హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత సాంకేతిక యుగంలో తమకు ఎదురైన ఇబ్బందులు, చేదు అనుభవాలను ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించడం సర్వసాధారణం. ఒక మహిళ కరెంటు కోతలతో తనకు కలిగిన ఇబ్బందిని ఎక్స్ వేదికగా చెప్పడాన్ని విద్యుత్తు సిబ్బంది జీర్ణించుకోలేకపోయారు. ఆమె అడ్రస్ కనిపెట్టి ఇంటికి వెళ్లి మరీ బెదిరించారు. ‘ట్వీట్ తొలగిస్తారా? లేదా? తొలగించేదాకా ఇక్కడి నుంచి కదిలేదిలేదు.. పైనుంచి మాకు ఒత్తిడి ఉన్నది’ అని భయపెట్టారు. అసలే మహిళ.. ఆపై అద్దె ఇల్లు. చేసేదిలేక ట్వీట్‌ను తొలగించింది. ఈ విషయాన్ని కూడా ఎక్స్‌లో మళ్లీ పోస్టు చేసింది. ‘ఎలాంటి ప్రభుత్వం ఇది..?!’ (వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ దిస్) అంటూ అసహనం వ్యక్తంచేసింది. ఈ అంశాన్ని మహిళా జర్నలిస్టు రేవతి రీ ట్వీట్ చేస్తూ విద్యుత్తుశాఖ తీరుపై మండిపడ్డారు. ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడిది? అనే రీతిలో అధికార యంత్రాంగం ప్రవర్తించడంపై ఫైరయ్యారు. విద్యుత్తు శాఖ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడంపై ఆమె నిలదీశారు. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. సమస్యలపై ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ఎక్స్ వేదికగా నిలదీశారు.
ఏకబిగిన 7 గంటలు కరెంట్ కట్
హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని ఆటోనగర్‌కు చెందిన కృతిక అనే మహిళ తమ దగ్గర కొన్ని రోజులుగా తరచూ గంటలకొద్దీ కరెంటు పోతున్నదని ట్వీట్లో పేర్కొన్నారు. శనివారం ఏకంగా ఏడుగంటలపాటు కరెంటు పోయిందని ఆమె పోస్టులో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్తుశాఖ సిబ్బంది మంగవారం ఉదయం కృతిక ఇంటికి వెళ్లినట్టు తెలిసింది. కరెంటు కోతలపై ఎందుకు ట్వీట్ చేశారని ఆమెను ప్రశ్నించిన సిబ్బంది.. వెంటనే ట్వీట్ తొలగించాలని బెదిరింపులకు దిగారు. ఇదే విషయాన్ని కృతిక మంగళవారం ఉదయం 11.11 గంటలకు మళ్లీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘కరెంటు కట్ అయిందని కంప్లయింట్ చేస్తే ఇంటికి వచ్చి మరీ ట్వీట్ డిలీట్ చేయిస్తున్నారు పైనుంచి ప్రెషర్ ఉన్నదని. ఎలాంటి ప్రభుత్వం ఇది?’ అని అసహనం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళా జర్నలిస్టు రేవతి సాయంత్రం ఘాటుగా స్పందించారు. ఎల్బీనగర్ పరిధిలో ఊహించని పరిణామం జరిగిందని తెలిపారు. కరెంటు కోతలను చెప్పుకుంటే లైన్మెన్ బెదిరించి మరీ ట్వీట్‌ను డిలీట్ చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని తాను నిర్ధారణ చేసుకున్నానని, సదరు మహిళతో మాట్లాడితే ఆమె తన భద్రత పట్ల భయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని, విద్యుత్తు సిబ్బందికి ఇప్పటికే తన అడ్రసు కూడా తెలిసిపోయిందనే ఆందోళనను బాధితురాలు వ్యక్తంచేసిందని చెప్పారు. సోషల్ మీడియా యుగంలో ఫిర్యాదు చేస్తే ప్రశ్నించే హక్కులేదనే రీతిలో విద్యుత్తు శాఖ తీరు ఉన్నదని మండిపడ్డారు.
పోలీసుల ప్రవేశంతో మరో మలుపు
ఎక్స్ వేదికగా కరెంటుపై జరుగుతున్న ఈ రచ్చలోకి రాచకొండ పోలీసులు ప్రవేశించడం మరో మలుపు తిప్పింది. ఈ అంశంపై పూర్తి వివరాలిస్తే తాము పరిశీలిస్తామంటూ రాచకొండ పోలీసులు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. జర్నలిస్టు రేవతి ‘ఇది విద్యుత్తు శాఖకు సంబంధించిన అంశం కదా. మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. ఒక మహిళకు జరిగిన ఇబ్బందిని తాను లేవనెత్తితే పోలీసులు ఎందుకు కలుగచేసుకుంటున్నారని నిలదీశారు.
తెలంగాణలో షాకింగ్ పరిణామాలు: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే కరెంటు రచ్చపై స్పందించారు. ‘విద్యుత్తు సరఫరాకు సంబంధించి పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తిన జర్నలిస్టుపైనే పోలీసులు బెదిరింపులకు పాల్పడతారా? రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు షాక్‌నిచ్చేలా ఉన్నాయి. అసలు మీకు ఏమి హక్కు ఉన్నదని విద్యుత్తు సమస్యలపై ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తారు’ అని ఎక్స్ వేదికగా నిలదీశారు. పోలీస్‌శాఖ ఏమైనా విద్యుత్తు శాఖను సైతం నడుపుతుందా? సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నలు లేవనెత్తితే వారిపై మీరు కేసులు పెడతారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి తెలంగాణ డీజీపీ, రాచకొండ పోలీసులు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
విద్యుత్తు సరఫరాను వెంటనే పునరుద్ధరించాం: ఎస్ఈ
సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని ఎల్బీనగర్ సెక్షన్ పరిధిలోని ఎల్పీటీ మార్కెట్ ప్రాంతంలో ఉదయం సబ్‌స్టేషన్‌లో విద్యుత్తు అంతరాయం తలెత్తిందని సరూర్‌నగర్ సర్కిల్ సూపరింటెండెంట్ కరుణాకర్ తెలిపారు. ట్రాన్స్‌కో విభాగం అధికారులు పను లు చేస్తుండటం ఒక ఫీడర్ నుంచి విద్యుత్తు సరఫరా నిలిపివేసి, మరో ఫీడర్ నుంచి సరఫరా ఇచ్చామని పేర్కొన్నారు. ఇందుకు 5 నిమిషాల సమయం పట్టిందని చెప్పారు. ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేసిన వినియోగదారులు గత శనివారం తలెత్తిన విద్యుత్తు అంతరాయం మూడు గంటలకుపైగా ఉన్నదని తెలిపారు. అయితే దానికి ముందుగానే ప్రకటన ఇచ్చామని పేర్కొన్నారు.
కరెంటు లేక.. ట్యాంకర్ ద్వారా తడులు
ఓ వైపు వర్షాలు లేక నిరాశ చెందుతుండగా.. మరోవైపు బావులపై మీద ఆధారపడి సాగు చేస్తున్నవారికి విద్యుత్తు అధికారుల తీరుతో నారుమడులు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కరీంనగర్ మండలం మొగ్దుంపూర్ శివారులోని పొలాలకు చేగుర్తి ఫీడర్ ద్వారా విద్యుత్తు సరఫరా జరుగుతున్నది. రెండ్రోజుల క్రితం గాలివానకు విద్యుత్తు స్తంభం ఒరిగి కేబుల్ వైర్ మీద పడటంతో సరఫరా నిలిచిపోయింది. ఎండలు దంచి కొడుతుండటంతో నారుమడులు ఎండిపోయే స్థితికి చేరాయి. బావుల్లో నీరున్నా కరెంట్ లేక అందించుకోలేని దుస్థితి నెలకొన్నది. దీంతో మంగళవారం కౌలు రైతు మంద అశోక్ రూ.2 వేలు వెచ్చించి వాటర్ ట్యాంకర్ తెప్పించి నీరందించాడు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని రైతు వాపోయాడు.
విద్యుత్తు సిబ్బంది తీరుపై మంగళవారం కృతిక అనే మహిళ చేసిన ట్వీట్