సిరిసిల్ల టౌన్, మార్చి 22: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచారు. సొంత ఖర్చులతో జిల్లా కేంద్రంలో టీ స్టాల్ ఏర్పాటు చేయించి చిరు వ్యాపారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆదివారం సిరిసిల్లలో టీ స్టాల్ ప్రారంభోత్సవం చేయనుండగా, ఏర్పాట్లను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.
వివరాల్లోకి వెళ్తే సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చిరు వ్యాపారి బత్తుల శ్రీనివాస్ స్థానిక బతుకమ్మ ఘాట్ వద్ద టీ స్టాల్ నడుపుకొంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కేటీఆర్‌పై ఉన్న అభిమానంతో శ్రీనివాస్ తన హోటల్‌కు కేటీఆర్ టీ స్టాల్ అని పేరు పెట్టుకోవడంతోపాటు హోటల్‌పై కేటీఆర్ ఫొటోలను ఏర్పాటు చేశాడు. గత నెలలో మున్సిపల్ అధికారులు ట్రేడ్ లైసెన్స్ లేదంటూ శ్రీనివాస్ నిర్వహిస్తున్న హోటల్‌ను మూసివేయించారు. అదే రోజు శ్రీనివాస్‌తో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు.