KTR | ‘నిజం కడపదాటేలోగా అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని పెద్దలు చెబుతారు. ఒక్క అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందని అంటారు. నూరు అబద్ధాలు చెప్పయినా లగ్గం చేయాలంటరు. దాన్ని నమ్ముకునే మోదీ ప్రధాని అయ్యారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు’ అని కేటీఆర్ అన్నారు. కరీంనగర్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల్లో ఎవరన్న వచ్చి బిల్లు అడిగితే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పిండు.. రేవంత్రెడ్డి సోనియమ్మ కడుతదని చెప్పిండు. ఇదేం నా సొంత కవిత్వం కాదు. నాకేమీ అక్కసు లేదు. నవంబర్, డిసెంబర్ బిల్లు కట్టకండి.. మేమే కడతమని ఒకాయన అన్నడు.. సోనియాగాంధీ కడుతుందని కడుతుందని మరొకరు అన్నరు’ అని కేటీఆర్ గుర్తు చేశారు.
‘అందుకే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసిది. సోషల్ మీడియా పవర్ ఏంటంటే.. ఇక్కడ కూర్చున్నది 1750 మంది కానీ.. మీ పవర్ ఒక్కొక్కరు వెయ్యి రెండువేల ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉన్నవారు. 1969లో తెలంగాణ మొదటి దశ ఉద్యమం జరిగిన నాడు ఊర్లలో పేపర్లు లేవు. ఇవాళ్టి పేపర్ రేపు, ఎల్లుండి వచ్చేది. ఆల్ ఇండియా ఉంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది. వారికి బుద్దిపుడితే వార్త వేయాలే.. లేకపోతే లేదు. అయినా తెలంగాణ ఉద్యమం దావానలంలా అంటుకున్నది. ఊరు ఊరుకు అంటుకున్నది ఎట్లా..? ఒకరికొకరు చెప్పుకున్నరు. బిడ్డ తెలంగాణ వస్తేనే మనకు న్యాయం, లాభం జరుగుతుంది.. తెలంగాణ వస్తేనే ఇన్సాఫ్ దొరుకుతుందని ఆ నాడు ఒకరికొకరు చెప్పుకున్నరు. ఆ నాడు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా లేదు. సోషల్ మీడియా కూడా లేని రోజుల్లో ఉద్యమాన్ని ఆ రోజు ఇంటింటికి అంటించారు. ఒక దీపంతో ఒక దీపాన్ని వెలిగించినట్లు’గా అన్నారు.
‘ఆ తర్వాత పేపర్లు పెరిగాయ్. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. కానీ వాటన్నింటిని తలదన్నేది సోషల్ మీడియా. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఈ ఐదు అస్త్రాలను పదునుగా వాడి లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చేస్తారు. పెద్దలు చెబుతారు. నిజం కడప దాటేలోపట.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెబుతరు. ఒక్క అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందని అంటారు.. నూరు అబద్ధాలు చెప్పయినా లగ్గం చేయాలంటరు. దాన్ని నమ్ముకునే మోదీ ప్రధాని అయ్యారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఎట్లంటే వాళ్ల హామీలు, మాటలు చూడండి. నిజంగా చెప్పాలంటే కాంగ్రెసోళ్లు కూడా కలలో కూడా అనుకోలేదు అధికారంలోకి వస్తామని. ఇవన్నీ నిలబెట్టుకోవాల్సి వస్తుంది అనుకోలేదు. నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటూ వెళ్లారు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ.. ఏదిపడితే ఫ్రీ అనుకుంటూ వెళ్లారు. 420 హామీలను దొరుకబడుతమ్ అని అనుకోలేదు’ అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు.