హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రాన్ని పారిశ్రామిక ప్రగతికి కేంద్రంగా మార్చాలన్న సమున్నత సంకల్పంతో కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘టీఎస్-ఐపాస్’ విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని సాక్షాత్తు నీతిఆయోగ్ తాజా నివేదికలో ప్రశంసించడం యావత్ తెలంగాణకు గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నీతిఆయోగ్ ‘అచీవింగ్ ఎఫీషియన్సీస్ ఇన్ ఎంస్ఎంఈ సెక్టర్ త్రూ కన్వర్జెన్స్ ఆఫ్ స్కీమ్స్’ నివేదికలో టీఎస్-ఐపాస్, టీ-ప్రైడ్, టీ-ఫండ్ అంశాలను ప్రస్తావించడం పట్ల ఆయన తన సంతోషాన్ని వ్యక్తంచేశారు.
ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పదేండ్ల కాలంలోనే దేశానికే పారిశ్రామిక దిక్సూచిగా మార్చడంలో టీఎస్-ఐపాస్ పోషించిన పాత్ర అత్యంత కీలకమని, జాతీయ స్థాయిలో అందరికీ అనుసరణీయమని కేంద్ర సంస్థ పేరొనడం కేసీఆర్ దార్శనికతకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. భారీ పరిశ్రమలకు తోడు, ఎంఎస్ఏంఈ విభాగంలో 2.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 25 లక్షల మందికిపైగా యువతకు గౌరవప్రదమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని కొనియాడారు.
పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న సవాలక్ష ప్రతిబంధకాలను సమూలంగా, శాశ్వతంగా రూపుమాపి సింగిల్విండో ద్వారా సకల అనుమతులు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దకిందని తెలిపారు. కేవలం 15 నుండి 30 రోజుల్లోనే అన్ని పర్మిషన్స్ ఇవ్వడంతోపాటు అవినీతికి, ఏమాత్రం తావులేని అత్యంత పారదర్శక పాలసీని రూపకల్పన చేయడమే కాకుండా.. అదే చిత్తశుద్ధితో దశాబ్దకాలంపాటు విజయవంతంగా అమలుచేయడం వల్లే ఈ ప్రతిష్టాత్మక ఫలితాలు, జాతీయస్థాయి గుర్తింపు సాధ్యమైందని వివరించారు.
ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల వరకు అందరూ తెలంగాణకు క్యూ కట్టేలా పెట్టుబడిదారుల్లో కొండంత విశ్వాసాన్ని కల్పించిన విప్లవాత్మక విధానాన్ని తీసుకొచ్చి పదేండ్లు దాటినా నేటికి టీఎస్-ఐపాస్ ప్రతిష్ట నలుదిశలా మారుమోగుతూనే ఉందని పేర్కొన్నారు. గతంలోనూ స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా కేసిఆర్ అమలుచేసిన రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, టీ హబ్ వంటి వినూత్న కార్యక్రమాలకు తోడు తాజాగా పారిశ్రామిక ప్రగతికి కూడా తెలంగాణ మోడలే ఆచరణీయమని నీతిఆయోగ్ ప్రకటించిన నేపథ్యంలో ఇకనైనా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే భ్రమల్లో బతికే అరాచక శక్తులు బుద్ధి తెచ్చుకుంటే మంచిదని హితవు పలికారు.