చంపాపేట అలంపూర్, జనవరి 13: ఆత్మీయులు, అభిమానులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య నాగర్‌కర్నూల్ మాజీఎంపీ ఎంపీ మందా జగన్నాథం అంత్యక్రియలు సైదాబాద్‌లోని మహాప్రస్థానంలో జరిగాయి. కొంతకాలంగా అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన మందా జగన్నాథం భౌతికకాయాన్ని చంపాపేటలోని స్వగృహానికి తరలించగా అక్కడ వివిధ రాజకీయపార్టీల నేతలు, బంధుమిత్రులు నివాళులర్పించారు. కడసారి చూపు చూసి పుష్పాంజలి ఘటించారు. మందా జగన్నాథం భౌతికకాయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. మందా జగన్నాథం కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ రాజకీయాల్లో అజాతశత్రువుగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందిన మందా జగన్నాథం అందరి ఆప్తుడు అని కొనియాడారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాజకీయంగా మందా తనదైన శైలిలో చెరగని ముద్ర వేశారని స్మరించుకున్నారు. బీఆర్ఎస్ ఓ నిఖార్సయిన సీనియర్‌నేతను కోల్పోయిందని, అలాంటి రాజకీయనేత ఇకలేరన్న విషయం జీర్ణించుకోలేనిదని ఆవేదన వ్యక్తంచేశారు. మందా జగన్నాథం కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. మందా జగన్నాథం భౌతికకాయానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి నివాళులర్పించారు. మందా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మందా జగన్నాథంకు ఐఎస్ సదన్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ స్వప్న సుందర్‌రెడ్డి, బీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్మార్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్, స్థానిక డివిజన్ నాయకులు కట్ట వెంకటేశ్, వింజమూరి రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు.