KT Rama Rao | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సమయంలో బియ్యం ఉత్పత్తిలో దేశంలో తొలి పది స్థానాల్లో కూడాలేని స్థితి నుంచి ఇవ్వాళ నంబర్ 1 స్థానానికి చేరుకోవడం గర్వంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉన్నదని యూనిఫైడ్ పోర్టల్ ఫర్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ (యూపీఏజీ) తాజా నివేదికలో వెల్లడించిన నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తంచేశారు. ‘నెర్రెలు బారిన ఈ నేల పచ్చబడింది.. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే రాష్ట్రమూ సాధించని అరుదైన రికార్డు సాధించింది.. దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా ఎదిగింది. అందుకు కారణం రైతుబిడ్డ కేసీఆర్ దార్శనికత, కార్యాచరణే’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘భూగోళం మీద అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన ఆహారాన్ని మనమే పండించుకోవాలి కానీ, ఇంకెవరూ మనకు ఆహారం సమకూర్చలేరు’ అంటూ కేసీఆర్ తరచూ చెప్పిన విషయాన్ని కేటీఆర్ ఉదహరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణం, రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు, ధాన్యం కొనుగోళ్లు, కొత్త గోదాములు, రైతు వేదికల నిర్మాణం ఇలా అనేక విప్లవాత్మక విధానాలతో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరిగి, తద్వారా బియ్యం ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని వివరించారు. దేశంలో మరే రాష్ట్రం సాధించని వ్యవసాయ విప్లవంతో రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.
మోదీ+అదానీ.. ఈ ఇద్దరే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజన్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మోదీ, అదానీకి కావాల్సిన పనులను చకబెడుతూ వారి చల్లనిచూపు తనపై ఉండేలా సీఎం రేవంత్‌రెడ్డి చూసుకుంటున్నారని విమర్శించారు. మూసీ పుట్టిన ప్రాంతం దామగుండం వద్ద 12 లక్షల చెట్లను నరికేసేందుకు 2,900 ఎకరాల అటవీ భూమిని మోదీ ఆదేశాలకు అనుగుణంగా అదానీకి అప్పగించారని ఆరోపించారు. మూసీ పుట్టే ప్రాంతం నాశనమైనా సరే, బడేభాయ్ ఆజ్ఞను పాటిస్తున్నారని ధ్వజమెత్తారు. మూసీ దిగువన రామన్నపేటలో అంబుజా సిమెంట్ ప్లాంట్ కోసం బూటకపు పబ్లిక్ హియరింగ్ నిర్వహించడం ద్వారా అదానీని ముఖ్యమంత్రి సంతృప్తి పరుస్తున్నారని ధ్వజమెత్తారు. నిజానికి ఆ భూమిని తెలంగాణలో డ్రైపోర్ట్ కోసం కేటాయించిన విషయాన్ని కేటీఆర్ వివరించారు. మోదీ+అదానీ కోసం రేవంత్‌రెడ్డి సర్కార్ ఇష్టానుసారంగా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అదానీకి మేలు చేస్తున్నదని మండిపడ్డారు. అందుకు ప్రతిఫలంగా రూ.1.5 లక్షల కోట్ల తో మూసీ ప్రాజెక్ట్ సహా రేవంత్‌రెడ్డి ప్రభు త్వం చేసే అన్ని దుర్మార్గాలు, అవినీతిపై బీజే పీ మౌనం వహిస్తున్నదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ సర్కార్‌పై అన్ని వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ‘అన్ని రంగాల్లో వైఫల్యం.. అన్ని వర్గాల్లో ఆ గ్రహం.. ఇదీ రేవంత్ సర్కార్ తీరు’ అని ఆయన ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. సకల జనులను దగా చేసిందని మండిపడ్డారు. ఉ ద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతు లు, కార్మికులు, మహిళలు.. ప్రతివర్గం ఆందోళనబాట పడుతున్నదని ఉదహరించారు.
ఆదిలాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ గురువారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు నిరసన సభకు హాజరుకానున్నారు. మాజీ మంత్రి జోగు రామన్న బుధవారం సభా ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ, రైతుభరోసా అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ సభ నిర్వహిస్తున్నారు.