ఇందిరమ్మ రాజ్యమంటే ఏమిటి?ఎమర్జెన్సీ రాజ్యం! పోలీసుల రాజ్యం! అణచివేతల రాజ్యం! సోషల్ మీడియాలో ఒక్క పోస్టు పెడితే పోలీసోళ్లు ఫోన్ చేస్తరు. వాళ్లు అసలు పనులను ఇడిశిపెట్టిండ్రు. బీఆర్ఎస్ వెంటపడుడే పనిగా పెట్టుకున్నరు. నేను మీకు మాట ఇస్తున్నా. మళ్లా మన టైం వస్తది. ఒక్కొక్కరి పేరు రాసి పెట్టుర్రి. ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదు. రిటైర్ అయినా.. వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అందరి లెక్కలు సెటిల్ చేస్తం.హిసాబ్ కిసాబ్ అన్నీ తేలుస్తం.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
BRS | కరీంనగర్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఒక్క ఓటుకు శిక్ష ఐదేండ్లు.. ఒక్క తప్పు చేస్తే ఐదేండ్లు బాధపడే పరిస్థితి.. తప్పుడు పాలకులు, వ్యక్తులను ఎన్నుకుంటే, అరచేతిలో వైకుంఠం చూసి మోసపోతే, చార్సౌ బీస్ హామీలు నమ్మి ఆగమైతే ఈ పరిస్థితి వస్తది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ రాజ్యం, పోలీస్ రాజ్యం, అణచివేత రాజ్యం నడుస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. డీలిమిటేషన్ పేరుతో బీజేపీ దక్షిణాది రాష్ర్టాల మెడపై కత్తిపెట్టిందని విమర్శించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహాక కార్యక్రమంలో కేటీఆర్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈనెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రతి బీఆర్ఎస్ బిడ్డ తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కేటీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
కేసీఆర్‌కు కరీంనగర్ సెంటిమెంట్
‘ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉన్నది. ప్రతి మండలానికి 150 మందిని పిలిస్తే, వేలాది మంది తరలివచ్చారు. పార్టీ బలంగా ఉన్నదనడానికి ఇదే నిదర్శనం. కేసీఆర్‌కు కరీంనగర్ అంటే సెంటిమెంట్. పార్టీ పెట్టిన తర్వాత తొలి బహిరంగ సభ సింహగర్జన 2001 మే 17న ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో పెట్టారు. ఆ సభ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సంక్షేమబాటలో తెలంగాణ వాదం కొట్టుకపోయిందని ఆనాటి పీసీసీ అధ్యక్షుడు పిచ్చి ప్రేలాపనలు చేస్తే, దానికి స్పందిస్తూ కేసీఆర్ తన కరీంనగర్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి మీ దగ్గరికి వచ్చారు. మీ బిడ్డ కేసీఆర్‌ను రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించి, కరీంనగర్ దమ్మేందో.. తెలంగాణ దమ్మేందో.. చూపెట్టిన గడ్డ కరీంనగర్. సందర్భం ఏదైనా, పరీక్ష ఏదైనా, ఎప్పుడు అన్యాయం, అణిచివేత జరిగినా, ఎలాంటి వివక్ష మన పట్ల ఉన్నా ప్రతి సందర్భంలో తిరుగుబాటు జెండాను ఎగురవేసి అగ్రభాగాన నిలబడ్డ పోరాటాల పురిటిగడ్డ కరీంనగర్.
ప్రతిపక్ష పార్టీగా ముచ్చెమటలు పట్టిస్తున్నం
ఇవాళ ఒక ఉత్కృష్టమైన సందర్భం. 24 ఏండ్లు నిండి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భం. ఉద్యమ పార్టీగా పుట్టి, పదేండ్లు అధికార పార్టీగా ఉండి, తెలంగాణ ప్రజల తలరాతను మార్చినం. గత 15 నెలులుగా ప్రతిపక్షం అంటే ఏమిటో, ఎలా ఉండాలో, అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నం. మన పార్టీ ఒక ప్రత్యేకమైన పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా 25 ఏండ్ల క్రితం కేసీఆర్ నాయకత్వంలో ప్రొఫెసర్ జయశంకర్ లాంటి ఎంతోమంది మహానుభావుల ఆశీర్వాదంతో పురుడు పోసుకున్నది. 2001 ఏప్రిల్‌లో టీఆర్ఎస్ పార్టీగా అవతరించింది. కేసీఆర్ ఆనాడు పార్టీ లక్ష్యం ఒకటేనని చెప్పారు. ‘తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దాడుతా, కుష్టు రోగినైనా కౌగిలించుకుంటా.
ఆరెస్సెస్ నుంచి ఆర్ఎస్యూ దాకా, లెప్ట్ నుంచి రైట్ దాకా అందరిని కలుపుకొనిపోతా. మీరు చేయాల్సిందిల్లా ఒక్కటే. తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లేయండి. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మాకు అవకాశం ఇవ్వండి. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చి మీ దగ్గర పెడతా. మధ్యన గిట్ల నేను తప్పుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్న’ అని చెప్పిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి కమిట్మెంట్తో బయలుదేరి ఉన్నత పదవులకు రాజీనామా చేసి అనాడు 45, 46 ఏండ్ల వయస్సులో కేసీఆర్ పార్టీ పెట్టిండు. ఇవాళ& భూమికి జానెడు ఉన్నోడు కూడా ఎగిరెగిరి పడుతున్నడు. కేసీఆర్ ఎవరు అని మాట్లాడే వాళ్లు ఉన్నరు. ఆ రోజు తెలంగాణ ఎట్లుంటదో తెల్వదు. అట్లాంటోళ్లు కూడా మాట్లాడుతున్నరు. ఎగిరెగిరిపడుతున్నరు. అప్పుడప్పుడు కాలం మనది కాదు అన్నప్పుడు వానపాములు కూడా నాగుపాములు లెక్క బుస గొడుతుంటే చూడాలె. గ్రామసింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే చూడాలె.
కాంగ్రెస్, బీజేపీ రెండు దొందూ దొందే
కాంగ్రెస్, బీజేపీ రెండు దొందూ దొందే. మోదీ 2014లో ఏం చెప్పిండు. నల్లధనం తెచ్చి పదిహేను లక్షలు ఒక్కొక్కరి ఖాతాలో వేస్తా అన్నడు. పడ్డయా పంద్రా లాక్? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తమన్నరు. 11 ఏండ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వచ్చినయా ఉద్యోగాలు? రాలే. అక్కడ ఆ మోసం. ఇక్కడ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు. చార్ సౌ బీస్ మాటల మోసం. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ మోసగాళ్లే. బీజేపీ 1998లో కాకినాడలో తీర్మానం పెట్టింది. బీజేపీకి ఒక్క ఓటు వేయండి. రెండు రాష్ర్టాలు ఇస్తం అని. మరీ ఇచ్చిర్రా? ఇవ్వలేదు. బీజేపీ ఆ రోజు మోసం చేసింది. ఇక కాంగ్రెస్ మోసం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణకు మొదటి నుంచి మోసం చేస్తూ వచ్చిన పార్టీ అది.
కేసీఆరే రావాలంటున్నరు
మనం ఇవాళ ఉన్న ఒక ప్రత్యేక పరిస్థితిలో ఉన్నం. రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ మనిషిని కదిలించినా ఒక్కటే మాట వినబడుతున్నది. ఏ రైతునైనా మాట్లాడిస్తే చాలు గుడ్లళ్ల నీళ్లు తీసుకుంటున్నడు. మామూలు బాధలు వ్యక్తం చేస్తలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండె. అన్యాయం అయిపోయింది. బతుకు ఆగమై పోయిందని మాట్లాడుకుంటున్నరు. రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే, రైతుబంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతుంటే, రైతులకు ఇవాళ ఎవరు గుర్తుకు వస్తున్నరు? కేసీఆర్ గుర్తుకు వస్తున్నడు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధుకు రాంరాం అవుతుందని కేసీఆర్ చెప్పిండా? లేదా? అయిందా? లేదా? ఇందిరమ్మ రాజ్యం తెస్తం అన్నరు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమిటి? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం. అణిచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే పోలీసోళ్లు ఫోన్ చేస్తరు. వాళ్లు దొంగలను పట్టుడు ఇడిచిపెట్టిర్రు.
బీఆర్ఎస్ ఎంబడి పడుడే నేర్చుకున్నరు. పోస్టు పెట్టంగానే ఫోన్ చేస్తున్నరు. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా. మళ్లా మన టైం వస్తది. పేర్లు రాసి పెట్టుర్రి. ఒక్కొక్కన్ని ఏమేం చేయాలో అవన్నీ చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. రిటైర్ అయినా, వేరే దేశానికి పోయినా రప్పించి అన్ని లెక్కలు సెటిల్ చేస్తం. ఒక్కటి మాత్రం వాస్తవం. ఇప్పుడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా గుర్తుకొస్తున్నది కేసీఆరే. మొన్న నేను చూసిన. హైదరాబాద్‌లోని నాచారంలో ఓ ఆడబిడ్డ చెప్పుల దుకాణం నడుపున్నది. హైడ్రా వాళ్లు వచ్చి బుల్డోజర్ పెట్టి కొట్టేస్తున్నరు. ఆమె మొత్తుకుంటున్నది. ‘అన్నా.. కేసీఆర్ అన్నా. ఎక్కడున్నవ్..? రా అన్నా..’ అంటున్నది. ‘అన్నా తప్పైంది. అన్యాయం అయిపోయినం. ఆగమైపోయినం.
కేసీఆర్ ఎక్కడ ఉన్నవ్?’ అని ఆటోడ్రైవర్లు యాది చేసుకుంటున్నరు. ఉద్యోగులు యాదీ చేసుకుంటుర్రు. 73% జీతం పెంచిండు కేసీఆర్. మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నడు కేసీఆర్. మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు కేసీఆర్, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నమ్మితే 5 డీఏలు బాకీ ఉన్నయి. కేసీఆర్ ఇచ్చిన పీఆర్సీయే ఇప్పటికీ నడుస్తున్నది. ‘ఒకటో తారీఖు జీతం ఇచ్చుడే ఎక్కువ మీకు. మీదికెళ్లి ఏం ఇయ్యాలి?’ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి. ఇయాళ నిరుద్యోగులు యాది చేసుకుంటుర్రు. అశోక్‌నగర్ నుంచి మాకు మెసేజ్‌లు పంపిస్తున్నరు. ‘అన్నా తప్పైంది అన్నా. ఈళ్ల మాటలు నమ్మి ఆగమైనం. అశోక్‌నగర్‌కు రాహుల్‌గాంధీ వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మినం. మోసం జరిగిందన్నా. కాంగ్రెస్ 16 నెలల్లో 6 వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలేదు’ అని బాధపడుతున్నరు.
మెడపై డీలిమిటేషన్ కత్తి పెడుతున్న బీజేపీ
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపు మేరకు నిన్న నేను చెన్నై వెళ్లిన. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగబోతున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ దుర్గర్మామైన సవతితల్లి వైఖరితోపాటు జనాభా నియంత్రణ పాటించిన పాపానికి దక్షిణాది నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. 1971లో ఆరోజు అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ‘హమ్‌దో హమారేదో’ అనే నినాదం తెచ్చింది. జనాభాను అరికట్టేందుకు ఆ నినాదం తెచ్చిండ్రు. కుటుంబ నియంత్రణ బాగా పాటించిన రాష్ర్టాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక. వీటితోపాటు కొన్ని ప్రగతిశీల రాష్ర్టాలు ఒరిస్సా, పంజాబ్, పశ్చిమబెంగాల్ లాంటివి పాటించినయ్. ఫలితంగా ఆ రాష్ర్టాల్లో జనాభా తగ్గుకుంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్లో తగ్గింది. ఇప్పుడు కేంద్రం కొత్త పంచాయితీ పెడుతున్నది. ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడక్కడ ఎంపీ సీట్లు తగ్గిస్త అని అంటున్నది. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ మాటలు వినకుండా పిల్లల్ని కనుకుంటా పోయిండ్రో, ఎక్కడెక్కడ జనాభా పెరిగిందో అక్కడ సీట్లు ఎక్కువగా ఇస్తామంటున్నది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి ఎంపీ సీట్లు ఎక్కువగా ఇస్త.. మీరు తక్కువ ఉన్నరు కాబట్టి మీకు తక్కువ చేస్త అని మోదీ మన మెడ మీద డీలిమిటేషన్ అనే కత్తి పెట్టబోతున్నరు. అందుకే సమిష్టిగా కొట్లాడాలె.
అయోధ్యలోనే ఓడగొట్టిండ్రు
బీజేపీ వాళ్లకు తెలంగాణలో నూకలు చెల్లవని తెలుసు. ఏదో ఒక ఎలక్షన్ గెలిచిర్రు మొన్న. అడ్డిమారి గుడ్డి దెబ్బలా. ఊరూరికి రేషన్‌బియ్యం పంచి తలంబ్రాలు అని కథ చెప్పిండ్రు. ఆయోధ్యలోని ప్రజలు వీళ్ల మోసాన్ని పసిగట్టిర్రు. వీళ్లని ఓడగొట్టి ఇంటికి పంపించిర్రు. తలంబ్రాలు తెచ్చి మనకు సెంటిమెంట్ పూసిర్రు. ఎక్కడోళ్లడక్కడ ఊరేగింపులు తీసిర్రు. గత పది పదకొండు సంవత్సరాల్లో తెలంగాణకు ఏం చేసినవని అడిగితే మ్మెమ్మె..బ్బెబ్బెబ్చె.. అంటారు. బండి సంజయ్‌ని ఏం జేసినవయా అని గట్టిగా అడిగితే, ఏం జెప్తడాయన? ఆయనకు ప్రగతి గురించి తెలయదు. పైసలు తెచ్చుడు తెలియదు కానీ, మసీదు కూలగొడుదాం అంటడు. తప్ప ఆయన తెచ్చింది ఏమీలేదు.
ఏదైనా బీఆర్ఎస్ ద్వారానే సాధ్యం
గుడి కట్టినా, బడి కట్టినా, మెడికల్ కాలేజీ తెచ్చినా, కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసినా, కాళేశ్వరం నీళ్లు తీసుకువచ్చి టేలెండ్ ప్రాంతాలకు, హుజూరాబాద్, హుస్నాబాద్, పెద్దపల్లి, చొప్పదండి.. చివరి గ్రామాలకు నీళ్లు ఇచ్చినా, అటు అప్పర్ మానేరు డ్యాం నుంచి కింద గోదావరి దాకా మంథని నియోజకవర్గంలో మానేరు నదిని ఒక సజీవ జలదృశ్యంగా మార్చినా, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీ వరద కాలువను ఒక రిజర్వాయర్‌గా మార్చి కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌దే.
అసూయ, ద్వేషం, ఆశ అనే ప్రయోగం
మొన్న నాకొక పెద్ద మనిషి కలిసిండు. ఓటమికి కారణాలు అడిగినం. మూడు ముఖ్యమైన కారణాలు, మూడు పదాల్లో చెప్పిండు. మీ మీద ఒక ప్రయోగం చేసిర్రు. అసూయ, ద్వేషం, ఆశ, అనే మూడు అంశాలను ప్రయోగించిండ్రు. అసూయ అనేది స్థానిక నాయకులు ఎమ్మెల్యేలపై, ద్వేషం అనేది కేసీఆర్ కుటుంబంపై చేశారు. చివరగా కేసీఆర్ ఇచ్చిన పథకాలకు మించి ఇస్తమని ఆశ కల్పించారు. సంక్షేమంలో మనల్ని సవాల్ చేయలేరు. అభివృద్ధి విషయంలో చాలెంజ్ చేయలేరు. అందుకే అలా ద్వేషం నింపిర్రు.
తప్పు ప్రజలది కాదు
ఈ విషయంలో ప్రజల తప్పు ఎంతమాత్రం కాదు. మనమే చేసిన పని చెప్పుకోలేదు. వీళ్ల చేతిల మోసపోతే గోస పడుతామని కేసీఆర్ ఏ మాటైతే చెప్పిండో దాన్ని కింది వరకు తీసుకెళ్లడంలో మనం విఫలమైనం. మన నాయకుడు కేసీఆర్ ఎక్కడా కూడా ఫెయిల్ కాలే. కేసీఆర్ అద్భుతంగా పని చేసిండు కాబట్టే ఇప్పుడు భారతదేశంలో గడిచిన 75 ఏండ్లలో నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ‘గ్రోక్’ కూడా కేసీఆర్ అని చెప్తున్నది.
27 తదుపరి పార్టీ సంస్థాగత నిర్మాణం
ఏప్రిల్ 27న కొత్తగా మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈ కొత్త కమిటీల్లో ముఖాలు చూసేది లేదు. పార్టీ మనుషులు, పార్టీని కాపాడే వాళ్లు. పార్టీకి నమ్మకస్తులు కావాలె. వ్యక్తిపూజ చేసే వాళ్లు వద్దు. ప్రజల్లో తిరిగే వారు, ప్రజల కష్టం, సుఖంలో ఉండేవాళ్లు, ప్రజలకు మన పార్టీ వాదాన్ని వినిపించే వాళ్లకు ఇకనుంచి పెద్దపీట వేద్దాం. వచ్చే మూడేండ్లలో ఎక్కడిక్కడ ట్రైనింగ్ క్యాంపులు పెట్టుకుందాం. ఎక్కడిక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ను చీల్చి చెండాడాలె. బూతులు తిట్టుడు కాదు. సబ్జెక్టుతో సహా మాట్లాడే సత్తా నేర్చుకోవాలి. దాని కోసం 32 జిల్లా పార్టీ ఆఫీసుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకుందాం.
స్థానిక ఎన్నికల్లో మీకోసం పోరాడుతాం
రేవంత్‌రెడ్డి ధైర్యం తెచ్చుకొని, సోయి తెచ్చుకొని స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే మీ కోసం కష్టపడతం. గల్లీ గల్లీ తిరుగుతం. అన్ని రకాలుగా అండగా ఉంటాం. మీరు గెలిచి వచ్చే విధంగా పనిచేస్తామని మాట ఇస్తున్నం. పోయినసారి కరీంనగర్లో 13 సీట్లలో 5 మాత్రమే గెలిచినం. గెలిచిన ఐదింట్లో ఒకాయన దొంగలా పోయిండు. ఈ సారి కచ్చితంగా 13కి 13 అసెంబ్లీ సీట్లలో గులాబీజెండా ఎగిరే విధంగా ఎక్కడోళ్లమక్కడ ఏ గ్రామానికి, ఆ గ్రామానికి కథానాయకులమై గెలిపించుకోవాలి. పోయిన ఎన్నికల్లో మా ఎమ్మెల్యే పోతడు. కేసీఆర్ మాత్రం సీఎం ఉంటడు అనుకున్నరు. కరెక్టే కదా? ఇప్పుడు సోయి వచ్చిందా? మీ ఎమ్మెల్యే పోతే కేసీఆర్‌ది కూడా పోతదని అర్థమైందా? మనకు మనకు పంచాయితీలు ఉంటయ్. టిక్కెట్లు ఇయ్యకముందు కొట్లాడుకోవాలి. టిక్కెట్ ఇచ్చిన తరువాత వాళ్లు ఎవరైనా సరే అక్కడ నిలబడ్డది కేసీఆరే అనుకొని పని చేయాలె తప్ప నాకు పని చేయలేదు, నాకు ఫోన్ ఎత్తలేదు. ఇవన్ని మనసులో పెట్టుకోవద్దు. మేం కూడా తప్పులు చేసి ఉండొచ్చు. ఆ కోపం వల్లే ఇప్పుడేమైంది? తెలంగాణ మొత్తం ఆగమవుతున్నది. ఈ సారి తప్పు జరగొద్దు. క్యాండిడేట్ ఎవరైనా నిలబడ్డది కేసీఆర్ అని కొట్లాడాలె. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో గెలిచి మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా చూసే దాక శపథం చేయాలె’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
రాహుల్, ప్రియాంక ఖాతాల్లో తెలంగాణ డబ్బులు యాసంగి, వానకాలం సీజన్ వచ్చిందంటే రైతుల ఫోన్లో రైతుబంధు డబ్బులతో టింగ్టింగ్ మంటుండె. ఇప్పుడు టింగ్టింగ్ అంటే కేసీఆర్ యాదికి వస్తడని టకీ టకీ అని చెపుతుండ్రు. టకీ లేదు, పికీ లేదు. ఒక ఢిల్లీలో మాత్రం టకీ టకీమని పడుతున్నయ్ పైసలు. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ ఖాతాల. ఎందుకంటే ఆడ పైసలు ఇయ్యకుంటే ఈడ పదవి ఉంటదా? ఊస్టింగే. కాబట్టి పైసలు అక్కడ పడుతున్నయ్.
ఏప్రిల్ 27న తరలి రావాలి
ఎన్నికలు అయి 16 నెలలు ఒడిసిపాయే. ఇక మిగిలింది ఎంత. మూడేండ్లు. ఒక సంవత్సరం మొత్తం సిల్వర్‌జూబ్లీ సెలబ్రేషన్స్ ఉన్నవి. బ్రహ్మండంగా సంవత్సరంపాటు అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉంటయ్. తెలంగాణ ఎట్లా సాధించిండు కేసీఆర్ అనే విషయాన్ని ఈ కాలం పిల్లలకు తెలిసేవిధంగా శిక్షణ శిబిరాలు పెట్టుకుందాం. ఫొటో ఎగ్జిబిషన్, డాక్యుమెంటరీలు ఉంటాయి. ఏప్రిల్ 27న వరంగల్‌కు లక్షలాదిగా మనమంతా తరలాలి. నియోజకవర్గాల వారీగా పరిశీలకులు, అబ్జర్వర్లు, స్టేట్ పార్టీ నుంచి వస్తరు. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హన్మంతు ఓ పాట రాశారు. ‘బండెనక బండికట్టి.. 16 బండ్లు కట్టి..’ అని. అట్ల ఏ బండి దొరికితే ఆ బండి వేసుకొని ప్రతి గ్రామం నుంచి, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కచ్చితంగా సల్లటిపూట బయలుదేరాలి. దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా లక్షలాది మంది కదలిరావాలి. మన పార్టీ పని అయిపోయిందని మాట్లాడే సన్నాసుల నోర్లు మూతపడే విధంగా అద్భుతంగా విజయవంతం చేసుకోవాలి.
బీఆర్ఎస్ చెక్కు చెదరలేదు: గంగుల కమలాకర్
కరీంనగర్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ చెక్కు చెదరలేదని, కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న అభిమానం తగ్గలేదు సరికదా, మరింత పెరిగిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం ఆదివారం కరీంనగర్‌లోని వీ కన్వెక్షన్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గంగుల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కరీంనగర్ అంటే ఉద్యమాల జిల్లా అని, బీఆర్ఎస్ చేపట్టిన ప్రతి ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభమైందని గుర్తుచేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అమితమైన అభిమానం, సెంటిమెంట్ ఉన్నదని పేర్కొన్నారు. 2001లో సింహగర్జన సభను ఇక్కడే నిర్వహించారని, అది మొదలు స్వరాష్ట్రం సాధించే వరకు అనేక ఉద్యమాలు ఇక్కడి నుంచే పురుడుపోసుకున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతుబంధు, రైతుబీమా, దళిత బంధు వంటి అనేక పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించారని చెప్పారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తి చేయకపోవడం పక్కనపెడితే.. అధికారుల వద్దనే కమీషన్లు అడుగుతున్నారని గంగుల ఒక పిట్ట కథ ద్వారా వివరించారు.
పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లాలి: వినోద్‌కుమార్
రాజకీయ పార్టీలకు గెలుపు, ఓటములు సహజమని, ఓటమి వల్ల కుంగిపోవాల్సిన అవసరం లేదని, ఈ సమయంలో కొత్త పాఠాలు నేర్చుకుని ముందుకువెళ్లాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓటమి వల్ల అధికారం కోల్పోయిన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల కోసం చేయాల్సినవి ఇంకా ఏమున్నాయనే ఆలోచన చేసుకోవాలని సూచించారు. 1983లో టీడీపీ స్థాపించినప్పుడు కేసీఆర్ పీఏసీఎస్ చైర్మన్‌గా ఉన్నారని, పార్టీలో అయనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని గొప్ప నాయకుడిగా ఎదిగారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అరాచకాలు పెరుగుతున్నయి: కొప్పుల
రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన కొనసాగుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజం ఇదే కోరుకున్నదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కనపెట్టి, ఆరు గ్యారెంటీలను గాలికొదిలి.. అరాచక పాలన సాగించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని, పోలీసు కేసులు పెట్టిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ర్టాన్ని ఇప్పటికే 15 ఏండ్లు వెనక్కి తీసుకెళ్లిందని మండిపడ్డారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి, తెలంగాణ అంటే కాల్చివేస్తానని చేతిలో తుపాకీ పట్టుకుని తిరిగిన వ్యక్తి చేతిలోకి రాష్ట్రం వెళ్లిందని, ఆయన కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ క్యాడర్‌పై ఉందని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల్లో గెలుపు మనదే: పాడి కౌశిక్‌రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులుగా బీఆర్ఎస్ కార్యకర్తలే గెలవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆకాంక్షించారు. ‘ఇన్నాళ్లు మీరు మా కోసం కష్టపడ్డారు. ఇప్పుడు మీ కోసం మేం కష్టపడతాం’ అని హామీ ఇచ్చారు. కేటీఆర్ కరీంనగర్ గడ్డపై అడుగుపెట్టగానే పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయని, కార్యకర్తలు వేల సంఖ్యలో తరలివచ్చారని చెప్పారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ అభిమానులను పెద్ద సంఖ్యలో తరలించాలని కోరారు.
కేసీఆర్ ఆశయాన్ని బతికించాలి: రసమయి
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం కోసం 2001లో పార్టీని స్థాపించిన కేసీఆర్ ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో ఆరాటపడ్డారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత గొప్ప పథకాలు తెచ్చి రాష్ర్టానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తల్లి పొత్తిళ్లలో ఉన్న పసిబిడ్డల్ని సైతం పోరు వైపు కదిలించారని పేర్కొన్నారు. పదేండ్లపాటు రాష్ర్టాన్ని కంటికిరెప్పలా కాపాడిన కేసీఆర్ అధికారానికి దూరమైన కొద్ది రోజుల్లోనే తెలంగాణ ఆగమైందని తెలిపారు. కేసీఆర్ ఆశయాలను బతికించడం కోసం కేటీఆర్ మరో ఉద్యమాన్ని చేపడుతున్నారని, ప్రతి కార్యకర్త ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని కోరారు. గులాబీ జెండాను ఎత్తుకుని తిరిగి బీఆర్ఎస్ను అధికారంలోకి తేవాలని కార్యకర్తలకు సూచించారు.పదేండ్లు సీఎంగా కేసీఆర్ పనిచేశారు. ఆయనకేం పదవుల మీద మోజు లేదు.
ఆయనకు కొత్తగా వచ్చే పదవి లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది బీఆర్ఎస్ తిరిగి గెలిచి రావడమే చారిత్రక అవసరం. ఆనాడు 24 ఏండ్ల కిందట టీఆర్ఎస్ ఒక చరిత్రాత్మక సందర్భంలో పుట్టింది. ఇవాళ తిరిగి బీఆర్ఎస్ గెలవడం అనేది కూడా తెలంగాణ ప్రజల కోసమే. మనం గెలవాలె. నిలవాలె అంటే కాంగ్రెస్, బీజేపీని ఊరూరా ఎండగట్టాలె. కలిసి కొట్లాడాలె. – కేటీఆర్రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ మనిషిని కదిలించినా ఒక్కటే మాట వినబడుతున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. అన్యాయం అయిపోయింది. బతుకు ఆగమై పోయిందని మాట్లాడుకుంటున్నరు.
– కేటీఆర్
మళ్లీ తిరిగి ఈ గులాబీ జెండారావాలి. నాకు మంత్రి పదవి రావాడానికో, ఎమ్మెల్యేలు కావడానికో కాదు. ఏ తెలంగాణ అయితే కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి సాధించారో, ఆ తెలంగాణ.. ఇవాళ దుర్మార్గుల చేతుల్లో ఆగమైతుంటే, తిరిగి ఈ తెలంగాణను కాపాడాలంటే ఒకే ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యం.
– కేటీఆర్