సంగారెడ్డి, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మరోసారి జీవో జారీచేసే అవకాశం ఉన్నదని మున్సిపల్, ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. పేదల ఆక్రమణలో ఉన్న ఇండ్ల్లను క్రమబద్ధ్దీకరించేందుకు గతంలో 58, 59 జీవోలు ఇచ్చామని, ఈ అంశంపై మరోసారి జీవో తీసుకురావాలని డిమాండ్ వస్తున్నదని తెలిపారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండ్ల స్థలాల క్రమబద్ధ్దీకరణకు మరో జీవో తీసుకురావాలని యోచిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం తన అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ పనిచేస్తున్నదని వెల్లడించారు. మంత్రి కేటీఆర్ గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో ఏడు వైకుంఠ రథాలను ప్రారంభించారు. మంజీరానగర్‌లో రూ.6.70 కోట్లతో నిర్మించనున్న వెజ్-నాన్‌వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
మున్సిపాలిటీలకు భారీగా నిధులు
మున్సిపాలిటీల్లో పనిచేసే సఫాయి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. గతంలో మున్సిపాలిటీల్లో సఫాయి కార్మికులకు జీతాలురాక సమ్మెలు చేసేవారని, ప్రస్తుతం వారికి సకాలంలో వేతనాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ‘సఫాయి అన్న నీకు సలామ్ అని చెప్పిన ఏకైక సీఎం కేసీఆర్’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలకు రూ.3,041 కోట్లు విడుదల చేశామని, సంగారెడ్డి, సదాశివపేటకు అదనంగా రూ.50 కోట్లు ఇస్తామని ప్రకటించారు. అన్ని మున్సిపాలిటీల్లో రూ.500 కోట్లతో వెజ్-నాన్‌వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో సంగారెడ్డికి మెట్రోరైల్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డిలో ఈఎస్ఐ దవాఖాన, పీఎఫ్ కార్యాలయం ఏర్పాటుచేయాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ హన్మంతరావు, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్యరావు, భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మునిపల్లి మండలం కంకోల్‌లోని వోక్సెన్ యూనివర్సిటీని మంత్రి కేటీఆర్ సందర్శించారు.
ఓఆర్ఆర్పై వందకోట్లతో ఎల్ఈడీ లైట్లు
రాష్ట్రంలో విదేశాలకు తీసిపోని స్థాయిలో రోడ్లు వేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం పటాన్చెరు-ముత్తంగి జంక్షన్ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై రూ.100 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ సెంట్రల్ లైట్లను ప్రారంభించారు. ఎల్ఈడీ లైట్ల వెలుగులతో రింగ్‌రోడ్డుపై ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు. 160 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌తోపాటు సర్వీస్ రోడ్లను కలుపుకొని మొత్తం 190.5 కిలోమీటర్ల దూరం ఎల్ఈడీ లైట్లు అమర్చామని తెలిపారు. 6,340 స్తంభాలకు 13,009 లైట్లు అమర్చినట్టు వివరించారు. కార్యక్రమంలో మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనిత హరినాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్, ఎండీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.