KTR | ముఖం బాగోలేక అద్దం పగులగొట్టుకున్నట్లుగా రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, లాస్య నందిత చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ తీసుకొచ్చిన అప్పులతో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారో వివరించారు. అలాగే రేవంత్ రెడ్డి అప్పులు తెచ్చి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.
కేసీఆర్ అప్పులతో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టాడని కేటీఆర్ తెలిపారు. రైతుబంధు రూపంలో రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాలో వేశాడని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ రూపంలో రెండుసార్లు రూ.30వేల కోట్లు రైతుల ఖాతాలో వేశాడని చెప్పారు. రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టి విద్యుత్ వ్యవస్థను చక్కగా చేసిండని అన్నారు. ఇంటింటికీ నల్లా పెట్టిండు.. ఇంటింటికీ 20వేల నీళ్లు ఇచ్చిండని తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ కట్టించాడని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు డాక్టర్లు అయ్యే అవకాశం కల్పించాడని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిండని చెప్పారు. అత్యధిక ధాన్యం పండించి దేశానికే బువ్వపెట్టే స్థాయికి తెచ్చాడని తెలిపారు. 45 వేల చెరువులను మిషన్ కాకతీయ కింద బాగు చేసిండని అన్నారు. 15 లక్షల మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మీ కింద కట్నమిచ్చిండని చెప్పారు. 15లక్షల మంది మహిళలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండని అన్నారు. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2వేలు చేసిండని తెలిపారు.
మరి రెండున్నరేళ్లలో 4 లక్షల కోట్ల అప్పు చేసి రేవంత్ రెడ్డి ఏం అభివృద్ధి చేసిండని కేటీఆర్ ప్రశ్నించారు. మహిళలకు రూ.2500 ఇచ్చిండా.. వృద్ధులకు రూ.4వేల పింఛన్ ఇచ్చిండా అని నిలదీశారు. ఆడబిడ్డలకు స్కూటీలు లేవు కానీ.. రాష్ట్రంలో లూటీ జరుగుతుందని అన్నారు. నిరుద్యోగ యువతకు 2లక్షల ఉద్యోగాలిస్తానని అన్నాడని.. ఇచ్చాడా అని ప్రశ్నించారు. ఢిల్లీకి పంపించేందుకు రేవంత్ రెడ్డి డబ్బులు బాగానే కూడబెడుతున్నాడని అన్నారు.
రైతులకు యూరియా, కరెంట్ ఇచ్చే తెలివి లేదు.. కానీ రైతు డిస్కం పెడతాడట అని మండిపడ్డారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. రైతులపై రేవంత్ రెడ్డికి అంతే ప్రేమ ఉంటదని వ్యాఖ్యానించారు. రైతు డిస్కం పేరిట ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఎవరు నమ్మరని అన్నారు. ఊళ్లలో కాంగ్రెస్‌ను నమ్మినందుకు గోసపడుతున్నారని తెలిపారు.