హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో విశేష ధైర్య సాహసాలు ప్రదర్శించి రాష్ట్రపతి మెడల్ సాధించిన తెలంగాణ బిడ్డ కానిస్టేబుల్ యాదయ్యకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. శుక్రవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ ఏడు కత్తి పొట్లు పడి… రక్తం ధారలా కారుతున్నా చైన్ స్నాచింగ్ నిందితులను పట్టుకునేందుకు యాదయ్య చూపించిన తెగువ అసామాన్యమని పేర్కొన్నారు.
2022లో జరిగిన ఈ ఘటనలో యాదయ్య చూపిన సాహసానికి గుర్తింపుగా గౌరవం దక్కడం సం తోషకరమన్నారు. సమర్థ నాయకత్వంలో తెలంగాణ పోలీసులు శక్తివంచన లేకుండా ఎలా పని చేశారో తెలపడానికి ఈ ఉదంతం గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. యాదయ్య చూపించిన చిత్తశుద్ధి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు.