హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ) : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుఅత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒకరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకొని, తప్పులుంటే సవరించుకోవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని నివాసంలో తన ఓటరు వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో నింపి ఎన్నికల అధికారులకు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు కూడా పాల్గొని తమ వివరాలను అధికారులకు అందజేసి, పౌర బాధ్యతను నెరవేర్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చూడాలని, నకిలీ ఓట్లను గుర్తించి తొలగించాలని అధికారులకు సూచించారు. దేశ పౌరుడిగా ఓటరు జాబితాలో సరైన వివరాలు నమోదు చేయడం ప్రతి ఒకరి బాధ్యత అని ఆయన గుర్తుచేశారు. బూత్‌స్థాయి నుంచి పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ, ఓటర్లకు అవగాహన కల్పించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.