లబ్ధిదారులకు మరోసారి మూడునెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈ నెల 20వ తేదీ నుంచి రేషన్‌డీలర్లకు బియ్యం సరఫరా చేయాల్సి ఉన్నా ఇంకా ప్రక్రియ మొదలుకాలేదు. అయితే పంపిణీలో ఎదురవుతున్న సమస్యలపై డీలర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బియ్యం నిల్వ సామర్థ్యంతోపాటు ఒక్కొక్కరి నుంచి వేలిముద్రలు తీసుకోవటానికి కనీసం 20నిమిషాల సమయం పడుతోందని పెదవి విరుస్తున్నారు. ఇరుకు ప్రదేశాల్లోనే రేషన్ దుకాణాలు నిర్వహిస్తున్నామని, ఏ నెలకు ఆ నెల బియ్యం పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 442 రేషన్ దుకాణాలు ఉండగా వీటిలో 320 ప్రైవేట్, 122 జీసీసీ డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్నారు. మూడు నెలలకు కలిపి 18.50 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు.
– అశ్వారావుపేట, జూలై 28
రేషన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ మూడునెలల బియ్యం పంపిణీ చేయనుంది. 2025 జూన్‌లో జూన్, జూలై, ఆగస్టు నెలల బియ్యం, అలాగే 2026 ఏప్రిల్ నెలలో ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యం పంపిణీ చేసింది. ఇప్పుడు ఆగస్టు నెలలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడునెలల బియ్యం మరోసారి పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అధికారులు కూడా రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా కోసం కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నా ఇప్పటివరకు దుకాణాలకు బియ్యం కోటా సరఫరా కాలేదు. ప్రతినెల 20వ తేదీ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి డీలర్లకు బియ్యం సరఫరా జరుగుతోంది. మరో ఐదురోజుల సమయం మాత్రమే ఉండటంతో రేషన్ దుకాణాలకు బియ్యం ఎలా చేరతాయన్న ప్రశ్న లబ్ధిదారుల్లో వ్యక్తమవుతోంది.
ప్రతినెలా బియ్యం పంపిణీలో రేషన్‌డీలర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులోనూ ఒకేసారి మూడునెలల బియ్యం పంపిణీ మరింత భారంగా మారింది. ముఖ్యంగా ఇరుకు గదుల్లోనే దుకాణాలు నిర్వహిస్తున్న డీలర్లు మూడునెలలు బియ్యం నిల్వ చేసుకోవటం కష్టంగా మారింది. దీంతో ఎప్పటికప్పుడు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం దిగుమతి చేసుకుని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఇదో ప్రహసనంలా మారింది. దీంతోపాటు ఒక్కొక్క లబ్ధిదారుడి నుంచి ఈ-పాస్ యంత్రంపై మూడుసార్లు వేలిముద్రలు తీసుకోవటం మరో పెద్ద సమస్య. దీనివల్ల ఒక్క లబ్ధిదారుడికి కనీసం 20 నిమిషాలు సమయం పడుతోంది.
తర్వాత మూడుసార్లు బియ్యం తూకం వేసి పంపిణీ చేయటం ఇబ్బందికరంగా ఉంది. డీలర్లకు తరుగు మరింత నష్టాన్ని కలిగిస్తుంది. కాటా వేయకుండానే నేరుగా వాహనాల నుంచి దిగుమతి చేయకుండా ఇతర వాహనాలకు ఎగుమతి చేయటంలో తరుగుతో డీలర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రతి నెలా ఒక క్వింటాకు 2 నుంచి 5కిలోల బియ్యం తక్కువ వస్తుంది. ఇంత హడావిడిలో ఈ తరుగు 5 నుంచి 10 కిలోలు ఉండొచ్చని ఆందోళన చెందుతున్నారు. ఈ నష్టాన్ని ప్రభుత్వం ఇచ్చే కమీషన్ నుంచి భరించాల్సి వస్తుందని, శ్రమ తప్ప చేస్తున్న పనికి తగ్గ ఆదాయం ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏ నెలకు ఆ నెల బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని డీలర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 442 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో 320 ప్రైవేట్, 122 జీసీసీ రేషన్‌డీలర్లు ప్రతినెలా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈసారి మూడు నెలలకు ఒకేసారి బియ్యం పంపిణీ చేయనుండటంతో జిల్లాకు 18,499.266 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించారు. జిల్లాలో మొత్తం 3,27,694 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో అంత్యోదయ కార్డులు 21,090లకు 62,396 మంది, అన్నపూర్ణ 3కార్డులకు ముగ్గురు, ఫుడ్ సెక్యూరిటీకార్డులు 3,06,601 కార్డులకు 9,04,707 మంది లబ్ధిదారులు ఉన్నారు.
అంత్యోదయ లబ్ధిదారులకు నెలకు 35కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు, ఫుడ్ సెక్యూరిటీ కార్డుదారులకు 6కిలోల చొప్పున ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తుంది. మూడు నెలల బియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులకు కూడా సమస్యలు తలెత్తనున్నాయి. శివారు గ్రామాల లబ్ధిదారులకు రేషన్‌దుకాణం వద్దకు వెళ్లటానికి కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో లబ్ధిదారుడికి బియ్యం పంపిణీ చేయాలంటే కనీసం 20- 30 నిమిషాల సమయం పడుతుంది. దీంతో దుకాణాల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితులు ఎదురుకానున్నాయి.
బియ్యం పంపిణీలో డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించాలి. ముఖ్యంగా బియ్యం నిల్వ సామర్థ్యం లేకపోవటం ప్రధాన సమస్య. దీనికితోడు తూకం లేకుండా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం సరఫరా చేస్తున్నారు. దీనివల్ల వచ్చే తరుగు ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నది. మూడునెలల బియ్యం పంపిణీ చేయాలంటే ఒక్కో లబ్ధిదారుడికి కనీసం 20నిమిషాలకు పైగా సమయం పడుతోంది. అంతసేపు నిరీక్షించాలంటే లబ్ధిదారులు అసహనానికి గురవుతారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏ నెలకు ఆ నెల బియ్యం కేటాయించాలి.
– కొడాలి వెంకటేశ్వరరావు, జిల్లా రేషన్‌డీలర్ల సంఘం మాజీ అధ్యక్షుడు