హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులంతా నిత్యం ప్రజలతోనే ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన పడాల్సిన అవసరంలేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాలుగేండ్ల కాలంలో పార్టీని బలోపేతం చేసుకుందామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని వివరించారు. పార్టీలో కష్టపడే కార్యకర్తలకు తగిన గౌరవం, గుర్తింపు కచ్చితంగా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, ప్రభుత్వ వైఫల్యాలు క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.