KTR | జీఎస్టీలోని 12 శాతం స్లాబ్‌ను రద్దు చేసి, పేద, మధ్యతరగతి ప్రజలకు ఏదో మేలు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నం. ఇది ప్రజలను మభ్యపెట్టే మరో జుమ్లా తప్ప మరొకటి కాదు. మొత్తం జీఎస్టీ పరిధిలోని 22 లక్షల కోట్లకుపైగా వచ్చే ఆదాయంలో ఈ 12 శాతం స్లాబ్ వాటా 5 శాతం మాత్రమే. ఇంత నామమాత్రపు వాటా స్లాబ్‌ను రద్దు చేసి, అందులోని వస్తువులను వేరే స్లాబుల్లోకి మార్చి దేశ ప్రజలందరినీ ఉద్ధరించినట్టు మోదీ ప్రభుత్వం చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉన్నది.
-కేంద్రానికి బహిరంగ లేఖలో కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): నిత్యావసర ధరల పెరుగుదలకు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ, సెస్సులే కారణమని, వాటిని తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. చేనేత ఉత్పత్తులపై, అన్ని జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై, విద్యా సంబంధిత ఫీజులపై, క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు, ప్రాణాలు కాపాడే జీవనావశ్యక ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని కోరారు. ఢిల్లీలో బుధవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో జీఎస్టీ పన్నుల విధానంలో తేవాల్సిన సంస్కరణలపై పలు సూచనలు చేస్తూ కేంద్రానికి కేటీఆర్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ‘చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలి. ఇది మా హక్కు.. కేంద్రం బాధ్యత’ అని స్పష్టంచేశారు.
తెలంగాణలో నేతన్నల సంక్షేమానికి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేశారు. చేనేత మిత్ర పథకంతో ముడి సరుకును 50 శాతం సబ్సిడీకే ఇవ్వడంతో వేల మంది నేత కార్మికుల కుటుంబాలకు ధీమా ఇచ్చిందని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను అమలుచేసి చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వమని నిరూపించినట్టు పేర్కొన్నారు. మగ్గం పట్టిన నేతన్న తయారుచేసిన వస్త్రాలపై ఎలాంటి పన్నులు ఉండొద్దన్న ఉదాత్తమైన ఆలోచన కేసీఆర్‌తోపాటు అందరికీ ఉండేదని, కానీ, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించిందని తెలిపారు. ఆ పన్నును 12 శాతం పెంచాలని నిర్ణయిస్తే దేశంలో అందరి కంటే ముందే తాను కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రధానమంత్రి మోదీకి బహిరంగ లేఖ రాశానని గుర్తుచేశారు.
వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి జీవనాధారమైన చేనేత రంగంపై పూర్తిగా పన్ను ఎత్తివేయాల్సింది పోయి పెంచుతారా? అని ప్రశ్నించినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతతో 12 శాతం నిర్ణయం అమలును వాయిదా వేశారని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలపై ఇప్పుడున్న 5 శాతం జీఎస్టీని కూడా పూర్తిగా రద్దు చేయాలని లేఖలో మరోసారి కేటీఆర్ డిమాండ్ చేశారు. చేనేత అనేది వస్త్ర తయారీ రంగం మాత్రమే కాదని, అది మన సాంస్కృతిక వారసత్వమని, దానిపై పన్ను వేయడం అంటే మన సంసృతిని అవమానించడమేనని తెలిపారు.
జీఎస్టీలోని 12 శాతం స్లాబ్‌ను రద్దు చేసి, పేద, మధ్యతరగతి ప్రజలకు ఏదో మేలు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నదని, ఇది ప్రజలను మభ్యపెట్టే మరో జుమ్లా తప్ప మరొకటి కాదని కేటీఆర్ విమర్శించారు. 22 లక్షల కోట్లకుపైగా వచ్చే జీఎస్టీ ఆదాయంలో 12 శాతం స్లాబ్ వాటా 5 శాతం మాత్రమేనని, ఇంత నామమాత్రపు వాటా స్లాబ్‌ను రద్దు చేసి, అందులోని వస్తువులను వేరే స్లాబుల్లోకి మార్చి దేశ ప్రజలను ఉద్ధరించినట్టు మోదీ ప్రభుత్వం చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉన్నదని దుయ్యబట్టారు. ‘దశాబ్దకాలంగా పాలు, పెరుగు, పప్పు, ఉప్పు వంటి నిత్యావసరాలపైనా జీఎస్టీ విధించి సామాన్యుడి నడ్డి విరిచింది బీజేపీ ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను అడ్డగోలుగా పెంచి లక్షల కోట్ల భారాన్ని ప్రజలపై మోపింది. ఈ పాపాలను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు స్లాబ్ రద్దు అంటూ లీకులిస్తూ ప్రచారం చేసుకుంటున్నది’ అని మండిపడ్డారు.
బీజేపీ పాలనలో పుష్కరకాలంగా విపరీతంగా పెరిగిన ధరలతో దేశ ప్రజలు అల్లాడిపోతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్‌పై మీరు విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ, సెస్సులు. అంతర్జాతీయ మారెట్లో ముడి చమురు ధరలు 2014 నాటి స్థాయికి పడిపోయినా, దేశంలో మాత్రం పెట్రో ధరలు ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేనంతగా రికార్డు స్థా యిలో ఉన్నాయి. పేదలు, మధ్యతరగతి ప్రజల సంపదను లూటీ చేస్తున్న ఈ భారాన్ని తగ్గించకుండా, జీఎస్టీలో నామమాత్రపు మార్పులు చేయడం వల్ల ప్రజలకు ఒరిగే ప్రయోజనం శూన్యం. నిత్యావసర ధరల పెరుగుదలకు మీరు పెంచిన పెట్రో, ఎల్పీజీ రేట్లే అసలు కారణమన్న సంగతిని గ్రహించనంత వరకు దేశ ప్రజలకు ఎలాంటి ఉపశమనం లభించదు. మీరు ఇష్టారీతన పెంచిన పెట్రో, ఎల్పీజీ ధరలను తగ్గిస్తేనే రవాణా భారం తగ్గి ఆటోమెటిక్‌గా ధరాభారం తగ్గుతుంది’ అని స్పష్టంచేశారు.
పెట్రో ధరలను పన్నులతోనే కాకుండా సెస్సుల రూపంలో పెంచడం మరో అప్రజాస్వామిక నిర్ణయమని కేటీఆర్ మండిపడ్డారు. ‘పన్నుల రూపంలో పెంచితే వచ్చిన ఆదాయంలో రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందన్న అకసుతో పెట్రో రేట్లను సెస్సుల రూపంలో పెంచి మీరు రాష్ర్టాలను ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూశారు. బలమైన రాష్ర్టాలు ఉంటేనే బలమైన కేంద్రం ఉంటుందన్న సమాఖ్య స్ఫూర్తిని మరిచి వ్యవహరించారు. పెట్రో, ఎల్పీజీ ధరలను అడ్డగోలుగా పెంచి లక్షల కోట్లను ప్రజల నుంచి వసూలు చేసిన కేంద్రం.. ఇప్పుడు జీఎస్టీ స్లాబ్ రద్దు అంటూ.. దానితోనే ప్రజల జీవితాలు బాగుపడతాయని ప్రచారం చేసుకుంటున్నది.
నామమాత్రపు ప్రయోజనాన్ని కూడా ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. నిజంగా ప్రజలకు గరిష్ఠ ప్రయోజనం కలిగించాలని కేంద్రం భావిస్తే తక్షణమే పెట్రో, ఎల్పీజీ రేట్లను తగ్గించి, సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలి. అలా చేయకుంటే ఈ ప్రచారం కూడా మరో జుమ్లా లాగానే మిగిలిపోతుంది’ అని ధ్వజమెత్తారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ ధరలు తగ్గించి, దేశ ప్రజలకు అసలైన దీపావళిని అందిస్తామని చెప్పారని, ఆ మాటలపై చి త్తశుద్ధి ఉంటే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
1)చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని సంపూర్ణంగా రద్దు చేయాలి.
2)అన్ని జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి.
3)విద్యా సంబంధిత ఫీజులపై విధించే జీఎస్టీని పూర్తిగా తొలగించాలి.
4)క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు, ప్రాణాలు కాపాడే జీవనావశ్యక ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలి.
5)ప్రజలను దోచుకుంటున్న పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై పన్నులను తక్షణమే తగ్గించి సెస్సులు పూర్తిగా ఎత్తివేయాలి.
6)12 శాతం స్లాబ్ రద్దు వంటి కంటితుడుపు చర్యలు ఆపి, నిత్యావసర వస్తువులపై పన్నుల భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలి.
7)కేంద్రం జుమ్లా మాటలను పకనపెట్టి, ధరలు తగ్గించే చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. మా సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి.
8)తెలంగాణ ప్రభుత్వం కూడా రేపటి సమావేశంలో చేనేతపై జీఎస్టీ రద్దు కోసం గట్టిగా పట్టుబట్టాలి.