KTR | హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : ‘ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ప్రతీ పైసాకూ లెక్క ఉన్నది. ఒక్క రూపాయి కూడా వృథాకాలేదు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో అవినీతి, మనీలాండరింగ్ ఎకడు ఉన్నదని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్నా, లేకున్నా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే ప్రధాన లక్ష్యంగా భావిస్తానని తేల్చిచెప్పారు. గురువారం ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంపై ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు ఆయన తన ఎక్స్ వేదికగా వివిధ అంశాలను పేర్కొన్నారు. ఫార్ములా ఈ-కార్ రేస్ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపిందని గుర్తుచేశారు. అలాంటి గొప్ప పోటీలను నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్‌పై అమితమైన ప్రేమ ఉండాలని తెలిపారు.
ఫార్ములా ఈ రేస్ పోటీలను తీసుకొచ్చి ప్రపంచపటంలో హైదరాబాద్‌ను నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందని గుర్తుచేశారు. ఈ-రేస్ సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ-మొబిలిటీ రంగానికి చెంది న ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తిన విషయాన్ని కేటీఆర్ ఉదహరించారు. ఫార్ములా ఈ సంస్థకు రాష్ట్రప్రభుత్వం ఆనాడు పంపిన రూ.46 కోట్ల నగదు అత్యంత పారదర్శకంగా బదిలీ చేసినట్టు కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి రేస్ రద్దుకు తీసుకున్న అసంబద్ధ నిర్ణయం వల్లే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని స్పష్టంచేశారు.