నిజామాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవ గర్జన కార్యక్రమం విజయవంతమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై గులాబీ శ్రేణుల్లో ధైర్యం నింపారు. ఏప్రిల్ 14న లింగంపేట అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన దమనకాండకు నిరసనగా తలపెట్టిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ తనదైన శైలిలో ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్రెడ్డి చర్యల్ని చీల్చిచెండాడారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి నివాళులర్పించేందుకు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్ల్లెక్సీలను కాంగ్రెస్ నేతలు చింపివేశారు. బీఆర్ఎస్ నేతలు పెట్టిన ఫ్లెక్సీలను అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రామ పంచాయతీ సిబ్బందిని పురమాయించి తొలగించారు. ఈ చర్యతో రగిలిన గులాబీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుల తీరుపై ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు వచ్చి దారుణానికి తెగబడ్డారు. గులాబీ నేతలపై భౌతిక దాడులతో ఈడ్చుకెళ్లారు. మాజీ ఎంపీపీముదాం సాయిలును ఈడ్చుకెళ్తున్న క్రమంలో ఆయన దుస్తులు చినిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన చర్చకు దారితీసింది. దళిత నేతపై పోలీసుల దాడి విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్ తక్షణమే స్పందించారు. బాధిత నాయకుడితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. తెలంగాణ భవన్కు పిలిపించి పోలీసుల తీరును అడిగి తెలుసుకున్నారు. లింగంపేటకు వస్తానని అప్పుడే మాటిచ్చారు. ముదాం సాయిలుకు అవమానం జరిగిన చోటనే ఆత్మగౌరవ గర్జన పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు.