హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ధిక్కారానికి ప్రజాకవి కాళోజీ ప్రతీక అని, ఆయన ప్రజా ఉద్యమాలకు జీవితాన్ని ధారబోసిన గొప్ప వ్యక్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీర్తించారు. కాళోజీ వర్ధంతి సందర్భంగా గురువారం ఎక్స్ వేదికగా కేటీఆర్ నివాళులర్పించారు. సమాజంలో అన్యాయాలు, అణచివేతలే ఇతివృత్తంగా రచనలు చేసి ప్రజల్లో చైతన్యాన్ని నింపిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు.
తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు..పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్ 9)ని కేసీఆర్ పాలనలో తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించి సమున్నతంగా గౌరవించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో వైద్య విద్యాలయానికి కాళోజీ పేరుపెట్టామని, వరంగల్లో సుందరమైన కాళేజీ కళాక్షేత్రం నిర్మించామని పేర్కొన్నారు.