KTR | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరిరోజు అసెంబ్లీలో భీకరమాటల యుద్ధం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ వైపు, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అందరూ ఒకవైపు అన్నట్టుగా వాడీవేడి చర్చ నడిచింది. ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్, ఏడాది పాలనలో ఘోరంగా విఫలమైందంటూ నిప్పులవర్షం కురిపించారు. ఆరు గ్యారంటీల అమలు ఏమైందని నిలదీస్తూ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలు అనుసరిస్తున్నదంటూ విరుచుకుపడ్డారు. బడ్జెట్ అంచనాల్లోని లోపాలు ఉన్నాయని, పద్దులలో పొంతన లేదని, ప్రాధాన్య రంగాలకు డిమాండ్ మేరకు నిధుల కేటాయింపు జరగలేదని నిలదీశారు.
కేటీఆర్ ప్రసంగానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అడ్డుపడుతున్నప్పటికీ కేటీఆర్ ధారాళంగా ప్రసంగించిన తీరుపై బీఆర్ఎస్ వర్గాలు, అభిమానుల్లో ప్రశంసల జల్లు కురుస్తున్నది. ఓ దశలో సీఎం రేవంత్‌రెడ్డి కేటీఆర్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తూ, కించపర్చేలా మాట్లాడినప్పటికీ కేటీఆర్ మాత్రం చర్చను పక్కదారి పట్టకుండా, సర్కారుపై గురితప్పకుండా సూటిగా ప్రశ్నించారని నెటిజన్లు అభినందిస్తున్నారు.
రేవంత్‌రెడ్డి లేవనెత్తిన ప్రతీ అంశాన్ని కూడా దీటుగా గట్టారని బీఆర్ఎస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. కేటీఆర్ సంధించిన వ్యంగ్యాస్ర్తాలు రేవంత్‌రెడ్డికి బలంగా తగిలాయని అభివర్ణిస్తున్నారు. రైఫిల్‌రెడ్డి ఎవరో? పాత కాంగ్రెస్‌ను ఖతం చేసి పదవులను గుంజుకున్నది ఎవరో? డ్రోన్లను ఎగరేసి ఇష్టారాజ్యంగా వ్య వహరించింది ఎవరో? అందరికీ తెలుసు అంటూ కేటీఆర్ చేసిన వీడియోలను గులాబీ శ్రేణులు విస్తృతంగా సర్క్యులేట్ చేస్తున్నారు.