హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ కళాకారులు, చేతివృత్తిదారుల నైపుణ్యాన్ని, గ్రామీణ హస్తకళలను అంతర్జాతీయ వినియోగదారులకు చేరువ చేసేందుకు ‘అహార్యాస్’ ఆన్లైన్ వేదిక భరోసా ఇస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యే సంప్రదాయ ఉత్పత్తులను గ్లోబల్ మారెట్తో అనుసంధానించాలనే లక్ష్యంతో రూపొందించిన ‘అహార్యాస్’ ఈ-కామర్స్ వెబ్సైట్ను శుక్రవారం కేటీఆర్ ప్రారంభించారు. యువ పారిశ్రామికవేత్త అవనిరెడ్డి నేతృత్వంలోని యువ బృందం ఈ వినూత్న వేదికకు ప్రాణం పోసిందని చెప్పారు. పల్లెటూరి ప్రతిభకు సాంకేతికతను జోడించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం గొప్ప పరిణామమని ప్రశంసించారు. ‘భారతీయ గ్రామాల్లో అద్భుతమైన సృజనాత్మకత ఉన్నది. సామాజిక బాధ్యతతో యువత ముందుకొచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఇలాంటి వేదికలను రూపొందించడం అభినందనీయం’ అని కొనియాడారు. యువ పారిశ్రామికవేత్త అవనిరెడ్డి బృందాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ కళాకారుల ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో అహార్యాస్ కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
భారతీయ సంస్కృతీ సంప్రదాయ కళలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ను రూపొందించినట్టు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంతోపాటు కళాకారుల జీవనోపాధిని బలోపేతం చేయడం, హస్తకళలను ప్రోత్సహించడం ఈ వేదిక ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అహార్యాస్ వేదిక కేవలం వ్యాపార సంస్థగా కాకుండా, గ్రామీణ కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపే ఒక సామాజిక విప్లవంగా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సాధారణంగా హస్తకళాకారులకు లభించాల్సిన ఆదాయంలో సింహభాగం మధ్యవర్తులకే చేరుతున్నదని, అహార్యాస్ ద్వారా కళాకారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రపంచ వినియోగదారులకు విక్రయించవచ్చని వివరించారు. మధ్యవర్తుల జోక్యం లేకపోవడం వల్ల కళాకారులకు గరిష్ఠ లాభం, స్థిరమైన ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ వేదిక ద్వారా గ్రామీణ ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ లభిస్తుందని, ఇది రాష్ట్రంలోని ఎంతోమంది చేతివృత్తిదారులకు భరోసాగా నిలుస్తుందని చెప్పారు.