ఖమ్మం: కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రైతులకు బోగస్ మాటలు చెప్పి మోసం చేశారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారన్నారు. రూ.4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి వయోవృద్ధులను, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. ఖమ్మం పర్యటనలో భాగంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తున్నదని ప్రజలు బాధపడుతున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి. ప్రభుత్వంపై ప్రజలకు కోపం తీవ్ర స్థాయిలో ఉంది. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలి. రేవంత్ రెడ్డి భరతం పట్టే బాధ్యత సమష్టిగా తీసుకుందాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున సహకారం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలువస్తే ఏం జరుగుతుందో రేవంత్, బీజేపీకి తెలుసన్నారు. కేసీఆర్ 100 సీట్లతో ఏకపక్షంగా అధికారంలోకి వస్తారని అందరికీ తెలుసని చెప్పారు. కాంగ్రెస్ లాంటి దుర్మార్గులు ఉంటారని అంబేద్కర్ ఊహించలేదన్నారు.
ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి మాత్రం సున్నా. ముగ్గురు మంత్రులు ముగ్గురు మొనగాళ్లులా తిరుగుతున్నారని విమర్శించారు. ఓ మంత్రి బాంబులు.. బాంబులు అంటూ తిరుగుతున్నారని, చివరికి పొంగులేటి కాస్తా బాంబులేటిగా అయ్యారని చెప్పారు. ఎరువుల దుకాణాల వద్ద చెప్పులు, ఆధార్ కార్డులు పెడితే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో పార్టీకి అద్భుతమైన అవకాశం ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, తాటి వెంకటేశ్వర్లు, బానోత్ చంద్రవతి పాల్గొన్నారు. అనంతరం ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. ఆయన చిత్రపాటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.