తోపాటు బిల్డర్ల నుంచి గజానికి వంద వసూలు చేస్తున్నారని తెలిపారు. అయినా కేంద్రం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. ఇంత అరాచకంగా అవినీతి, కుంభకోణాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. పొంగులేటి ఇంట్లో జరిగిన ఈడీ సోదాలపై ఇప్పటివరకు ఎందుకు బీజేపీ మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ‘అదానీతో మీ సంబంధాలు ఏ విధంగా బలపడుతున్నాయో మాకు తెలుసు. మీ కుంభకోణాలను బయటపెడుతున్నందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తారని కూడా తెలుసు. అయినా సరే ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం’ అని స్పష్టం చేశారు.
‘అందరి జాతకాలు చెప్తానంటున్న మంత్రి పొంగులేటీ.. నువ్వు ఎప్పుడు జైలుకు వెళ్తావో చూసుకో..’ అని కేటీఆర్ సెటైర్ వేశారు. నువ్వేమైనా హోమంత్రివా? డీజీపీవా? ఎవరు ఎప్పుడు జైలుకు వెళ్తారో నువ్వెట్ల చెప్తవ్? నువ్వు, నీ ముఖ్యమంత్రి మీ కుటుంబసభ్యులకు కోట్లు దండుకోవాలని టెంటర్లు కట్టబెడతవు. విచ్చలవిడిగా అవినీతి చేస్తరు. జైలుకు మాత్రం వేరేవాళ్లు పోవాల్నా? ఇదేనా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం? అని ప్రశ్నించారు. ఎవ్వరు, ఎప్పుడు అరెస్ట్ అవుతారో మంత్రి చెప్తారా? వీళ్లు ప్రభుత్వం నడుపుతున్నరా? సరస్ నడుపుతున్నరా? అని మండిపడ్డారు. ఈ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల బాగోతాలను బట్టలిప్పి ప్రజల ముందు నగ్నంగా నిలబెడతామని హెచ్చరించారు.
ప్రాజెక్టు: కాళేశ్వరం నీళ్లు మూసీలోకి వయా గండిపేట
చేపట్టే కంపెనీ – మేఘా
మొత్తం వ్యయం – రూ. 5,500 కోట్లు
నిజ వ్యయం – రూ. 1100 కోట్లే
అసలు విషయం : కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లను హైదరాబాద్‌కు తీసుకురావడానికి అవసరమయ్యే అన్నీ ప్రణాళికలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1100 కోట్ల కంటే మించదు. అయితే, ప్రభుత్వం దాన్ని రూ. 5,500 కోట్లకు పెంచింది.
కేటీఆర్ సంధించిన ప్రశ్నలు
ప్రాజెక్టు: కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్
వ్యయం: రూ. 4,350 కోట్లు
అప్పగించిన కంపెనీలు: మేఘా,
రాఘవ కన్స్ట్రక్షన్స్
బిడ్డింగ్‌లో పాల్గొన్న కంపెనీలు: ఎల్ అండ్ టీ, ఎన్సీసీ, మేఘా, రాఘవ కన్స్ట్రక్షన్స్
డిస్క్వాలిఫై అయిన కంపెనీలు: ఎల్ అండ్ టీ, ఎన్సీసీ (నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ)
చూపించిన కారణం: టెక్నికల్ బిడ్‌లో సమస్య(వివరణ మాత్రం లేదు)
కేటీఆర్ సంధించిన ప్రశ్నలు
ప్రాజెక్టు: మూసీ ప్రాజెక్టు
వ్యయం: రూ. లక్షన్నర కోట్లు
అప్పగించే కంపెనీ: మేఘా