KTR | సాగు నీటి రంగంలో కేసీఆర్ ఎంతో గొప్పగా పనిచేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా కాళేశ్వరం కట్టారని తెలిపారు. వాయు వేగంతో తెలంగాణలో సాగునీళ్ల ప్రాజెక్టులు కేసీఆర్ నిర్మించారని పేర్కొన్నారు. కానీ అప్పట్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కమీషన్ల కోసమే అంటూ రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడారని తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా మేఘా కృష్ణారెడ్డిని పొలిటికల్ మాఫియా అంటూ కామెంట్ చేశారని చెప్పారు. ఏ కంపెనీని ఆంధ్రా కంపెనీ అన్నారో.. ఏ కంపెనీని ఈస్ట్ ఇండియా అన్నారో, ఏ కంపెనీ అరాచక కంపెనీ అన్నారో ఆ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు.
హైదరాబాద్‌కు నీళ్లు తీసుకురావటానికి సుంకిశాల ప్రాజెక్ట్ చేపట్టామని కేటీఆర్ తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం, మున్సిపల్ మంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోవడం లేదని అన్నారు. సుంకిశాలలో మేఘా కంపెనీ క్రిమినల్ నెగ్లిజన్స్ కారణంగా రిటైనింగ్ వాల్ కూలిపోయిందని తెలిపారు. ఈ విషయాన్ని అసలు బయటకు తెలియకుండా ముఖ్యమంత్రి సహా ప్రభుత్వం దాచి పెట్టిందని మండిపడ్డారు. ఎందుకు దాచి పెట్టారో చెప్పాలంటూ గతంలోనే డిమాండ్ చేశానని అన్నారు. ప్రమాదంపై జ్యుడిషీయల్ ఎంక్వయిరీ కోరాను, కంపెనీని బ్లాక్ చేయాలని అడిగానని అన్నారు. మేడిగడ్డ ఘటనతో కాళేశ్వరంలో లక్ష కోట్లు నీళ్లలో పోశారంటూ ప్రచారం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్లు ఈ ప్రమాదాన్ని మాత్రం దాచి పెట్టారని అన్నారు. మొత్తం సంఘటనలో నలుగురు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని.. అంతేకానీ కంపెనీని బ్లాక్ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ నేత వివేక్ వెలుగు పేపర్ లోనే మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ చర్యలు లేవని రాశారని గుర్తుచేశారు. నేటికి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదంటూ.. సుంకిశాల అయోమయమంటూ కాంగ్రెస్ నేత పత్రికలోనే వార్త వచ్చిందని చెప్పారు.
కమీషన్లకు లొంగిపోయి.. అదే ఈస్ట్ ఇండియా కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చి దోచుకుంటున్న రేవంత్!
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/PysvcwcOEI
— BRS Party (@BRSparty) November 6, 2024
ఏ కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అని ముఖ్యమంత్రి అన్నారో అదే కంపెనీ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. మీరు వేసిన విచారణ కమిటీయే మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని రిపోర్ట్ ఇచ్చింటదని అన్నారు. కానీ దొంగలు, దొంగలు కలసి ఊళ్లు పంచుకున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా సంస్థ కు రాష్ట్రంలోని ప్రాజెక్ట్ లను కట్టబెడుతున్నారని విమర్శించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ. 4350 కోట్ల టెండర్‌ను మేఘా సంస్థకు అప్పగించావని.. బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని చెప్పిన సంస్థకు ఎందుకు కాంట్రాక్ట్ కట్టబెట్టావని ప్రశ్నించారు. సుంకిశాల ప్రాజెక్ట్ విషయంలో మేఘా సంస్థ పై చర్యలు తీసుకొని కాంట్రాక్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పెద్ద కుంభకోణమే అని. దానిని కూడా రద్దు చేయాలన్నారు.
ఎల్ అండ్ టీ, ఎన్సీసీ ని కాదంటూ టెక్నికల్ బిడ్ లో డిస్ క్వాలిఫై చేశారని కేటీఆర్ అన్నారు. కేవలం మేఘా, పొంగులేటి కి చెందిన రాఘవ సంస్థ కు మొత్తం పనులను రెండు కేకుల మాదిరిగా ముక్కలు ఇచ్చారని అన్నారు. మేఘా సంస్థతో కుమ్మక్కై డబ్బులు దండుకునే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రూ. 4350 కోట్లలో నీ వాటా ఎంత? ఢిల్లీ వాటా ఎంత? అని ప్రశ్నించారు. మొన్న స్కిల్ యూనివర్సిటీ కోసం రూ. 200 కోట్ల విరాళాన్ని ప్రాజెక్ట్ లు కట్టబెట్టినందుకే ఇచ్చారా? అని నిలదీశారు.
దొంగలు.. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఉన్నది రేవంత్ యవ్వారం.
సుంకిశాల ఘటనకు కారణమైన కాంట్రాక్ట్ సంస్థను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని అప్పుడే డిమాండ్ చేసాం.. ఇప్పటికీ చర్యలు తీసుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/Ug3nrfV1gR
— BRS Party (@BRSparty) November 6, 2024
కేబినెట్లో కూర్చున్న మంత్రి పొంగులేటికి సంబంధించిన కంపెనీకి మూసీ పనులు ఇస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందన్న విషయమన్న అసలు తెలుసా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రి అయిన బండి సంజయ్ ఎందుకు దీని మీద మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మోదీ ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ గురించి మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఎలాంటి చర్యలు ఉండవని విమర్శించారు. బావమరిదికి అమృత్ టెండర్లు.. మేఘా, రాఘవ సంస్థలకు ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి పంచుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ దేశంలో చట్టాలు ఉన్నాయా? ఇంత బహిరంగంగా దోపిడీ చేస్తుంటే ఈడీ లు విజిలెన్స్ లు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మీదికి మాత్రమే ఈడీ, విజిలెన్స్ అంటూ వస్తారా అని నిలదీశారు. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులకు సంబంధించి వాళ్లు మాట్లాడారు.. వీళ్లు మాట్లాడారు ఎందుకు అని ప్రశ్నించారు. కోహినూర్ హోటల్ లో అదానీ కాళ్లు మొక్కి ఏం కాకుండా పొంగులేటి బతిమిలాడుకున్నాడని వ్యాఖ్యానించారు. అమృత్ టెండర్లను సీఎం తన బావమరిదికి ఇచ్చిన విషయంలో కేంద్రం సంస్థలు ఎందుకు విచారణ జరపటం లేదు.. సీవీసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. మేఘా సంస్థ చేసిన పనికి దేశమంతా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అన్నారు .