నిజామాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఆర్మూర్: ఆర్మూర్‌లో మంత్రి కేటీఆర్ రోడ్ షోలో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకున్నది. రోడ్ షోలో భాగంగా ఓపెన్‌టాప్ బస్సులో ప్రయాణిస్తుండగా, డ్రైవర్ సడన్‌బ్రేక్ వేయడంతో రెయిలింగ్ ఒక్కసారిగా విరిగిపోయింది. స్వల్పంగా గాయపడిన కేటీఆర్ వాటిని లెక్క చేయకుండా కొడంగల్‌లో ఎన్నికల ప్రచారానికి బయల్దేరి వెళ్లారు. అసలు ఏం జరిగిందంటే.. ఆర్మూర్‌లో రోడ్ షో అనంతరం హెలిప్యాడ్ వద్దకు వెళ్లే మార్గంలో ఓపెన్ టాప్ బస్సుపైకి ఎక్కిన మంత్రి కేటీఆర్, ఎంపీ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, స్థానిక నాయకులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
బస్సు బందోబస్తు మధ్య సాగుతున్న క్రమంలో ఎదురుగా వ్యక్తి రావడంతో బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. బస్సు ఒక్కసారిగా కుదుపునకు గురైంది. బస్సుపైనా ఎక్కువ మంది ఉండటంతో బ్యాలెన్స్ తప్పి రెయిలింగ్ విరిగిపోయింది. రెయిలింగ్ పట్టుకొని నిలబడిన నేతలంతా కిందికి వంగిపోయారు. కేటీఆర్‌ను ఆయన గన్‌మెన్ పట్టుకోవడంతో ఆగిపోయారు. జీవన్‌రెడ్డి, డాక్టర్ మధుశేఖర్ కూడా బస్సుపైనే ఆగారు. కానీ, ఎంపీ సురేశ్‌రెడ్డి మాత్రం బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వారందరినీ కిందికి దించారు. ఎంపీ సురేశ్‌రెడ్డిని స్థానిక దవాఖానకు తరలించి చికిత్స అందించారు. గాయపడిన కేటీఆర్ వాటిని పట్టించుకోకుండా కొడంగల్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అదృష్టవశాత్తు తనకు ఏమీ జరుగలేదని, తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, కార్యకర్తలు, అభిమానులకు సూచించారు.
ఆర్మూర్ ఎన్నికల ర్యాలీ ఘటనలో చిన్న గాయం తప్ప మరేమీ కాలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాలు మీద రెండు చిన్న గాయాలు అయ్యాయి తప్ప మరేమీ కాలేదని గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు. తర్వాత కొడంగల్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నానని తెలిపారు. తన ప్రమాదంపై ఆందోళన చెందుతూ ఫోన్లు చేసిన, మెస్సేజ్ పంపినవారికి కేటీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్మూర్ ఎన్నికల ర్యాలీలో జరిగిన ఘటపై మంత్రి కేటీఆర్‌కు సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోన్ చేశారు. ఘటన గురించి ఆరా తీశారు. తాను బాగున్నానని కేటీఆర్ తనతో చెప్పారని కవిత ట్వీట్ చేశారు. కేటీఆర్ ఉత్తేజంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తారని తెలిపారు. టేక్ కేర్ రామన్న.. అంటూ ట్వీట్ చేశారు.