ఈ సిపాయిలు తెచ్చిన పెట్టుబడులను చూసి మనకు అజీర్తి అయ్యిందట! మనం ఈనో తాగాల్నట! కాంగ్రెసోళ్లు పెట్టిన హోర్డింగులను చూసి నవ్వాల్నో ఏడ్వాల్నో అర్థమైతలేదు. రేవంత్‌రెడ్డి పెట్టుబడులు తెచ్చేది తకువ.. ప్రచారం చేసుకునేది ఎకువ. దావోస్ నుంచి లక్షా 78 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తే రేవంత్‌రెడ్డికి సన్మానం చేస్తం.
– కేటీఆర్
హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెసోళ్లు గోబెల్స్ వారసులుగా మా రారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. డిక్లరేషన్లు, బాండు పేపర్లు, గ్యారెంటీ కార్డులు, అఫిడవిట్లు ఇవ్వడంతోపాటు నూరు రోజు ల్లో 420 హామీలు అమలు చేస్తామని దేవుళ్ల మీద ప్రమాణం చేసి మరీ ప్రజలను మోసగించారని మండిపడ్డారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉం టుందో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా అంతేనని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ 420 హామీలకు జనవరి 30వ తేదీతో 420 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మాగాంధీ విగ్రహలకు వినతిపత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
తెలంగాణభవన్‌లో సోమవారం బీఆర్ఎస్వీ కొత్త సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను కేటీఆర్ ఆవిష్కరించి మాట్లాడుతూ పదేండ్ల బీఅర్ఎస్ పాలనలో అన్ని రకాలుగా విద్యారంగాన్ని అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. 294 ఉన్న గురుకులాలను వెయ్యికి పైగా పెంచుకున్నామని, రాష్ట్రంలో కొత్తగా 60 డిగ్రీ కళాశాలు ఏర్పాటు చేసుకున్నామని, 2014 ముందు తెలంగాణలో ఐదు మెడికల్ కాలేజీలు ఉంటే, జిల్లాకో మెడికల్, నర్సింగ్ కాలేజీలు అందుబాటులోకి తెచ్చుకున్నామని వివరించారు. ఫారెస్ట్, హార్టికల్చర్, మహిళా యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకొని మహనీయుల పేర్లు పెట్టుకున్నామని తెలిపారు. తెలంగాణ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా ఉండేలా రూ.7400 కోట్లతో ‘మన ఉరు-మన బడి’ కార్యక్రమం నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మనం డిజిటల్ యుగంలో ఉన్నామని, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తున్నదని కేటీఆర్ చెప్పారు. ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 13 నెలలైనా హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు కాంగ్రెస్ నేతలంతా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆక్షేపించారు. రేషన్‌కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చారిత్రాత్మకమైన కార్యక్రమం అంటున్న ముఖ్యమంత్రి భావదారిద్య్రాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారని విమర్శించారు.
2021లోనే తమ ప్రభుత్వం రేషన్ కార్డులు పంపిణీ చేయగా ఆ కార్యక్రమంలో భట్టి విక్రమార పాల్గొన్నారని గుర్తుచేశారు. అయినా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ భట్టి అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేషన్‌కార్డుల పంపిణీలో భట్టి పాల్గొన్న నాటి ఫొటోను మీడియాకు చూపించారు. ఆరు లక్షల 47 వేలకు పైగా కొత్త రేషన్ కార్డులిచ్చామని, దాన్ని ఏదో చారిత్రాత్మక కార్యక్రమంగా తాము చెప్పుకోలేదన్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా రొటీన్ కార్యక్రమంలో భాగంగా అర్హులైన పేదలకు కార్డులు అందజేశామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలకు జనవరి 30 నాటికి 420 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇద్దాం. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ కలలోకి వచ్చి బుద్ధి చెప్పేలా బాపూజీకి విజ్ఞప్తి చేద్దాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నవమోసాలు మోసిన తల్లి పాత్ర బీఆర్ఎస్దైతే.. మంత్రసాని పాత్ర కాంగ్రెస్ పార్టీది.
-కేటీఆర్
రైతు డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, బాండు పేపర్లు, అఫిడవిట్లు, గ్యారెంటీ కార్డుల పేరుతో నూరు రోజుల్లో అమలుచేస్తామని దేవుళ్ల మీద ప్రమాణాలు చేస్తూ 420 బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను వంచించారని కేటీఆర్ మండిపడ్డారు. అశోక్‌నగర్‌లో తెలంగాణ యువతకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రాహుల్‌గాంధీ ముఖం చాటేశారని దుయ్యబట్టారు. డూప్లికేట్ గాంధీలు ఇచ్చిన దొంగ హామీలను, వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ తెలంగాణ ప్రజలకు 420 హామీలిచ్చి జనవరి 30 నాటికి సరిగ్గా 420 రోజులు అవుతున్నందున మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద నివాళులర్పించి, డూప్లికేట్ గాంధీలకు హామీలు అమలుచేసే బుద్ధి ప్రసాదించాలని విజ్ఞప్తి చేయాలని బీఆర్ఎస్వీ విభాగానికి పిలుపునిచ్చారు. బాపూజీ రాహుల్, ప్రియాంక, సోనియా కలలోకి వచ్చి బాపూజీ బుద్ధి చెప్పేలా విద్యార్థులు, యువకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కాంగ్రెస్ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో రోజుకో రైతు బలవన్మరణానికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన 400 రోజుల్లో 410 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. బ్యాంకుల్లోనే రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్‌తో, పాము కాట్లతో విద్యార్థులు చనిపోతున్నారని, విద్యార్థుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం గురుకుల బాట పడితే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేచిందని, నాలుగు రోజులపాటు హడావుడి చేసిందని, కానీ మళ్లీ గురుకులాల పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆటో డ్రైవర్లు 100 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వైఫల్యాలను ప్రతి ఇంటికి తీసుకుపోవాలని విద్యార్థి విభాగం నాయకులకు సూచించారు.
సీఎం రేవంత్‌రెడ్డి అపరిచితుడు సినిమాలో రాము, రెమో తరహాలో మాట్లాడుతున్నడు. జనవరి 26 నుంచి రైతు భరోసా వేస్తమని చెప్పిన ముఖ్యమంత్రి, నిన్న 17 నిమిషాల్లోనే మాట మార్చిండు. మార్చి 31 వరకు వేస్తామని నాలుక మడతేసిండ్రు. రేవంత్‌రెడ్డి మానసికస్థితిపైన అనుమానాలు వస్తున్నయ్.
-కేటీఆర్
బీఆర్ఎస్ హయాంలో రెండు లక్షల 32 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి లక్షా 60 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామని, ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యామని కేటీఆర్ గుర్తుచేశారు. ఏటా 16 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, కానీ, 1000 ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ ఇవ్వలేదని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంవత్సరంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని రాహుల్‌గాంధీ చెప్పి ఇప్పటిదాకా 12వేల కొత్త ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చినమని చెప్పుకొంటున్న ఉద్యోగాలన్నీ గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి దాదాపుగా భర్తీ పూర్తిచేసినవేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎప్పటిలాగే మంది బిడ్డను తన బిడ్డ అని చెప్పుకొంటున్నదని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత విద్యార్థి విభాగంపై ఉన్నదని సూచించారు.
త్వరలోనే భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) కొత్త కమిటీలు వేసుకుంటామని కేటీఆర్ చెప్పారు. గ్రామ, మండల, కళాశాల, వర్సిటీ స్థాయి కమిటీల ఏర్పాటుతోపాటు ప్రత్యేక శిక్షణ పెట్టుకుందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ అజయ్‌కుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బాల్క సుమన్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, డాక్టర్ రాకేశ్, దూదిమెట్ల బాలరాజ్యాదవ్, ఆంజనేయగౌడ్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, నాయకులు శుభప్రద్‌పటేల్, రాజారాంయాదవ్, తుంగ బాలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అనేది 14 ఏండ్ల పాటు అనేక బాధలు పడి, త్యాగాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిందని కేటీఆర్ గుర్తుచేశారు. తల్లి పురిటి నొప్పులు పడి బిడ్డకు జన్మనిచ్చినట్టుగా తెలంగాణను సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేవలం మంత్రసాని పాత్రకే పరిమితమైందన్నారు. నాడు రేవంత్‌రెడ్డి తుపాకీ పట్టుకొని తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డ విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసని చెప్పారు. తెలంగాణకు పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తే సంతోషిస్తామని, కానీ, అవన్నీ అవాస్తవాలనే విషయం ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. నిరుడు చెప్పిన 40 వేల కోట్ల పెట్టుబడుల్లో ఏవీ వాస్తవ రూపం దాల్చలేదని గుర్తుచేశారు. తాము తెచ్చామని చెప్తున్న పెట్టుబడులు ఎప్పటిలోగా పూర్తవుతాయో, ఎప్పటిలోగా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయో రేవంత్‌రెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిజంగానే ఈ పెట్టుబడులన్నీ వాస్తవరూపం దాలిస్తే తామే సన్మానం చేస్తామని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి అపరిచితుడిలా మారారని కేటీఆర్ విమర్శించారు. జనవరి 26 నుంచి రైతు భరోసా వేస్తామని చెప్పి నిన్న 15 నిమిషాల్లోనే మాటమార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో 12 వేలకుపైగా పంచాయతీలు ఉంటే కేవలం 600 గ్రామాల్లో అంటే 5 శాతం గ్రామాల్లోనే పథకాలు అమలు చేస్తామని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేయించుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి గతంలో సంతకాలు పెట్టిన వాటికే దికులేదని, ఇప్పుడు సంతకాలు పెట్టకుండా పథకాల అమలు అని కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి చెప్తున్న, చేస్తున్న అబద్ధాలు, మోసాలు ప్రజలకు తెలియజేయాలని బీఆర్ఎస్వీకి పిలుపునిచ్చారు.