సిరిసిల్ల రూరల్, మే 22 : సౌదీలో 25 రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడి అచేతన స్థితిలో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మంద మహేశ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాయంతో స్వదేశానికి చేరుకున్నాడు. కొన్ని రోజుల కిందట తన పరిస్థితిని వివరిస్తూ సెల్ఫీ వీడియో ద్వారా కేటీఆర్‌కు గోడు వెల్లబోసుకోగా స్పందించిన కేటీఆర్, ఆ యువకుడికి అండగా నిలవడమే కాకుండా వారి కుటుంబసభ్యులను కలిసి ధైర్యం కల్పించారు.
ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి సౌదీ నుంచి మండెపల్లికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. మహేశ్‌కు మెరుగైన వైద్యం అందిస్తామని హైదరాబాద్‌లోని కిమ్స్ యాజమాన్యం ద్వారా సౌదీలోని ప్రభుత్వ దవాఖానకు లేఖ రాయించారు. గురువారం మహేశ్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడి నుంచి అతడిని కిమ్స్ దవాఖానకు తీసుకెళ్లారు. ఆపదలో అన్నీ తానై నిలిచిన కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని మహేశ్ కుటుంబ సభ్యులు తెలిపారు.