హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేస్తున్నదని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కపిల్ సిబల్ వైఖరి గురువిందగింజ మాదిరిగా ఉన్నదని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. కర్ణాటకలో బీజేపీలానే తెలంగాణలో కాంగ్రె స్ కూడా అదే పని చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నదని, సిబల్ కు ఇది ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలోనూ పదో షెడ్యూల్ అపహాస్యమవుతున్నదని తెలిపారు. పోలీసులు, విజిలెన్స్‌ను అడ్డంపెట్టుకుని అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రాహుల్‌గాంధీ మాత్రం రాజ్యాంగ పరిరక్షకుడిలా ఫోజులు కొడుతుండడం సిగ్గుచేటని విమర్శించారు.కాంగ్రెస్ పాలిత రాష్ర్టా ల్లో జరుగుతున్న తప్పులను తొలుత సరిదిద్ది, విమర్శలు చేయాలని కపిల్ సిబల్‌కు కేటీఆర్ హితవు పలికారు.
కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
రైతునువంచించాలని చూస్తే కాలం రాగానే రైతు తాను దిగమింగిన దుఃఖం ప్రతాపాన్ని రుచి చూపిస్తాడని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ గడ్డమీద నిలబడి రుణమాఫీ డిక్లరేషన్ ఇచ్చి రైతులను నిండా మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. రూ.లక్ష రుణమాఫీ కావాలని రైతు బ్యాంకుకు వెళితే లక్ష ఖర్చు అయ్యేలా కేసులు పెడతారా? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అని ప్రశ్నించారు. అన్నదాతపై పోలీసులు దాష్టీకాలకు పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ సహించదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పాలకులారా ఖబడ్దార్ అని కేటీఆర్ హెచ్చరించారు.