హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న రూ.38 కోట్ల బ్యాక్ బిల్లింగ్, సర్‌చార్జీలను రద్దుచేయాలని, విద్యుత్తు సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేత కార్మికులను కాపాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు విజ్ఞప్తిచేశారు. ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి బుధవారం అసెంబ్లీహాల్లో మంత్రులను కలిసి, సిరిసిల్ల పవర్లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్తు బకాయిలు, సర్‌చార్జీల భారానికి సంబంధించి సమగ్ర వివరాలతో వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల గుండెకాయలాంటిందని, గతంలో అక్కడి కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్న చేదు జ్ఞాపకాలను వివరించారు. బకాయిలతో సంబ ంధం లేకుండా, పరిశ్రమకు విద్యుత్తు స బ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తిచేశారు. కార్మికులు తిరిగి ఆత్మహత్యలబాట పట్టకుండా ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు.
బీఆర్ఎస్ హయాంలో సబ్సిడీ
బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల పవర్‌లూమ్స్‌కు 25 హెచ్‌పీ వరకు విద్యుత్తు సబ్సిడీ పెంచడంతో పరిశ్రమ నిలదొక్కుకున్నదని గుర్తుచేశారు. ప్రస్తుతం విద్యుత్తు అధికారులు విధిస్తున్న ‘బ్యాక్ బిల్లింగ్’ భారంతో వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడ్డదని ఆందోళన వ్యక్తంచేశారు. 2016 నుంచి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి ప్రస్తుతం అధికారులు 127 ఎస్ఎస్ఐ యూనిట్లపై రూ.19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బిల్లుల భారం మోపారని, అది సర్‌చార్జిలతో కలిపి రూ.38 కోట్లకు చేరిందని వివరించారు. బకాయిలు చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతోపాటు, ఆర్థి క ఇబ్బందులతో 13 మంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారని చెప్పారు. సిరిసిల్ల నేతన్నల సమస్య ఒక ప్రాంతానిదే కాదని, వేలాది కుటుంబాల మనుగడకు సంబంధించిందని పునరుద్ఘాటించారు. బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దుచేయాలని విన్నవించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, కార్మికుల ఉపాధిని రక్షించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. డిప్యూటీ సీఎం, మంత్రి తుమ్మల సానుకూలంగా స్పందించి త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.