సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 9: సిరిసిల్ల నియోజకవర్గంలో బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. రోజంతా బిజీబిజీగా గడిపారు. పలు ఆలయాల్లో పూజలు చేశారు. తొలుత జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన హనుమాన్ పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా హనుమాన్ స్వాములతో కలిసి కేటీఆర్ సహపంక్తి భోజనం (భిక్ష) చేశారు. సుమారు రెండు గంటల పాటు భజన, పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల స్వాములు హర్షం వ్యక్తంచేశారు.
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వెయ్యి మందికి పైగా హనుమాన్ భక్తుల భజనలతో తెలంగాణ భవన్ పరిసరాలు ‘హనుమాన్, శ్రీరామ నామస్మరణ’తో మార్మోగాయి. హనుమాన్ స్వాములను కేటీఆర్ ఆప్యాయంగా పలకరించగా, ఆయనతో వారు ఫొటోలు తీసుకున్నారు. ఆ తర్వాత కోనరావుపేట మండలం మల్కపేటలోని సీతారామచంద్రస్వామి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు కేటీఆర్కు స్వామివారి కండువా కప్పి సత్కరించారు. అక్కడి నుంచి గంభీరావుపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ, పెద్దిరాజుల కల్యాణ మహోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసి కట్నకానుకలు సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, కొమిరిశెట్టి లక్ష్మణ్, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.