వేములవాడ రూరల్, డిసెంబర్ 15 : గుండెపోటుతో మృతిచెందిన మురళి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్‌ఠాణా గ్రామానికి చెందిన చెర్ల మురళి ఇటీవలే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పోలింగ్ కంటే ముందే గుండెపోటుతో మరణించారు. కాగా ఎన్నికల్లో గ్రామస్థులంతా మురళిని సర్పంచ్‌గా గెలిపించుకోవడం సంచలనంగా మారింది. సోమవారం కేటీఆర్.. మురళి కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు.
అండగా ఉంటామని కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా మురళి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. మురళి కూతురు విద్యాభాసం అనంతరం ఉద్యోగానికి హామీ ఇచ్చారు. కాగా మాజీ వైస్ ఎంపీపీ ఆర్సీ రావు తండ్రి లక్ష్మణరావు మృతిచెందగా వారి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, సెస్ డైరెక్టర్ హరిచరణ్‌రావు, మాజీ సర్పంచ్ రాణి తదితరులు ఉన్నారు.