హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం లభించింది. ఈ నెల 19, 20 తేదీల్లో రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగే ‘టాక్ జర్నలిజం-2025’ కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరు కావాలని కేటీఆర్‌కు నిర్వాహకులు బుధవారం ఆహ్వానం పంపారు. దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ నాయకులు పాల్గొనే అత్యంత ప్రతిష్ఠాత్మక సమావేశాలలో ఒకటిగా ఈ కార్యక్రమం పేరొందింది.
దక్షిణ భారత రాజకీయాల్లో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలంగా వినిపిస్తూ.. విజన్ ఉన్న వినూత్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న కేటీఆర్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా కేటీఆర్ తెలంగాణలో తెచ్చిన మార్పుల దృష్ట్యా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
మీడియా రంగంలో మార్పులు, ధోరణులు, సవాళ్లపై చర్చించేందుకు ప్రముఖ వేదికగా ‘టాక్ జర్నలిజం’కు పేరుంది. ఇప్పటివరకు ఎనిమిది ఎడిషన్లలో రాజదీప్ సర్దేశాయి, రవీశ్ కుమార్, బరాదత్, సౌరభ్ ద్వివేది, సుహాసిని హైదర్ లాంటి భారతీయ జర్నలిస్టులు పాల్గొన్నారు. అంతర్జాతీయంగా ఎడ్వర్డ్ స్నోడెన్, పులిట్జర్ బోర్డు మాజీ అధ్యక్షుడు రాబిన్సన్, ఐసీఐజే ఎడిటర్ గెరార్డ్, గార్డియన్‌కు చెందిన నిక్ డేవిస్, సండే టైమ్స్‌కు చెందిన ల్యాంబ్ పాల్గొన్నారు. ఈసారి కేటీఆర్ ‘ప్రాంతీయ అసమానతలు, సమాఖ్య విధానం, మారుతున్న భారత రాజకీయాల దిశ’అంశంపై ప్రసంగించనున్నారు.