హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మహిళను మంత్రి కేటీఆర్ తన ఎస్కార్ట్ వాహనంలో దవాఖానకు పంపించారు. మంగళవారం సాయంత్రం 4.46 గంటల ప్రాంతంలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ అబ్దుల్లాపూర్‌మెట్‌లోని రమాదేవి స్కూల్ యూటర్న్ వద్ద నుంచి వెళ్తున్నది.
అదే సమయంలో అటు వైపు వెళ్తున్న ఓ కారు డోర్ తెరుచుకొని పక్క నుంచి వెళ్తున్న బైక్‌కు తగిలింది. దీంతో బైక్‌పై వెనుక కూర్చున్న మహిళ కిందపడి గాయపడింది. ప్రమాదాన్ని గుర్తించిన కేటీఆర్.. వెంటనే కాన్వాయ్‌ని ఆపి, ప్రమాదానికి గురైన మహిళను పరామర్శించారు. తన ఎస్కార్ట్ వాహనంలో ఆమెను దవాఖానకు తరలించారు. మంత్రిగా ఎన్నో పనులతో బిజీగా ఉన్నా, ప్రమాదాన్ని చూసి ఆగి తనను పలుకరించడంపై బాధితురాలితోపాటు స్థానికులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.