హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తనను అరెస్టు చేయించే ధైర్యం చేయబోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (KTR) వ్యాఖ్యానించారు. ఆ కేసులో ఏమీలేదని ముఖ్యమంత్రికి కూడా తెలుసునని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో ప్రెస్‌మీట్ అనంతరం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. తాను ఏ తప్పూ చేయలేదని, లైడిటెక్టర్ టెస్టుకైనా సిద్ధమేనని పునరుద్ఘాటించారు.
ఏదైనా కేసులో లైడిటెక్టర్ టెస్ట్‌కు ముందుకొచ్చిన రాజకీయ నాయకుడు దేశంలో మరెవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే ఈ కేసు పెట్టారని విమర్శించారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహించినట్టు స్పష్టంచేశారు. ఇందుకు హెచ్ఎండీఏ నిధులను పారదర్శంగా వినియోగించామని తెలిపారు. తాము పంపించిన డబ్బులు అవతలి సంస్థకు చేరినప్పుడు ఇక అవినీతి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ అందాల పోటీల పేరిట రూ.50 కోట్ల ప్రజాధనం ఎందుకు ఖర్చు చేసిందని ప్రశ్నించారు. చివరికి అందాలభామల ఆరోపణలతో తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని విమర్శించారు.
కడియంను కాపాడేందుకు దానంతో రాజీనామా
పార్టీ ఫిరాయింపుల కేసులో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాపాడేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో రాజీనామా చే యించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ప్రభుత్వం పరువుపోతుందని, ముందుగానే ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత ఎమ్మెల్యే స్థానా ల్లో ఉపఎన్నికలు వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.