మాకున్న ఆధారమే భూమి. దాన్నే తీసుకుంటే ఎట్ల బతకాలె. అర్ధరాత్రి పోలీసోళ్లు ఇంటిపై దాడి చేసిండ్రు. నా భర్త షక్రునాయక్ను పట్టుకు పోయిండ్రు. మొన్న ఆఫీసర్లు వచ్చి భూములు రాసివ్వాలని అడిగిండ్రు. ఉన్న భూమిని మీకిస్తే మేమెక్కడికి పోవాలె? మేము ఎవరిపైనా దాడి చేయలేదు. తప్పుడు కేసులు పెట్టి జైళ్లో పెడుతున్నరు.
– రత్నబాయి, లగచర్ల
Lagacharla | హైదరాబాద్/ఖైరతాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘మీ ఫార్మా కంపెనీ వద్దు.. డెవలప్‌మెంటూ వద్దు.. జీవనాధారమైన భూములు లాక్కొని అభివృద్ధి చేస్తరా? కుటుంబంతో ఎక్కడికి పోవాలి? ఎలా బతకాలి? మమ్మల్ని సంపినా మా భూములియ్యం. ఇంచుభూమిని కూడా వదులుకోం’ అని లగచర్లతోపాటు సమీపంలోని పెచ్చెర్లగడ్డ తండా, ఆర్బీ తండా బాధిత రైతు కుటుంబాలు స్పష్టంచేశాయి. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సాయంత్రం మీడియాకు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాయి. అనంతరం నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బాధిత మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. లగచర్ల నుంచి వచ్చిన బాధితులతోనే ఆయన మీడియాతో మాట్లాడించారు. తాను తొమ్మిది నెలల గర్భవతినని చూడకుండా పోలీసులు తన పట్ల దుర్మార్గంంగా వ్యవహరించారని బాధితురాలు జ్యోతి ఈ సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యారు. కలెక్టర్, అధికారులపై ఎలాంటి దాడి చేయకపోయినా, అర్ధరాత్రి వచ్చి తన భర్తను బలవంతంగా పట్టుకుపోయారని, అక్కడ స్టేషన్లో తెల్లార్లు చావబాదారని బోరుమన్నది. లగచర్లలో 24 గంటలు అధికారుల సర్వేలు కొనసాగుతున్నాయని, డ్రోన్లతో సర్వే చేస్తున్నారని జ్యోతి చెప్పారు. ‘మా ఇండ్ల వద్దకొచ్చి.. మీ భూములు ఇచ్చేయండి, ఫార్మా కంపెనీ పెడుతున్నమని చెప్తున్నారు. సర్వేల పేరుతో రోజూ మా ఇండ్ల చుట్టూ తిరుగుతున్నరు. బుధవారం తిరుపతిరెడ్డి వచ్చి భూములివ్వాలని చెప్పి వెళ్లిండు. అధికారులు కూడా మా భూములు తీసుకుంటామని బెదిరిస్తున్నరు. మాకు ఫార్మా కంపెనీ అక్కర్లేదు.. కంపెనీ పెడితే మా భూములు నాశమవుతయి’ అని ఆవేదన వ్యక్తం చేసింది.
‘మా భూములు పోతాయన్న బాధతోనే అధికారులను నిలదీశాం. మాకెవరూ చెప్పలేదు. ఏ ఒక్కరి మీద దాడి చేయలేదు’ అని మరో బాధితురాలు రత్నాబాయి చెప్పారు. ‘రోజూ అధికారులు ఇండ్ల వద్దకు వచ్చి సంతకాలు పెట్టాలని, భూములియ్వాలని, స్వచ్ఛందంగా ఇవ్వకుంటే బలవంతంగా తీసుకుంటామని బెదిరిస్తున్నరు’ అని భయాందోళన వ్యక్తంచేసింది. ఉన్న భూములను సర్కరు లాక్కుంటే తామెలా బతకాలని అక్కడికొచ్చిన బాధితులంతా గోడు వెళ్లబోసుకున్నారు. తమ ప్రాణాలు పోయినా భూములు ఇవ్వబోమని వారంతా తేల్చి చెప్పారు.
‘తెలంగాణ భవన్‌కు వచ్చిన గిరిజన ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా.. బీఆర్ఎస్ పార్టీ మీ కు అండగా ఉంటుంది. ఇది కేసీఆర్ సార్ మాటగా చెప్తున్నా. మీ భర్తలు, కొడుకులు, మనుమళ్లు, మీవాళ్లు మళ్లీ మీ ఇండ్లకు చేరేవరకూ మీ తరఫున కొట్లాడతాం. మీరెవ్వరూ అధైర్యపడొద్దు’ అని కేటీఆర్ భరోసా ఇచ్చా రు. లగచర్ల, సమీప 5 తాండాల నుంచి న్యా యం కోసం తెలంగాణ భవన్‌కు వచ్చిన గిరిజన ఆడబిడ్డల ఆవేదన విన్న కేటీఆర్.. భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మీ తరఫున మేమే కోర్టులకు పోతాం, న్యాయం కోసం కొట్లాడుతామని చెప్పారు. ఇన్నాళ్ల నుంచి బీఆర్ఎస్పై, మా నేతలపై అడ్డగోలుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలంతా ఒక్కసారి వీళ్లు చెప్పేది వినండి.. మేము రెచ్చగొట్టామని మీరంటున్నారు.. లేదు స్వచ్ఛందంగా ఆందోళన చేస్తున్నామని బాధితులు అంటున్నారని కేటీఆర్ చెప్పారు.
నోటీసులు కూడా ఇవ్వలేదని స్పష్టంగా చెప్తున్నారు.. ఎవరూ చెప్పలేదని, ఫార్మా ఎందుకు పెడుతున్నారో చెప్పలేదని వారు చెప్పారని తెలిపారు. 9 నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని బాధితులే అంటున్నారని చెప్పారు. ఆ మాటలు మీకు వినిపిస్తలేదా? ఇంతమంది రైతులు, ఆడబిడ్డల బాధను రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తారా? ఇక ఉపేక్షించేది లేదు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం.. అని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ స్పందించాలని, జాతీయ మానవహక్కుల క మిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పం దించి బాధిత రైతులపై థర్డ్ డిగ్రీని సుమోటు కేసుగా తీసుకొని వెంటనే విచారణ జరపాలని కోరారు. బాధితులకు మేము అండగా ఉం టాం’ అని కేటీఆర్ తేల్చి చెప్పారు.
నా భర్త ప్రవీణ్. రోజూ ఉదయం, సాయంత్రం ఇంటింటికి వెళ్లి పాలు పోస్తాడు. నేను తొమ్మిది నెలల గర్భవతిని. అర్ధరాత్రి మా ఇంటి చుట్టుపక్కల లైట్లు ఆపి ఓ పెద్ద నేరస్తుడిని పట్టుకుపోయినట్టు పట్టుకుపోయారు. నేను నిండు గర్భిణిని, నాకెవరూ దిక్కులేరని చెప్పినా కనికరించలేదు. కడుపుతో ఉన్న నన్ను పక్కకు తోసేసి నా భర్తను బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఫార్మా సిటీ వల్ల మాకున్న భూమి, ఇల్లుతో సహా పోతుందని చెప్పారు. అందుకే మా ఆయన పోయిండు. నా భర్త ఎవరిపైనా దాడి చేయలేదు. ఆ వీడియోల్లో కనిపిస్తుండని తీసుకెళ్లి జైల్లో వేశారు. మమ్మల్ని ఎవరూ ప్రోత్సహించలేదు. మా భూములు పోతాయనే పోరాడాం. దుద్యాలలో తిరుపతిరెడ్డి మీటింగ్ పెట్టి.. అందరూ తప్పనిసరిగా భూములివ్వాలని చెప్పిండు. నేను కడుపుతో ఉన్నా.. నన్ను చూసి మా ఆయన భోరుమన్నడు. స్టేషన్లో బాగా కొట్టారని మస్తు ఏడ్చిండన్నా. (కేటీఆర్‌తో) నాకు దుఃఖం ఆగుతలేదన్నా (భోరున విలవిస్తూ)..
– జ్యోతి, లగచర్ల
పుట్టిన నాటి నుంచి ఈ భూములతో మాకు అనుబంధం ఉంది. ఒక్కసారిగా భూములు ప్రభుత్వానికి అప్పజెప్పాలని అంటే మేం ఎక్కడికి వెళ్లాలి, ఎలా బతకాలి. నిన్న రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి వచ్చి ఫార్మా కంపెనీ కచ్చితంగా వస్తుందని అంటున్నారు. కొట్టినా, చంపినా ఇక్కడే ఉంటం. నెట్, లైట్లు ఆర్పివేసి ఇండ్లలోకి పోలీసులు ఎందుకొచ్చారు. ఏమీ ఎరుగని వారిపైనా కేసులు పెట్టి వేధిస్తున్నారు.
-పూజ, నీట్ ప్రిపరేషన్ విద్యార్థి, రోటిబండతాండ
మా గంజి మేము తాగి బతుకుతున్నం. పొట్టకూటి కోసం మా ఇంట్లో వాళ్లంతా వలసెల్లిండ్రు. నేను నా మనుమళ్లను, మనుమరాళ్లను పెట్టుకొని కాలం గడుపుతున్న. మేకలు, పశువులను మేపుకొంటూ జీవిస్తున్నాం. భూము లు పోతున్నాయనే బాధలో ఉండి తిండి కూడా తినడంలేదు. నిద్ర పట్టడం లేదు. ఫార్మా కంపనీలు పెడితే ఇక్కడ బతికేది కష్టమే అంటున్నారు. మాకు ఏమీ తెల్వదు. ఎవుసం చేసుడే తెలుసు.
-ముత్యాలీబాయి, రోటిబండ తండా
మాకున్న ఐదెకరాల్లో పండే పంటే మాకు ఆధారం. మా భూముల్లో ఫార్మా కంపెనీ పెడుతున్నరని, భూమిని లాక్కుంటమంటే ఇవ్వబోమని అధికారులకు తేల్చి చెప్పినం. సంతకాలు పెట్టాలని చెప్పారు. ఉన్న ఆధారం పోతుంటే ఎలా ఊరుకుంటం. అధికారులను నిలదీశాం తప్ప ఎవరిపైనా దాడులు చేయలేదు. దాడులు చేయాలని మాకు ఏ పార్టీ చెప్పలేదు. ఏ నాయకుడూ అండగాలేడు. మా కడుపులు మండి నిలదీశాం. నా భర్తను అరెస్టు చేసి జైళో పెట్టారు. ఆయన్ని ఎక్కడుంచారో కూడా తెలియదు.
– గోబిబాయి, లగచర్ల
మాకున్న పొలమే మాకు జీవనాధారం. ఫార్మా కంపెనీ కోసం మా పొలాలు కావాలని అడిగారట. మా ఇరుగు పొరుగు వాళ్లు చెప్తే తెలిసింది. నా భర్త గొడవల దగ్గరకు పోనేలేదు. ఆ గొడవ గురించే మాకు తెలియదు. పొద్దంతా పొలం పనులకు పోయొచ్చి తిని పడుకున్నం. అర్ధరాత్రి పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వచ్చారు. నా భర్తను బలవంతంగా లాక్కెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నారంటూ అడిగేలోపు మమ్ముల్ని పక్కకు తోసేశారు. నా భర్తకు ఆరోగ్యం బాగాలేదు. రూ.20 వేలు పెట్టి ట్రీట్మెంట్ చేయించాం.
– అనంతమ్మ, హకీంపేట
కొద్దిపాటి పొలంలో వరి, కందులు పండించుకుంటున్నం. నోటికాడి కూడును లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్న భూమి పోతే ఎలా బతకాలి? అధికారులొచ్చి ఫార్మా కంపెనీకి భూములియ్యమంటుర్రు. మీకు మా భూములే దొరికాయా. ఉన్న భూములు ఇచ్చేసి ఎలా బతకాలి? మొన్న తిరుపతిరెడ్డి వచ్చి ఫార్మా కంపెనీ వస్తుంది.. సంతకాలు పెట్టాలని అన్నడు. ఫార్మా కంపెనీ పెడితే మా ఊరు నాశనమైపోతుంది. ఇందేటని అడిగినందుకు నా భర్తను అర్ధరాత్రి తీసుకెళ్లారు. ఏ జైల్లో ఉంచారో కూడా తెలియదు.
– దేవీబాయి, లగచర్ల
నా కొడుకు బతుకుదెరువు కోసం దేశంగాని దేశానికి వెళ్లిండు. ఇంట్లో నా మనుమడు, బిడ్డలతో ఉంటున్న. అర్ధరాత్రి వచ్చి నా మనుమడిని బలవంతంగా తీసుకెళ్లిర్రు. నా మనుమడు చిన్న బిడ్డ. గొడవలంటే తెలియదు. అసలు ఆ గొడవ విషయమే వాడికి తెలియదు. మాకున్నదే మూడెకరాలు. అలాగని మా భూములు తీసుకుంటామంటే అస్సలు ఊరుకునేది లేదు. జానెడు భూమికి కొట్టుకుసచ్చే రోజులివి. నాకున్న భూమి మొత్తం ఇవ్వమంటే ఎలా? వాడు చిన్నోడు వదిలిపెట్టండి బాంచెన్.
– వాల్కీబాయి, లగచర్ల