‘జీడిమెట్ల ప్రాంతంలో గజానికి మారెట్ ధర రూ.లక్ష ఉన్నది. కానీ ప్రభుత్వం కేవలం రూ.4వేలకే పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతామని చెప్తున్నది. ఇదే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుంభకోణానికి నిదర్శనం. ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలి. బీఆర్ఎస్ పోరాటానికి మద్దతుగా వచ్చి వేలాది ఎకరాల భూములను కాపాడాలి.
-కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో/ కుత్బుల్లాపూర్/ దుండిగల్/ జగద్గిరిగుట్ట, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని, అవసరమైతే దీనికోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాగిస్తున్న భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అత్యాశకు వెళ్లి ప్రభుత్వానికి డబ్బులు కడితే పారిశ్రామిక భూములతోపాటు డబ్బులు కూడా పోతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పారిశ్రామిక భూముల బదలాయింపుపై కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నిజనిర్ధారణ బృందం గురువారం జీడిమెట్ల ఇండస్ట్రియల్ పార్లో పర్యటించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. భూముల దోపిడీ ఆర్నెళ్లుగా జరుగుతున్నదని, హిల్ట్ పాలసీ ఇప్పుడు బయటకు వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇంతటి భారీ కుంభకోణాన్ని, దోపిడీని చూసి తట్టుకోలేక తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న తెలంగాణ బిడ్డ తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీపై తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, సమాచారం లీక్ అయిందంటూ ప్రభుత్వం బాధపడుతున్నదని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం చేస్తున్న దోపిడీపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గురువారం సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో పర్యటిస్తున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం. చిత్రంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, నేతలు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆదర్శ్‌రెడ్డి, శివకుమార్ తదితరులు
హిల్ట్ పాలసీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల మంది కార్మికుల కుటుంబాలను రోడ్డుపాలు చేసే కుట్ర చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నదని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి కాదు.. అవినీతి అనకొండ అని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలు పరిశ్రమలు నెలకొల్పి, ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు ఇచ్చిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నదని, అపార్ట్మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్సులు కట్టుకోవడానికి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నదని మండిపడ్డారు. ఇకడ ఉన్న పరిశ్రమలు తరలివెళ్తే నగరంలో వాటిపైన ఆధారపడిన లక్షల మంది ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం చెప్తున్నట్టు అవి ప్రైవేటు వ్యక్తుల భూములు కావని, ప్రైవేట్ వ్యక్తులకు ప్రజలు, ప్రభుత్వం ఇచ్చిన భూములని స్పష్టంచేశారు. మారెట్లో గజం ధర రూ.లక్షన్నర పలుకుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ.4 వేలకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నదని విమర్శించారు.
‘కాంగ్రెస్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని రద్దు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పాఠశాలలు, దవాఖానలు, చివరికి శ్మశానాలు నిర్మించడానికి కూడా స్థలం లేదు. కానీ, ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు 9,292 ఎకరాల భూమిని అప్పనంగా ఇస్తామంటున్నది. ఆ భూములను తిరిగి వెనకి తీసుకొని అకడ కాంగ్రెస్ చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా సూళ్లు, దవాఖానలు కట్టాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో స్థలం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. ‘కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ భూ కుంభకోణాన్ని ప్రజలకు వివరించేందుకే పారిశ్రామికవాడల్లో పర్యటిస్తున్నాం. ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇకడితో వదిలిపెట్టదు. కాంగ్రెస్ పార్టీ హిల్ట్ పాలసీ కుంభకోణంపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం.

జీడిమెట్లలో కార్మికులతో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, శంభీపూర్ రాజు
నగరంలోని అన్ని కాలనీల ప్రజలకు ఈ అంశాన్ని వివరిస్తాం. మేధావులు, పర్యావరణవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకుపోతాం. ఢిల్లీకి మూటలు పంపడానికి చేస్తున్న ఈ సామ్‌ను బీఆర్ఎస్ అడ్డుకుని తీరుతుంది. హిల్ట్ పాలసీని వెనకి తీసుకొనే లక్షల కోట్ల విలువచేసే ప్రజల భూమిని కాపాడే దాకా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’అని కేటీఆర్ స్పష్టంచేశారు. జీడిమెట్ల పారిశ్రామికవాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.