హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): నాడు వలసలు, కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా.. నేడు నీటిపారుదల సౌకర్యం, పచ్చని పంటలకు పర్యాయపదంగా మారిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పట్టుదలతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో మహబూబ్‌నగర్‌లో వచ్చిన మార్పులపై తీసిన వీడియోను కేటీఆర్ ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 2014కు ముందు మహబూబ్‌నగర్ జిల్లా వెనకబడిన, కరువుగా జిల్లాగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహబూబ్‌నగర్ పట్టణం కూడా అద్భుతంగా మారిందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు.
రంబుల్ స్ట్రిప్స్‌తో ఇబ్బందిలేకుండా చూడాలి
హైదరాబాద్ నగరంలో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్‌ను అధికారులు మరోసారి పరిశీలించి, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా మార్పులు, చేర్పులు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. రోడ్లపై ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్‌తో వెన్నునొప్పులు వస్తున్నాయని పలువురు వాహనదారులు ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. జీహెచ్హెచ్ఎంసీ కమిషనర్, ఈఎన్సీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, హనుమకొండలో పంచ భూత వైకుంఠధామం ఏర్పాటు చేసిన వరంగల్ మున్సిపల్ అధికారులను, ఇందుకు కృషిచేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌ను అభినందించారు. వరంగల్ నగరపాలక సంస్థ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అనుబంధంగా సైన్స్ పార్కు ఏర్పాటు చేసినందుకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.