హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఎకడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని, ఓడిన చోటే గెలిచి చూపిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్ స్టార్ట్ చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై ఇప్పటి నుంచే పోరాటం మొదలుపెట్టాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశం మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు చేపడుతామని చెప్పారు. దివంగత మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచిందని గుర్తుచేశారు.
గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒకరూ కుటుంబసభ్యుల్లా పనిచేశారని ప్రశంసించారు. రేపు రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం, ఎమ్మెల్యే ఎన్నికల్లో వారు పడ్డకష్టానికి మించి తాము పనిచేస్తామని, కాలికి బలపం కట్టుకొని తిరుగుతామని భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై చర్చించేందుకు కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణభవన్‌లో బుధవారం కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలు, కాంగ్రెస్ దౌర్జన్యం, అరాచకాలను కార్యకర్తలు కేటీఆర్ దృష్టికి తెచ్చారు. డివిజన్ ఇన్చార్జులు, నాయకులు, కార్యకర్తల ఫీడ్‌బ్యాక్ తీసుకున్న అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కోవర్టులను దూరం పెట్టాలనే విలువైన సలహాలు ఇచ్చారని చెప్పారు. జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాకేశ్ వద్దకు ఎలా వెళ్లామో అలాగే అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీనగర్ కాలనీలోని ఆఫీసును కూడా యాక్టివ్‌లో ఉంచాలని సూచించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలు, కాంగ్రెస్ చేసిన దౌర్జన్యం, అరాచకాలను కార్యకర్తలు మా దృష్టికి తెచ్చిండ్రు. డివిజన్ ఇన్చార్జులు, నాయకులు, కార్యకర్తల ఫీడ్‌బ్యాక్ తీసుకున్నం. కోవర్టులను దూరం పెట్టాలనే విలువైన సలహాలు ఇచ్చిండ్రు. జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం.
– కేటీఆర్
జూబ్లీహిల్స్‌లో కొన్ని రాయించిన ఓట్లు, కొన్ని వేయించిన ఓట్లు, కొన్ని కొనుక్కున్న ఓట్లతోనే కాంగ్రెస్ గెలిచిందని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ ఇలా నాలుగు పార్టీలు కలిసి వచ్చి అక్రమాలకు పాల్పడినా బీఆర్ఎస్ సింగిల్‌గా కొట్లాడిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులు కర్ణాటక నుంచి మనుషులను తెచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారని, షేక్‌పేట, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో రిగ్గింగ్ చేశారని విమర్శించారు.
పోలీసులను అడ్డం పెట్టుకుని, డబ్బు, మద్యం పంచి గెలిచారని, ఇది నైతిక గెలుపు కాదని మండిపడ్డారు. వ్యక్తిగత విషాదంలో ఉన్నా హరీశ్‌రావు పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. తన అన్న చనిపోయినా అంత్యక్రియలు ముగించుకొని సాయంత్రానికే వచ్చి ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. డిసెంబర్‌లోపు సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. ఆ వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని 407 బూత్‌లలో ఒకో బూత్‌కు 10 మంది చొప్పున, మొత్తం 4,070 మందితో పటిష్టమైన సైన్యాన్ని నిర్మించుకోవాలని సూచించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు బయటివారు రారని, అందుకు అనుగుణంగా కార్యకర్తలను సిద్ధంచేసుకోవాలని కోరారు. గతంలో నష్టపోయిన చోటే తిరిగి బలాన్ని పుంజుకోవాలని చెప్పారు. ప్రజా సమస్యలపై ఇప్పటి నుంచే పోరాటం మొదలుపెట్టాలని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్, పార్టీ కార్యాలయాలు కార్యకర్తలకు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఏ కష్టం వచ్చినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
జూబ్లీహిల్స్‌లో కొన్ని రాయించిన ఓట్లు, కొన్ని వేయించిన ఓట్లు, కొన్ని కొనుకున్న ఓట్లతోనే కాంగ్రెస్ గెలిచింది. మనం సింగిల్‌గా కోట్లాడినం. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ ఇలా నాలుగు పార్టీలు కలిసి వచ్చి అక్రమాలకు పాల్పడ్డయి. కర్ణాటక నుంచి మనుషులను తెచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నరు. షేక్‌పేట, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో రిగ్గింగ్ చేసిండ్రు. పోలీసులను అడ్డం పెట్టుకొని డబ్బు, మద్యం పంచి గెలిచిండ్రు. ఇది నైతిక గెలుపు కాదు.
– కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై బీఆర్ఎస్ నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పోరాటస్ఫూర్తితో పనిచేసిన కార్యకర్తలదే నైతిక విజయమని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 18,000 ఓట్లు మాత్రమే వచ్చిన జూబ్లీహిల్స్‌లో, ఈ ఉప ఎన్నికలో 75,000 ఓట్లు సాధించడం కార్యకర్తల కృషికి నిదర్శనమని చెప్పారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతికంగా గెలిచి ఉండవచ్చని, కానీ నైతిక విజయం మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మదేనని స్పష్టంచేశారు. మైనారిటీల మద్దతు కోల్పోతున్నామని గుర్తించిన కాంగ్రెస్.. చివరి నిమిషంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చిందని గుర్తుచేశారు.
ఇది బీఆర్ఎస్ పోరాట ఫలితమేనని చెప్పారు. యూసుఫ్‌గూడ బెటాలియన్ సిబ్బందికి పోలింగ్‌కు రెండో రోజుల ముందు బకాయిలు చెల్లించారని, మిగతా బెటాలియన్లకు ఇవ్వలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం కలిసి పని చేశాయని విమర్శించారు. అప్పడప్పుడూ అనైతికం, అధర్మం కూడా గెలుస్తాయని, అంతిమ విజయం ధర్మానిదేనని స్పష్టంచేశారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లోనూ తాతాలికంగా ఓటమి ఎదురైనా, ఆ తర్వాత జరిగిన పరిణామాలు గెలుపును అందించాయని గుర్తుచేశారు. త్వరలోనే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని, పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
కేటీఆర్, తలసాని శ్రీనివాస్ సహా తామంతా కార్యకర్తలకు కుటుంబసభ్యులుగా అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. జీహెచ్ఎంసీ, ఇతర ఎన్నికల కోసం కలిసి పనిచేసి మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, వివేకానందగౌడ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, పీ విష్ణువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నేత మాగంటి సునీతా గోపీనాథ్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, నాయకులు సోహైల్, ఎంఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అప్పుడప్పుడు అనైతికం, అధర్మం కూడా ఎన్నికల్లో గెలుస్తూ ఉంటయ్. కానీ అంతిమ విజయం ధర్మానిదే. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లోనూ తాతాలికంగా ఓటమి ఎదురైనా ఆ తర్వాత జరిగిన పరిణామాలు గెలుపును అందించినయ్. త్వరలోనే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తరు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు.
– హరీశ్‌రావు