లగచర్ల భూబాధిత రైతులు పాత్లావత్ జ్యోతి-ప్రవీణ్‌నాయక్ బిడ్డకు ‘భూమి’గా నామకరణం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో పార్టీ నేతలు పట్నం నరేందర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి
Bhoomi Naik | వికారాబాద్, ఫిబ్రవరి 10, (నమస్తే తెలంగాణ): తాము ఆపదలో ఉన్నప్పుడు దేవుళ్లలా వచ్చి బీఆర్ఎస్ నాయకులంతా అండగా నిలిచారని, తన కూతురుకు పేరు పెట్టాలని కేటీఆర్‌ను లగచర్ల బాధితురాలు పాత్లావత్ జ్యోతి కోరింది. లగచర్ల భూ పోరాటం సమయంలో నిండు గర్భిణిగా ఉన్న జ్యోతికి 20 రోజుల కిందట పండంటి ఆడబిడ్డ పుట్టింది. కేటీఆర్‌కు జ్యోతి తన బిడ్డను చూపించి ‘అన్నా ఈ బిడ్డకు నువ్వే పేరు పెట్టు అంటూ జ్యోతి, భర్త ప్రవీణ్‌నాయక్ కోరారు. ఆడబిడ్డకు పేరు పెట్టాలని అడగగానే ఒక్కసారిగా కేటీఆర్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ‘భూ పోరాటంలో బిడ్డ పుట్టింది. అందుకే ఈ బిడ్డకు మూడు పేర్లు చెప్తా.. మీ ఇష్టమొచ్చిన పేరు పెట్టకోండి.. భూమి, ధాత్రి, అవని’ అని సూచించగా భూమి అనే పేరును తల్లిదండ్రులు ఖరారు చేశారు.
ఆ బిడ్డ పేరు పాత్లావత్ భూమినాయక్ అని కేటీఆర్ అనగానే ఒక్కసారిగా అందరూ కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తంచేశారు. నాడు నిండు గర్భిణిగా ఉన్న జ్యోతి భూ పోరాటంలో మొక్కవోని ధైర్యంతో పోరాటం చేసిందని కేటీఆర్ కొనియాడారు. రేపట్టి నుంచి భూమి నాయక్ అని పిలుస్తమనగానే గుండెనిండా సంతోషమనిపించిందని చెప్పా రు. ‘ఈ భూపోరాటంలో మా పాత్ర చాలాచిన్నది.. నిజనికి పోరాడింది కొడంగల్ భూమిపుత్రులు, ఆడబిడ్డలే’ అని తెలిపారు.
పాత్లావత్ ప్రవీణ్ నాయక్‌ను పోలీసులు ఆనాడు అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారని, నిండు గర్భిణి జ్యోతి తన భర్త జాడ కోసం వికారాబాద్, దోమ, పరిగి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ గంటల తరబడి పడిగాపులు కాసిందని గుర్తుచేశారు. ‘మీ ఓట్లతోని గెలిచినోడు.. మీకు మంచి చేయాల్సినోడు ఏంచేస్తున్నడు ఇయ్యాల? ఆడబిడ్డలను గోస పెడ్తున్నడు. రేవంత్‌రెడ్డీ మర్చిపోకు. యాది పెట్టుకో.. మా బంజారా బిడ్డలు తలుచుకుంటే నిన్ను చిత్తుగా ఓడగొడ్తరు. నీ కల్వకుర్తికి నిన్ను పంపిస్తరు’ అని హెచ్చరించారు.