హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చేవెళ్ల గడ్డపై మరోసారి గులా బీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి చేవెళ్ల ప్రజలతో పాటు అన్ని వర్గాల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తున్నదని స్థానిక నాయకులు వివరించారు. 30 ఏండ్లపాటు సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్‌కి ఈ ఎన్నికల్లో గెలుపు తథ్యమని కేటీఆర్ చెప్పారు. జ్ఞానేశ్వర్ గ్రామీణ ప్రాంతం నుంచి అంచలంచెలుగా ఎదిగారని, సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడని కేటీఆర్ గుర్తు చేశారు.
రంగారెడ్డి జిల్లా స్థానికుడు కావడంతో అక్కడి ప్రజల కష్టసుఖాలు, అన్ని ప్రాంతాలపైన ఆయనకు సంపూర్ణ అవగాహన ఉన్నదని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల బహిరంగ సభ తర్వాత జ్ఞానేశ్వర్ విజయం ఖాయమైందని, ఈ దిశగా అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని తెలిపారు. చేవెళ్లలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు అధికారాన్ని అనుభవించి.. పార్టీకి, నాయకత్వానికి నమ్మకద్రోహం చేసి వెళ్లిన రంజిత్‌రెడ్డితోపాటు మహేందర్‌రెడ్డి వైఖరిని ప్రజలు అసహించుకుంటున్నారని స్థానిక నేతలు తెలిపారు. నిబద్ధతలేని నాయకులను ప్రజలు నమ్మరని, అధికారం కోసం జెండాలు మార్చే వాళ్ళని తిరసరిస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.