హైదరాబాద్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ) : పథకాల పేర్లు మార్చడం.. నిర్వీర్యం చేయడం దుర్మార్గమని, ఆ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించి కేంద్రం సంకుచితత్వాన్ని చాటుకున్నదని, జాతిపిత పేరును తీసేసిన బీజేపీకి జాతీయ పార్టీ అని చెప్పుకొనే హక్కు లేదని మండిపడ్డారు. జాతీయ ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించి పథకాన్ని నిర్వీర్యం చేసి, పల్లె ప్రజల ఉపాధిని దెబ్బతీసే కుట్రలకు తెరలేపిందని ఆయన విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలనను, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం బీజేపీ బాటలోనే పయనిస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. అన్నపూర్ణ క్యాంటీన్లు, బతుకమ్మ చీరలు, చివరకు మన ఆత్మగౌరవ చిహ్నమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చి ‘కాంగ్రెస్ తల్లి’గా ప్రజలపై రుద్ది రాజకీయరంగు పులమడం అమానుషమని మండిపడ్డారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు రైతుబంధును రైతుభరోసాగా మార్చి రైతులకు అందకుండా చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను నిలిపివేసి తల్లీబిడ్డల ఆరోగ్యంతో కాంగ్రెస్ సర్కారు చెలగాటమాడుతున్నదని దుయ్యబట్టారు. గతంలో అవార్డులు తెచ్చి పల్లెల రూపురేఖలు మార్చిన పల్లె ప్రగతి, హరితహారం లాంటి పథకాల పేర్లు మార్చి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపుతున్నారని ఆరోపించారు.
పదేండ్లు రాష్ర్టాన్ని పాలించిన కేసీఆర్ ఏనాడూ మహనీయుల పేర్లను మార్చలేదని కేటీఆర్ గుర్తుచేశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను అదే పేర్లతో కొనసాగించారని చెప్పారు. కానీ ఢిల్లీ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు స్కీమ్‌ల పేర్లు మార్చి ప్రజలను ఏమార్చడమే తప్ప, దేశ ముఖచిత్రాన్ని మార్చే ఆలోచన లేదని ఎద్దేవా చేశారు. రెండు పార్టీల రాజకీయాలకు 150కోట్ల మంది భారతీయులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్‌లు.. కేసీఆర్ దార్శనికతను, హుందాతనాన్ని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. అస్తవ్యస్త విధానాలతో ముందుకెళ్తున్న ఈ రెండు పార్టీల భరతం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.