హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే టిమ్స్‌కు అంకురార్పణ చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో టిమ్స్ ఆసుపత్రులను కేసీఆర్ రూపకల్పన చేశారని వివరించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు మాగంటి సునీత, పీ విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్ యాదవ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, పల్లె రవికుమార్ గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు, మాజీ కార్పొరేటర్లు రాజ్‌పటేల్, శ్రీహరి, గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి శుక్రవారం సనత్‌నగర్ టిమ్స్‌ను కేటీఆర్ సందర్శించారు. ప్రజలకు మెరుగైన వై ద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ నలు దిక్కులా టిమ్స్ హాస్పిటళ్లు నిర్మించాలన్నదే త మ నాయకుడు కేసీఆర్ విజన్ అని తెలిపారు. ఎయిమ్స్ తరహాలో టిమ్స్ ఉండాలనే ఉదాత్తమైన ఆలోచనతో బీఆర్ఎస్ వీటికి అంకురార్పణ చేసినట్టు పేర్కొన్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండే రోగులకు అందుబాటులో ఉం డాలన్న ఉద్దేశంతో చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణం లో 22 ఎకరాల్లో కార్పొరేట్‌కు దీటుగా ఈ హా స్పిటల్ నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఇందుకు హైదరాబాద్ ప్రజల తరఫున కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
సనత్‌నగర్ నిర్మాణాన్ని చూస్తుంటే ‘నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన’కు అనే పరిస్థితు ల నుంచి ‘సర్కార్ దవాఖానకు పోదాం’ అనే లా పరిస్థితులు మారాయని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో నగరంలో నాలుగు టి మ్స్లు, 2,000 పడకలతో తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్‌ను వరంగల్‌లో నిర్మాణం చేపట్టినట్టు గుర్తుచేశారు. సనత్‌నగర్ టిమ్స్‌లో మొత్తం మూడు బ్లాక్‌లు, 1,000 పడకలు, 300 ఐసీయూ బెడ్లు, 16 ఆపరేషన్ థియేటర్లు, క్యాథ్‌ల్యాబ్స్, రేడియాలజీ, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ఎక్స్‌రే వసతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. టిమ్స్‌లో 30 వీఐపీ సూట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కిడ్నీ సంబంధిత వ్యాధులకు డయాలసిస్ సౌకర్యం కల్పించామని చెప్పారు. టిమ్స్ ఆసుపత్రి డిజైన్ దేశంలోనే అత్యుత్తమ ప్రభు త్వ వైద్య నిర్మాణాల్లో ఒకటని వివరించారు.
సనత్‌నగర్ టిమ్స్‌లో అకడమిక్ బ్లాక్, రీసె ర్చ్ బ్లాక్, 300 మం ది కూర్చునేలా ఆడిటోరి యం నిర్మించామని, 1,000 కార్లు పట్టేలా పా ర్కింగ్ వ్యవస్థను రూపొందించామని తెలిపారు. జిల్లాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల మాదిరిగా టిమ్స్ నిర్మాణాలకు కేసీఆర్ ప్రాముఖ్యత ఇవ్వడంతోనే నగరానికి నాలుగు వైపులా 4,000 పడకల దవాఖానలు రాబోతున్నాయ ని చెప్పారు. నిమ్స్ విస్తరణలో భాగంగా మరో 2,000 పడకలు అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు. కేసీఆర్ ఆనవాళ్లు ఉండిపోతాయనే భయంతోనే నిర్మాణ పనులు పూర్తి చేస్తే ఆయనకు పేరొస్తుందనే భేషజాలకు పోకుండా ప్రభుత్వం వెంటనే టిమ్స్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే లక్ష్యంతో హైదరాబాద్ నలు దిక్కులా టిమ్స్ హాస్పిటళ్లు నిర్మించాలన్నది మా నాయకుడు కేసీఆర్ విజన్. అందులో భాగంగానే 350 బస్తీ దవాఖానలు, ప్రైమరీ డిస్పెన్సరీ కేంద్రాలతో పాటు అద్భుతమైన వైద్యసేవలు అందించేందుకు టిమ్స్ ఏర్పాటు చేసినం. ఎయిమ్స్ తరహాలో టిమ్స్ ఉండాలనే ఉదాత్తమైన ఆలోచనతో బీఆర్ఎస్ హయాంలోనే వీటికి అంకురార్పణ చేసినం.
-కేటీఆర్
కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు నందినగర్‌లోని నివాసానికి సమీపంలో ఉన్న బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ముందు నుంచి వచ్చి వెళ్లేవారని కేటీఆర్ గుర్తుచేశారు. అదే సమయంలో రోగుల సహాయకులు రోడ్ల మీదే పడుకొని ఉండటాన్ని చూసి చలించిపోయారని తెలిపారు. అందుకే టిమ్స్ నిర్మించేటప్పుడు రో గుల కోసం వచ్చి వెళ్లే సహాయకుల కోసం 200 మందికి సరిపడేలా అత్యాధునిక వసతులతో ధర్శశాల నిర్మించారని చెప్పారు. సనత్‌నగర్ టి మ్స్‌లో ఎమర్జెన్సీ దగ్గర ర్యాంపు లేదని, పేషెం ట్ లిఫ్టులో స్ట్రెచర్ వెళ్లడం లేదని, కొన్ని చోట్ల పేషెంట్ల లిఫ్టులు పనిచేయడం లేదని ఈ అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టికి సారించాలని కో రారు. ప్రాథమిక వైద్య సేవల కోసం 350 బస్తీ దవాఖానలు, అత్యాధునిక వైద్య సేవలు అం దించేందుకు 4,000 బెడ్లతో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లు కేసీఆర్ ప్రజలకు అందించిన అద్భుత కానుక అని కొనియాడారు. 4,000 పడకల్లో 1,200 ఎమర్జెన్సీ బెడ్లను ఆక్సిజన్ వసతులతో ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
రూ.1,200 కోట్లతో నిర్మిస్తున్న సనత్‌నగర్ టిమ్స్ కేసీఆర్ ప్రభుత్వం ఉండి ఉంటే రెండున్నరేండ్ల క్రితమే పూర్తయ్యేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎక్కడ బీఆర్ఎస్కు మంచి పేరు వ స్తుందోనని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణ పను ల్లో తీవ్ర జాప్యం చేసిందని మండిపడ్డారు. కాం గ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో కేవలం 20 శాతం పనులు పూర్తి చేసిందని చెబుతున్నది కదా.. అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ బదులిస్తూ టిమ్స్ నిర్మాణాలకు రూపకల్పన చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. భారతదేశ చిత్ర పటంలో తెలంగాణ రాష్ర్టాన్ని నిలిపిన కేసీఆర్‌కు, పేదల ఆరోగ్యంపై పూర్తి అవగాహన ఉన్నది కాబట్టే జిల్లా కో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ నగరంలో మూడు దవాఖానలే ఉన్నాయని, ఒక్కటైనా కొత్త దవాఖానను నిర్మించా రా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఆ రోగ్య పరంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఉండవద్దనే లక్ష్యంతో కేసీఆర్ టిమ్స్‌లకు బీజం వేశారని తెలిపారు. నాడు బీఆర్ఎస్ హయాంలోనే టిమ్స్ నిర్మాణాలు 50 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. కాంగ్రెస్ వచ్చాక కొత్తగా చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్, గచ్చిబౌలి టిమ్స్‌లతో పాటు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిమ్స్ విస్తరణ పనులను సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కోరారు.
గంభీరావుపేట, మే 15: ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకొని గల్ఫ్‌బాట పట్టి గుండెపోటుతో మృతిచెందిన యువకుడి మృతదేహం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ముచ్చర్లకు చేరింది. వివరాల్లోకి వెళితే.. ముచ్చర్లకు చెందిన గుమ్ముల సునీల్ (28) ఉపాధి కోసం రెండేండ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. గత ఏప్రిల్ 23న గుండె పోటుతో మృతి చెందాడు. తమ కొడుకు మృతదేహాన్ని ఇంటికి తెప్పించాలని స్థానిక నేతల సహకారంతో విజ్ఞప్తి చేయగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గల్ఫ్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడగా, 21 రోజుల తర్వాత సునీల్ మృతదేహం శుక్రవారం ఇంటికి చేరుకున్నది. బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన కొడుకు హఠాన్మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహంపై పడి రోదించిన తీరు కలచివేసింది.