KTR | కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురువారం కలిశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీలో కలిసి జాతీయ రహదారి విస్తరణపై విజ్ఞప్తి చేశారు. నేషనల్ హైవే 368బీ సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు ఉన్న ప్రపోజల్‌ను వేములవాడ నుంచి కోరుట్ల వరకు విస్తరించాలని గడ్కరీని కేటీఆర్ కోరారు. దాంతో రహదారి వెంట ఉన్న తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన వేములవాడ రాజేశ్వరస్వామి దేవస్థానం, కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం, ధర్మపురం లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాలు మరింత అనుసంధానమవుతాయని తెలిపారు.
అలాగే, నేషనల్ హైవే 63కి అనుసంధానం కలుగుతుందన్నారు. గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ ఈ ప్రతిపాదనలు చేశారన్నారు. మానేరు నదిపై రోడ్డు-కమ్-రైలు వంతెనను నిర్మించాలని కేటీఆర్ బృందం విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రికి తెలియజేసిన బీఆర్ఎస్ నేతలు తెలిపారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి తదితరులు ఉన్నారు.